Dalai Lama Biography : దలైలామా జీవిత చరిత్రను కళ్లకు కట్టేలా రాసిన ప్రముఖ జర్నలిస్ట్ అరవింద్ యాదవ్..!
దివ్య మూర్తి పద్నాలుగో దలైలామా (Dalai Lama)టెన్జిన్ గ్యాత్సో జీవిత చరిత్రను ప్రసిద్ధ జీవిత చరిత్రల రచయిత

దివ్య మూర్తి పద్నాలుగో దలైలామా (Dalai Lama)టెన్జిన్ గ్యాత్సో జీవిత చరిత్రను ప్రసిద్ధ జీవిత చరిత్రల రచయిత, ప్రముఖ జర్నలిస్ట్ డాక్టర్ అరవింద్ యాదవ్(Dr. Arvind Yadav) ఎంతో పరిశోధన చేసి, సమగ్రంగా రాశారు. సమున్నత ఆధ్యాత్మిక నాయకుడి జీవిత విశేషాలతో ఇప్పటికి అనేక పుస్తకాలు వచ్చాయి. దలైలామా జీవితంలోని అరుదైన వాస్తవాలు, ఇప్పటికి కూడా తెలియని సంఘటనలతో డా. అరవింద్ రాసిన ఈ మహత్తర గ్రంథం మిగిలిన అన్నింటి కన్నా భిన్నంగా, అసమానంగా ఉంది. డా.అరవింద్ రచించిన ఈ జీవిత చరిత్రను ఈ ఏడాది ఇంగ్లిష్(English), హిందీ(Hindi), తెలుగు(Telugu)లో విడుదల చేస్తున్నారు. 2025 జులై 9న ఆరంభమయ్యే దలైలామా 90వ జన్మదిన ఉత్సవాల సందర్భంగా ఈ పుస్తకం పాఠకుల ముందుకు వస్తోంది. ఈ గ్రంథ రచన వెనుక ఉన్న కృషిని గుర్తించిన దలైలామా దీని రచయితను∙హృదయపూర్వకంగా ప్రశంసించారు.
‘‘నా జీవిత కథను ఐదు పుస్తక భాగాలుగా తీసుకురావడానికి అంకితభావంతో కృషిచేస్తున్న డాక్టర్ అరవింద్ యాదవ్‌కు అభినందనలు. టిబెట్ చరిత్రను, బౌద్ధం యొక్క తాత్వికతను అర్ధంచేసుకోవడంలో అరవింద్ సాగించిన సునిశిత పరిశోధన, లోతైన అద్యయనం నా ప్రయాణం గురించి, నేను నిలబెట్టాలని ప్రయత్నిస్తున్న విలువల గురించి తెలుసుకోవాలనుకునే వారికి గొప్ప వనరుగా ఉపయోగపడుతుంది.’’
ఇంకా ఆయన ఈ గ్రంథం గురించి చెబుతూ..
‘‘బాల్యం నుంచి ప్రవాసం దాకా నా జీవనయానాన్ని గుదిగుచ్చడం ద్వారా డాక్టర్. యదవ్ టిబెట్ ప్రజల ఆకాంక్షలను, చర్చలే సాధనంగా సాగుతున్న వారి అచంచల అహింసా మార్గాన్ని సాధికారికంగా నమోదు చేసినట్లయింది. మానవ విలువలను, మత సామరస్యాన్ని పెంపొందించడంలోనూ–టిబెట్ ప్రాంతపు సంస్కృతిని, పర్యావరణాన్ని కాపాడడంలోనూ–ప్రాచీన భారత దేశ జ్ఞానం పట్ల అవగాహనను, ఆసక్తిని రేకెత్తించడంలోనూ అంకితభావంతో నేను చేస్తున్న కృషికి ఈ పుస్తకం అద్దం పట్టింది. సుసంపన్నమైన టిబెట్ వారసత్వాన్ని, వర్తమానంలో అది చేస్తున్న పోరాటాన్ని ప్రపంచం దృష్టికి తీసుకు వచ్చేలా ఓ పుస్తకం రాస్తానని 2022లో డాక్టర్ యాదవ్ నాకు మాటిచ్చారు. ఇచ్చిన మాటను నిలబెట్టుకున్న తనకు హృదయపూర్వక కృతజ్ఞతలు.’’ ఈ బయో బుక్ ఇంగ్లీష్, హిందీ, తమిళంలో అందుబాటులో ఉంది. తద్వారా అనేక మంది పుస్తక ప్రియులను ఇది ఆకట్టుకోనుంది. మానవ సవాళ్లను ఎలా ఎదుర్కోవాలో ఇందులో స్పష్టంగా వివరించారు. ముఖ్యంగా నేను ఆచరించే ప్రేమ, కరుణ, సహనం, క్షమాగుణం, దయ, మానవుల ఐక్యత గురించి ఇందులో పొందుపరిచారని అరవింద్‌యాదవ్‌ను దలైలామా ప్రసంసించారు
ఈ పుస్తకం ముందుమాటలో ప్రఖ్యాత రచయిత, రాజనీతిజ్ఞడు, తత్వవేత్త డా.కరణ్ సింగ్ ఇలా రాశారు:
‘‘దలైలామా జీవితం గురించి, ఆయన సాధించిన గొప్ప విజయాల గురించి సామాన్య జనానికి తెలిసింది తక్కువ. దలైలామా ప్రయాణాన్ని సమగ్రంగా ప్రతిబింబించే ఒక జీవిత చరిత్ర పుస్తకం రావాల్సిన అవసరం ఉంది. హైదరాబాద్‌కు చెందిన పాత్రికేయుడు శ్రీ అరవింద్ యాదవ్ తన విస్తృత అధ్యయనం ద్వారా దలైలామా జీవిత చరిత్రను హిందీలో రచించారు. ఆ పుస్తకమే ఇప్పుడు మీ చేతుల్లో ఉంది. నేను ఎంతో ప్రేమగా ‘డియర్ ఫ్రెండ్’ అని పిలుచుకునే దలైలామా వ్యక్తిత్వాన్ని, ఆయన జీవిత యాత్రను ఈ పుస్తకం మన ముందు ఉంచుతోంది. ఇంత గొప్ప పనిని ఎంతో శ్రద్ధతో చేసిన అరవింద్ యాదవ్‌ను మనసారా అభినందిస్తున్నాను. ఈ పుస్తకం దేశవిదేశాల్లో విస్తృత ప్రాచుర్యం పొందగలదని ఆశిస్తున్నాను.’’
గొప్ప వ్యక్తుల జీవిత చరిత్రలు రాయడం డా.అరవింద్ యాదవ్‌కు కొత్త కాదు. ఇది వరకు ఆయన భారతదేశానికి చెందిన అత్యంత ప్రభావశీలురైన వ్యక్తుల జీవిత కథలను పుస్తక రూపంలో వెలువరించారు. డా.యాదవ్ గతంలో జీవిత కథలు రాసిన ఈ ప్రముఖ వ్యక్తుల్లో ప్రసిద్ధ శాస్త్రవేత్త సి.ఎన్.ఆర్.రావు, భారత తొలి హృద్రోగ నిపుణురాలు డాక్టర్ పద్మావతి, సంఘ సంస్కర్త ఫూల్ బాసన్ యాదవ్, దూరదృష్టి గల దార్శినిక వ్యాపారవేత్త సర్దార్ జోద్ సింగ్, వైద్యుడు, వైద్య సంస్థల నిర్మాత నిమ్మగడ్డ ఉపేంద్రనాథ్, ప్రసిద్ధ వైద్యులు డాక్టర్ వేమిరెడ్డి రాధికా రెడ్డి, డా.పిగిలం శ్యామ్ ప్రసాద్, డా.పవన్ అడ్డాల ఉన్నారు.
హైదరాబాద్‌లో పుట్టిపెరిగిన డా.యాదవ్ ఉస్మానియా యూనివర్సిటీలో ఎంఏ ఇంగ్లిష్, హిందీ కోర్సుల్లో ఉత్తీర్ణుడయ్యారు. ఇంకా సైన్స్, సైకాలజీ, లా వంటి అంశాలపై తగినంత పరిజ్ఞానం సంపాదించారు. దక్షిణ భారతదేశ రాజకీయాలు, సంస్కృతిపై డా.యాదవ్‌కు లోతైన అవగాహన ఉంది. అనేక ప్రాంతాల్లోని గ్రామాలు, నగరాల్లో ఆయన విస్తృత పర్యటనలు రచనా, పాత్రికేయ రంగాల్లో డా.యాదవ్ సామర్ధ్యానికి కొత్త బలాన్నిస్తున్నాస్తున్నాయి. దలైలామాపై రాసిన ఈ తాజా పుస్తకంతో డా.యాదవ్ లోతైన పరిశోధనను, ఆకట్టుకునేలా వివరించే కథనాన్ని మరోసారి చదివి ఆనందించవచ్చు. ప్రపంచంలో అత్యంత గౌరవనీయుడైన ఆధ్యాత్మిక నాయకుడి కాంతిమంతమైన జీవితం లోతులను ఈ గ్రంథంలో చక్కగా వివరించారు.
