H-1B visa applicants; హెచ్-1బీ వీసా దరఖాస్తుదారుల మరో షాక్‌ ఇచ్చిన ట్రంప్‌ సర్కార్..!

అమెరికా హెచ్-1బీ వీసా(H-1B Visa) దరఖాస్తుదారులకు బిగ్‌ షాక్‌ ఇచ్చింది. అమెరికాలోని టెక్సాస్‌ స్టేట్‌ కళాశాలల్లో హెచ్‌-1బీ వీసా ఉద్యోగుల నియామకాలను డొనాల్డ్‌ ట్రంప్‌ ప్రభుత్వం ఆపేసింది. దీంతో, హెచ్‌-1బీ వీసాల కోసం ఎదురుచూస్తున్న వారికి షాక్‌ తగిలిందే అని చెప్పాలి. ఈ సందర్భంగా వీసాదారులపై టెక్సాస్‌ గవర్నర్‌ గ్రెగ్‌ అబాట్‌ తీవ్రమైన ఆరోపణలు చేశారు. ఎక్స్‌లో ఆయన స్పందిస్తూ.. హెచ్‌-1బీ వీసాలను దుర్వినియోగం చేస్తున్నారని సంచలన వ్యాఖ్యలు చేశారు. టెక్సాస్‌ రాష్ట్ర ఏజెన్సీలు, విశ్వవిద్యాలయాల హెచ్‌-1బీ పిటిషన్లు తక్షణమే నిలిపివేస్తున్నట్టు తెలిపారు. అదే సమయంలో అమెరికన్‌ ఉద్యోగాలు అమెరికన్లకే చెందాలని వ్యాఖ్యలు చేశారు. కొత్త హెచ్‌-1బీ వీసా దరఖాస్తులను వెంటనే నిలిపివేయాలని అన్ని రాష్ట్ర సంస్థలను ఆదేశిస్తున్నట్టు అబాట్ ఏజెన్సీ అధిపతులకు రాసిన లేఖలో తెలిపారు. కాగా, వీసాల నిలిపివేత మే 31, 2027 వరకు కొనసాగుతుందని చెప్పారు. అ‍మెరికాలోని సంస్థలు విదేశీ కార్మికులను ఉపయోగించుకునే ముందు అర్హత కలిగిన అమెరికా కార్మికులను నియమించుకోవాలన్నారు.

కాగా ఇండియన్‌ టెకీలకు అమెరికా ప్రయాణాల్లో మరింత జాప్యం చోటుచేసుకోనుంది. హెచ్‌-1బీ వీసాల స్టాంపింగ్‌ ఇంటర్వ్యూల అపాయింట్‌మెంట్లు 2027లోకి మారాయి. కొత్త ఇంటర్వ్యూల స్లాట్లకు కొరత ఏర్పడటంతో ఈ పరిస్థితి నెలకొంది. దీంతో వేలాది మంది వృత్తి నిపుణులు భారత్‌లోనే ఉండాల్సిన పరిస్థితి ఉంది. మరికొందరి ఉద్యోగాలు ప్రమాదంలో పడే పరిస్థితి తలెత్తింది. భారత్‌లోని అమెరికా కాన్సులేట్లలో దరఖాస్తులు పేరుకుపోయాయి. ఫలితంగా వీసా స్టాంపింగ్‌ ఇంటర్వ్యూలు 2027లోకి మారాయి. వాస్తవానికి డిసెంబర్‌ 2025లో వీటిల్లో తొలిసారి జాప్యం చోటుచేసుకొంది. నాడు ఇంటర్వ్యూలను మార్చి 2026కు మార్చాల్సి వచ్చింది. ఆ తర్వాత ఆ తేదీలు అక్టోబర్‌కు.. ఇప్పుడు 2027కు మారినట్లు మీడియా కథనాలు వెల్లడిస్తున్నాయి. ఢిల్లీ, ముంబై, చెన్నై, హైదరాబాద్‌, కోల్‌కతా కేంద్రాల్లో కొత్త ఇంటర్వ్యూ స్లాట్లు లేవు. దీంతో ప్రస్తుతం ఉన్న అపాయింట్‌మెంట్లను అధికారులు 18 నెలలు తర్వాతకు మార్చాల్సి వచ్చింది. ఫలితంగా 2027 సంవత్సరం మధ్యలోకి అవి చేరాయి. దీంతో, ఇమిగ్రేషన్‌ నిపుణులు ప్రస్తుతం అమెరికాలో ఉన్న వృత్తి నిపుణులు వీసా స్టాంపింగ్‌ కోసం తిరిగి భారత్‌కు వెళ్లవద్దని సూచిస్తున్నారు.

Updated On
ehatv

ehatv

Next Story