మనకు నచ్చినవారు, మనసుకు దగ్గరైన వారు మనకు దూరమైతే ఆ వేదన భరించలేనిది.

మనకు నచ్చినవారు, మనసుకు దగ్గరైన వారు మనకు దూరమైతే ఆ వేదన భరించలేనిది. ఆత్మీయులను కోల్పోవడన్నది అత్యంత బాధాకరమైన విషయం. అందులోంచి కోలుకోవడానికి కొన్నేళ్లు పడుతుంది.

అంతే కాదు, ఆ ప్రభావం జీవించి ఉన్నవారి వృద్ధాప్యంపై(Oldage) కూడా పడుతుంది. ఈ విషయాన్ని కొలంబియా విశ్వవిద్యాలయానికి చెందిన మెయిల్‌మన్‌ స్కూల్‌ ఆఫ్‌ పబ్లిక్‌ హెల్త్‌, బట్లర్‌ కొలంబియా ఏజింగ్‌ సెంటర్‌(Butler Columbia Aging Center) పరిశోధకులు చెబుతున్నారు. తల్లిదండ్రులనో, జీవిత భాగస్వామినో, తోబుట్టువులనో, లేదా పిల్లలలో కోల్పోయినప్పుడు వృద్ధాప్యం త్వరగా వస్తుందట! ఆత్మీయులను కోల్పోయిన వారికి వేగంగా వృద్ధాప్యం వస్తున్నట్టు వీరు గుర్తించారు. బాల్యం నుంచి వయోజనులయ్యే వరకు జీవితంలో ఆత్మీయులను కోల్పోవడానికి, జీవ సంబంధిత వృద్ధాప్యం వేగవంతమవడానికి మధ్య బలమైన సంబంధం ఉన్నట్లు పరిశోధకులు గుర్తించారు. వయసు పెరుగుతున్న కొద్దీ, కణజాలం, అవయవాలు పనిచేసే సామర్థ్యం తగ్గుతుందట! తీవ్ర స్థాయి వ్యాధులు వృద్ధి చెందే అవకాశాలు పెరుగుతాయట! ఆత్మీయులను కోల్పోవడానికి, జీవితాంతం ఆరోగ్య సమస్యలను ఎదుర్కోవడానికి మధ్య సంబంధం ఉందని పరిశోధకులు కనుగొన్నారు. నడి వయసుకు ముందే వృద్ధాప్య లక్షణాలు కనిపిస్తాయని పరిశోధనలో తేలింది. ఎక్కువ మంది ఆత్మీయులను కోల్పోయినవారికి వృద్ధాప్యం వేగంగా వచ్చినట్లు తెలిసింది. చిన్న వయసులోనే తల్లిదండ్రులను లేదా తోబుట్టువులను పొగొట్టుకున్నవారికి ఆ బాధ అంత త్వరగా పోదు. జీవితాంతం వెంటాడుతూనే ఉంటుంది. ఈ కారణంగానే మానసిక ఆరోగ్య సమస్యలు, గుండె సంబంధిత వ్యాధులు, అకాల మరణాలకు దారి తీసే అవకాశం ఉందని పరిశోధనలో తేలింది.

Updated On
Eha Tv

Eha Tv

Next Story