Rs. 1.5 crore in a cockfight: వామ్మో.. ఏకంగా కోటిన్నర తెచ్చేసిన కోడి..!

ఆంధ్రప్రదేశ్‌లో సంక్రాంతి సందర్భంగా జోరుగా, హుషారు, కోట్లల్లో పందేలు జరుగుతున్నాయనేదానికి ఈ పందెమే ఉదాహరణ. తాడేపల్లిగూడెంలో జరిగిన కోడిపందాల్లో ఓ కోడి ఏకంగా కోటి 43 లక్షలు గెలిచింది. పైబోయిన వెంకటరామయ్య ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన బరిలో 1 కోటి 53 లక్షల పందెం జరిగింది. గుడివాడ ప్రభాకర్ (సేతువ), రాజమండ్రి రమేష్ (డేగ) మధ్య భారీ పందెం నిర్వహించగా.. రాజమండ్రి రమేష్ డేగ విజేతగా నిలిచింది. పందాల్లో పాల్గొనేందుకు పందెం రాయుళ్లు భారీగా తరలివచ్చారు.
ఉమ్మడి పశ్చిమగోదావరి జిల్లాలో జోరుగా పందేలు జరగుతున్నాయి. పోలీసులు హెచ్చరించినా కానీ కోళ్లకు కత్తులు కట్టి పందేలు జరిపారు. ఈ పందేలకు ప్రజా ప్రతినిధులు దగ్గరుండి బరులను ప్రారంభించారు. పెద్ద ఎత్తున గుండాట, పేకాట, కోతాట, జూదాలను జరిగాయి. మొదటి రోజునే రూ.100 కోట్లకు పైగా నగదు చేతులు మారుతుందని అంచనా.
కోడి పందేలు, జూదాలు నిర్వహిస్తే కఠిన చర్యలు తీసుకుంటామంటూ పోలీసులు హెచ్చరించినా అది జరగని పని అని తేలిపోయింది. పశ్చిమగోదావరి, ఏలూరు జిల్లాల్లో ఎక్కడ చూసిన కోడిపందేల జోరే కనిపిస్తోంది. ఉదయం నుంచే పందేలు, గుండాట, పేకాటను మొదలుపెట్టేశారు. డేగాపురం, నరసాపురం, పెదఅమిరంలో భారీ మొత్తంలో జూద కార్యకలాపాలు నిర్వహిస్తున్నారు. భీమవరం, ఉండి, దెందులూరు, తాడేపల్లిగూడెం, నూజివీడు, ఉంగుటూరు, తణుకు తదితర చోట్ల ఏర్పాటుచేసిన పెద్ద బరుల వద్ద బౌన్సర్లను ఏర్పాటుచేశారు. పందెం కోసం పుంజులు తెచ్చినవారికి, డబ్బులు కాసేవారికి, చూసేందుకు వచ్చేవారికి వేర్వేరు చేతి బ్యాండ్లు ఇచ్చి గ్యాలరీల్లోకి అనుమతిస్తున్నారు.


