Southwest Monsoon : చల్లని కబురు.. అండమాన్‌ను తాకిన నైరుతి రుతుపవనాలు
ఎండ వేడితో మాడుతున్న దేశానికి చల్లని కబరు వచ్చేసింది. దేశానికి అత్యధికంగా వర్షపాతానిచ్చే నైరుతి రుతుపవనాలు మరింత చురుగ్గా కదులుతున్నాయి.

ఎండ వేడితో మాడుతున్న దేశానికి చల్లని కబరు వచ్చేసింది. దేశానికి అత్యధికంగా వర్షపాతానిచ్చే నైరుతి రుతుపవనాలు మరింత చురుగ్గా కదులుతున్నాయి. మంగళవారం మధ్యాహ్నం నాటికి అవి దక్షిణ అండమాన్ సముద్రం(Andaman Sea), నికోబార్ (Nicobar)దీవులు, దక్షిణ బంగాళాఖాతానికి చేరినట్లు భారత వాతావరణ విభాగం వెల్లడించింది. రుతుపవనాల ఆగమనం దృష్ట్యా గత రెండు రోజులుగా నికోబార్ దీవుల్లో భారీ వర్షాలు కురుస్తున్నాయని పేర్కొంది. రానున్న మూడు, నాలుగు రోజుల్లో అండమాన్ నికోబార్ దీవులంతటితో పాటు దక్షిణ అరేబియా సముద్రం(Arabian Sea), బంగాళాఖాతం మధ్య వరకు విస్తరించేందుకు వాతావరణ పరిస్థితులు అనుకూలంగా ఉన్నాయని ఐఎండీ వెల్లడించింది. మే 27 నాటికి ఈ రుతుపవనాలు కేరళను తాకే అవకాశం ఉన్నట్లు ఇప్పటికే వాతావరణ శాఖ అంచనా వేసిన సంగతి తెలిసిందే.
సాధారణంగా జూన్ 1 నాటికి రుతుపవనాలు పలకరిస్తుంటాయి. ఈ సారి మాత్రం అంతకంటే ముందుగానే వచ్చేందుకు అవకాశాలు కన్పిస్తున్నాయి. అలా జరిగితే 2009 తర్వాత రుతుపవనాలు అంచనాల కంటే ముందుగా రావడం మళ్లీ ఇప్పుడే అవుతుంది. ఆ ఏడాది మే 23నే నైరుతి రుతుపవనాలు కేరళను తాకాయి. ఈ సారి సాధారణం కంటే ఎక్కువ వర్షపాతం నమోదయ్యే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది....
మన దేశంలో 52% నికర సాగు భూమికి ఇప్పటికీ వర్షపాతమే ప్రధాన ఆధారం. దేశ మొత్తం వ్యవసాయ ఉత్పత్తిలో ఈ సాగు భూమి నుంచి ఏకంగా 40% దిగుబడి వస్తుంది. అందుకే భారత ఆహార భద్రత, ఆర్థిక స్థిరత్వంలో నైరుతి రుతు పవనాలు కీలక పాత్ర పోషిస్తాయి. దేశవ్యాప్తంగా తాగునీరు, విద్యుత్ ఉత్పత్తికి కీలకమైన జలాశయాలను తిరిగి నింపడానికి, దేశ జీడీపీ తోడ్పాటుకు ఇది ఎంతో ముఖ్యం.
