తెలుగు సినిమాకు వ్యాపార పరిధి పెరగడమన్నది మొదలైంది ఆ చిత్రంతోనే! తెలుగు సినిమా వ్యాకరణం నేర్చుకుంది ఆ చిత్రంతోనే! తెలుగు సినిమా కమర్షియల్‌ హంగులు దిద్దుకుంది ఆ చిత్రంతోనే! తెలుగు ప్రేక్షకుడితో హర్షాతిరేకాలు చేయించింది, నిర్మాతల నట్టింట్లో కనక వర్షాలూ కురిపించింది, వింతలు వినోదాలతో సామాన్యుడి బాధలను మరపించింది-మురిపించింది- మైమరపించింది, మహానటుడు ఎన్టీయార్‌ను ఓవర్‌నైట్‌ స్టార్‌ను చేసింది ఆ చిత్రమే! విశ్వనట చక్రవర్తి ఎస్వీయార్‌ కెరీర్‌ను మలుపు తిప్పిందా సినిమా... పింగళి నాగేంద్రరావును మళ్లీ వెనక్కి తిరిగి […]

తెలుగు సినిమాకు వ్యాపార పరిధి పెరగడమన్నది మొదలైంది ఆ చిత్రంతోనే! తెలుగు సినిమా వ్యాకరణం నేర్చుకుంది ఆ చిత్రంతోనే! తెలుగు సినిమా కమర్షియల్‌ హంగులు దిద్దుకుంది ఆ చిత్రంతోనే! తెలుగు ప్రేక్షకుడితో హర్షాతిరేకాలు చేయించింది, నిర్మాతల నట్టింట్లో కనక వర్షాలూ కురిపించింది, వింతలు వినోదాలతో సామాన్యుడి బాధలను మరపించింది-మురిపించింది- మైమరపించింది, మహానటుడు ఎన్టీయార్‌ను ఓవర్‌నైట్‌ స్టార్‌ను చేసింది ఆ చిత్రమే! విశ్వనట చక్రవర్తి ఎస్వీయార్‌ కెరీర్‌ను మలుపు తిప్పిందా సినిమా... పింగళి నాగేంద్రరావును మళ్లీ వెనక్కి తిరిగి చూడకుండా చేసింది కూడా ఆ సినిమానే! నరుడా ఏమి నీ కోరికంటూ అడిగి మరీ ప్రేక్షకులకు షడ్రోసోపేతమైన వినోదపు విందును అందించిన ఆ సినిమానే విజయా వారి పాతాళ భైరవి! సరిగ్గా 72 ఏళ్ల కిందట విడుదలైన మరపురాని మనోజ్ఞ చిత్రరాజంపై ప్రత్యేక కథనం.

మనం చేసేది జనం చూడటం కాదు, జనం కోరేది మనం చేయాలన్న సూత్రాన్ని త్రికరణశుద్ధిగా నమ్మిన సంస్థ విజయా. షావుకారుతో తెలుగు సినీ పరిశ్రమకు తొలి అభ్యుదయ చిత్రాన్ని అందించి కీర్తినయితే సంపాదించింది కానీ డబ్బు మూటగట్టుకోలేకపోయింది. కళను పండించడంతో పాటు కాసులను గడించాలనే దృఢ నిశ్చయానికొచ్చేసింది. సామాన్య పాటక జనం మెచ్చే విధంగా సినిమా తీయాలనుకుంది... అందుకే రెండో సినిమాకు అరేబియన్‌ నైట్స్‌ తరహా కథను ఎన్నుకుంది. అల్లావుద్దీన్‌ అద్భుతదీపాన్ని తెలుగు జానపద గాధగా మలచి సగటు తెలుగు ప్రేక్షకుడు ఆనందాశ్చర్యాలకు లోనయ్యేలా చేసింది. ఓ ట్రెండ్‌ సెట్టర్‌గా తీర్చిదిద్దింది...

సినిమాకో గ్రామర్‌ వుంటుందన్న సంగతి బహుశా కె.వి.రెడ్డికి తెలిసినంతగా మరెవ్వరికీ తెలియదు. పింగళి నాగేంద్రరావు కూడా దాన్ని పూర్తిగా అధ్యయనం చేశాడు. వీరిద్దరు సినిమా వ్యాకరణంలో పండితోత్తములు. లేకపోతే అల్లావుద్దీన్‌ అనే అరేబియన్‌ నైట్స్‌ కథను తెలుగు జానపద కథగా తీర్చిదిద్దడం ఇంకొకరికి సాధ్యమవుతుందా? పాతాళభైరవి కథ పింగళిదయితే దానికి సీనిక్‌ ఆర్డర్‌ పేర్చింది కె.వి.రెడ్డి, కమలాకర కామేశ్వరరావు. ఆ సన్నివేశాలకు పసందైన మాటలను, సందర్భోచితమైన పాటలను సమకూర్చింది మళ్లీ పింగళే!

టెన్‌ కమాండ్స్‌మెంట్‌ డైరెక్టర్‌ సిసెల్‌ బి డిమిలీని ఓసారి ఎవరో అడిగారు. సార్‌...మీరెందుకు ఎక్కువగా బైబిల్‌ కథలనే ఎంచుకుంటారు అని. అందుకు ఆయన బైబిల్‌ కథలకు రెండు వేల సంవత్సరాల పబ్లిసిటీ వాల్యూ వుంది కాబట్టి అని సమాధానమిచ్చాడు. కాశీమజిలీ కథలకూ అంతే పబ్లిసిటీ వాల్యూ వుంది. రాజుగారి కూతురు ప్రేమను ఓ సామాన్యుడు దక్కించుకోవడమే కాకుండా ఆమెను పెళ్లి చేసుకోవడమన్నది ఎవరినైనా ఆకర్షించే పాయింటే! కారణం ప్రతీ ఒక్కరి కోరిక కూడా అదే కాబట్టి. అరేబియన్‌ నైట్స్‌ కథలోని అల్లావుద్దీన్‌ అద్భుతదీపాన్ని ఎంచుకుని దాన్ని తెలుగు తాలింపు పెట్టారు.. అక్కడ అల్లావుద్దీన్‌ ఇక్కడ తోటరాముడు. అక్కడ కథానాయకుడి పక్కన ఓ కోతి. ఇక్కడ అంజిగాడు. అక్కడ అద్భుత దీపం. ఇక్కడ పాతాళభైరవి. అల్లావుద్దీన్‌లో కూడా తల్లి తెలియక దీపాన్ని మళ్లీ మాంత్రికుడి చేతికే అప్పగిస్తుంది. పాతాళభైరవిలోనూ అంతే. రెండింటిలోనూ చివరికి మాంత్రికుడు కథానాయకుడి చేతిలో కన్నుమూస్తాడు

సరే, కథ దొరికింది. దర్శకుడు, రచయిత, సంగీత దర్శకుడు, ఛాయాగ్రాహకుడు,కళా దర్శకుడు ఇలా అందరూ కూర్చుని మూడు నాలుగు నెలలు సమగ్రమైన చర్చలు జరిపారు. ఆ తర్వాత స్క్రిప్టు మొదలు పెట్టారు...స్క్రిప్టు పక్కాగా తయారవ్వడానికి ఏడు నెలలు పట్టింది. అంతా సిద్ధమయ్యాకే సెట్స్‌ మీదకెళ్లారు. అలా 1950, ఫిబ్రవరి అయిదున షూటింగ్‌ ఆరంభమైంది. ఆ మరుసటి ఏడాది ఫిబ్రవరి ఎనిమిదికి పూర్తయింది. విజయావారి మొదటి సినిమా షావుకారులో హీరోగా నటించిన ఎన్టీయార్‌నే తోటరాముడి పాత్రకు ఎన్నుకున్నారు.. ఏ శుభ ముహూర్తానా ఎన్టీయార్‌ తోటరాముడి పాత్రకు సెలెక్టయ్యాడో కానీ రాత్రికి రాత్రే స్టార్‌ అయి కూర్చుకున్నాడు. జనం చేత జేజేలు పలికించుకున్నాడు. ఇక్కడో విషయం చెప్పుకోవాలి. పాతాళభైరవి నాటికి ఎన్టీయార్‌ హీరోయిజానికి కొత్త. అందుకే ఆయన సాహసాలు చూపించేందుకు సినిమాలో నాలుగైదు రీళ్లు వెచ్చించాల్సి వచ్చింది. తదనంతర కాలంలో విజయా సంస్థే తీసిన జగదేకవీరుని కథలో ఈ పరిస్థితి తలెత్తలేదు. కారణం అప్పటికి ఎన్టీయార్ మాస్‌ హీరో అయ్యాడు.అంచేత ఆయన హీరోయిజాన్ని ఎస్టాబ్లిష్‌ చేయడానికి పెద్దగా కష్టపడాల్సిన పనిలేకుండాపోయింది...

సినిమాకు గుండెకాయ వంటి మాంత్రికుడు పాత్ర విచిత్రాతివిచిత్రంగా ఎస్వీయార్‌కు దక్కింది. మాంత్రికుడంటే భీకరంగా వుండాలి. పగలు చూస్తే రాత్రిళ్లు కలలోకొచ్చి జడిపించాలి. అప్పట్లో ఇలాంటి పాత్రలకు ముక్కామల పెట్టింది పేరు. కొట్టిన పిండి. ముందు నేపాళ మాంత్రికుడి పాత్రకు ఆయన్నే అనుకున్నారు. అయితే సినిమాకు అత్యంత కీలకమైన ఈ పాత్రలో ఓ కొత్తదనం కనిపించాలంటే ఆ పాత్రను ధరించే మనిషి కూడా కొత్తవాడయివుండాలన్నది దర్శక నిర్మాతల ఆలోచన. చాలా రోజులు తర్జనభర్జన పడి, కళా దర్శకుడితో స్కెచ్‌లు గీయించి, ఒకటికి రెండు సార్లు ఆలోచించి ఆఖరికి ఎస్వీయార్‌ను ఖరారు చేశారు. ఎస్వీయార్‌ వేయడం వల్లే ఆ పాత్రకు నిండుదనమొచ్చింది. అంతకు ముందు విజయావారు తీసిన షావుకారులో సున్నంరంగడు వేషం వేసాడు కానీ అదేం పెద్దగా పేరు తెచ్చిపెట్టలేదు. అలాంటిది మాంత్రికుడి పాత్రను ఎస్వీయార్‌కు ఇవ్వడం చాలా మందికి ఆశ్చర్యం కలిగించింది.. విజయా అధినేతలైన నాగిరెడ్డి-చక్రపాణిలకు మతిపోయిందని చాటుగా వ్యాఖ్యానించిన వారు కూడా వున్నారు. కానీ ఎస్వీయార్‌ దంచిపారేశాడు.అంతకు ముందే షేక్స్‌పియర్‌ నాటకాల్లో విశేషానుభవం గడించిన ఎస్వీయార్‌కు ఇదో లెక్కా! షైలాక్‌ వేషానికి కొంత రౌద్ర, భయానక లక్షణాలు కలుపుకుని మాంత్రికుడి పాత్రకు ప్రాణ ప్రతిష్ట చేశాడు. సినిమాల్లోని మాంత్రికుడి డైలాగులు ఇప్పటికీ జనం నాలుకల మీద తారాడుతున్నాయంటే ఆ ఘనత ఎస్వీయార్‌దే! పాతాళభైరవి వచ్చిన మరుసటి ఏడాది పెళ్లి చేసి చూడు వచ్చింది. ఆ సినిమా శతదినోత్సవ వేడుకలకు నటీనటులంతా విజయవాడకు వస్తున్నారు. సూళ్లూరుపేటలో రైలు ఆగిందో లేదో ఎస్వీయార్‌ను చూసేందుకు జనం తండోపతండాలుగా వచ్చారు. ఆ ట్రైన్‌లో ఎన్టీయార్‌...సావిత్రి వున్నా వాళ్లను పట్టించుకోకుండా రంగారావు వెంటే పడ్డారు. ఎస్వీయార్‌ పట్ల ప్రజల వీరాభిమానానికి పాతాళభైరవే కారణమని ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. అప్పుడప్పుడు కనిపించే పాతాళభైరవిగా నటించింది గిరిజ. నరుడా ఏమి నీ కోరిక అన్న ఆమె డైలాగు ఇప్పటికీ చాలా పాపులర్‌. గిరిజ ప్రసిద్ధ నటి దాసరి తిలకం కూతురు. ఎస్వీ రంగారావు నటించిన తొలి చిత్రం వరూధినిలో ఈవిడే వరూధిని. ప్రవరుడి పాత్రను ఎస్వీయార్‌ వేశాడు.. అప్పటికే తిలకానికి రంగస్థలం మీద నటించిన అపార అనుభవముంది. ఎస్వీయార్‌కేమో కొత్త. తిలకం సరసన ఎస్వీయార్‌ భయపడుతూ నటించాడు. బెదురుగొడ్డు ప్రవరాఖ్యుడిని చూసి జనం పెదవి విరిచారు. సినిమా కూడా దారుణంగా పోయింది. హీరోగా ఎస్వీయార్‌కు అదే మొదటి చివరి చిత్రమైంది. ఆ తర్వాతే ఎస్వీయార్‌ అవతలి పాత్రను కూడా డామినేట్‌ చేయడాన్ని అలవర్చుకున్నాడు. ఆ విద్యను నేర్పింది పాతాళభైరవి సినిమానే! ఈ మాంత్రికుడికో శిష్యుడు..వాడిపేరు సదాజపుడు. ఈ పాత్రను వేసింది పద్మనాభం. అప్పటికి అతను బి.పద్మనాభరావు. కడప జిల్లా సింహాద్రిపురం నుంచి వచ్చి సినిమాల్లో చిన్న చితకా వేషాలు వేసుకుంటున్నాడు. షావుకారులో పోలాయిగా కనిపిస్తాడు. ప్రేక్షకులకు మనిషైతే తెలిసాడు కానీ అతడిలో వున్న టాలెంట్‌ను పసిగట్టలేకపోయారు. పాతాళభైరవితో పద్మనాభం దశ తిరిగింది..

గుణసుందరి కథలో రాజుగారి రెండో కూతురుగా, భక్తపోతనలో శ్రీనాథుని కుమార్తెగా వేసిన మాలతీని హీరోయిన్‌గా ఎంపిక చేశారు. ఇదే సినిమాకు పెద్ద లోపం. ఎన్టీయార్‌ ముందు ఈవిడ వెలవెలపోయింది. కొన్ని సన్నివేశాల్లో రామారావు కంటే పెద్దగా కూడా కనిపించింది. బహుశా ఈ జోడిని చూసే శ్రీశ్రీ ఎంత ఘాటు ప్రేమయో పాటకు కొనసాగింపుగా ఇంత లేటు వయసులో అని రాశాడేమో! రాజుగారి పాత్రను వేసింది సిఎస్‌ఆర్‌. ఉజ్జయినీ మహారాజులా కనిపించడు. ఆ సాహసమూ వున్నట్టు అనిపించదు. ప్రతిదాన్నీ తేలిగ్గా తీసుకునే సరసుడిలా కనిపిస్తాడు. అయినా ఆ వేషమేసింది సిఎస్‌ఆర్‌ కాబట్టి ప్రేక్షకులు పెద్దగా పట్టించుకోలేదు. రాణిగా హేమలతమ్మారావు నటించారు. తోటరాముడి తల్లిగా వేసిన సురభి కమల తెలుగు చలన చిత్ర సీమకు తొలి మహిళా కళాకారిణి. ఇక అంజిగాడుగా వల్లూరి బాలకృష్ణ వేశాడు.. ఓ నటుడు తన పాత్ర పేరుతోనే జనం నోళ్లలో నానడమన్నది బాలకృష్ణతోనే మొదలైంది. అంతకు ముందు 1936లో కీచకవధ, చిత్రనళీయం సినిమాల్లో బాలకృష్ణ నటించాడు కానీ పాతాళభైరవే అతడి సత్తాను పది మందికి తెలిపింది. ఇక రాజుగారి బావమరిది శూరసేనుడుగా వేసింది విజయావారి పర్మనెంట్‌ ఆర్టిస్టు రేలంగి. నళినిగా చిట్టి వేసింది. సత్రం సన్నివేశంలో భాగవతుల అమ్మిగా కనిపించింది టి.జి.కమల.

ఉజ్జయినిలోని సత్రం దగ్గర మాంత్రికుడు చేసే మంత్ర విద్యలు ప్రేక్షకులను అమితంగా ఆకట్టుకున్నాయి. రాతిని కోతిగా చేస్తాడు. మళ్లీ ఆ కోతిని నాతిగా మార్చి ఆమెతో నాట్యం చేయిస్తాడు. ఇక్కడ నర్తకిగా కనిపించింది లక్ష్మీకాంతం. అప్పట్లో ఈవిడ విలాసిని పాత్రలకు బహు ప్రసిద్ధి. ఇక్కడో విషయం. పాతాళభైరవిలో ఈవిడకు పెట్టిన వగలోయ్‌ వగలు పాట ఆ రోజుల్లో జన బాహుళ్యంలోకి చొచ్చుకుపోయింది.. ఇందులో వచ్చే లలలూ లలలూ అన్న బిట్‌ను ఇప్పటికీ హమ్‌ చేసేవాళ్లు కోకొల్లలు. పాడింది జిక్కి . పాటలో తళుకు అని వచ్చినప్పుడల్లా జిక్కీ థళుకు అని పలకడం వల్ల తళుకుకి అందమైన ఒత్తడి, .ఊపు వచ్చాయి. ఈ పాటకు లవ్స్‌ ఆఫ్‌ కార్‌మెన్‌ అన్న హాలీవుడ్‌ చిత్రంలో రీటా హేవర్త్‌ పాడే పాట ప్రేరణ.

పాతాళభైరవి కథను సంక్షిప్తంగా చెప్పాలంటే ఓ తోటరాముడు. అతడికో అసిస్టెంట్‌ అంజిగాడు. ఓ రోజు చెలికత్తెలతో ఉద్యానవనానికి వచ్చిన రాజుగారి కుమార్తెను తోటరాముడు ఘాటుగా ప్రేమిస్తాడు. రాకుమారి కూడా తోటరాముడి తెగువకు, నిజాయితీకి, శౌర్యానికి ముగ్దురాలవుతుంది. ఇద్దరూ పీకల్లోతూ ప్రేమలో పడిపోతారు.. విషయం తెలుసుకున్న రాజుగారు తనతో సరితూగగల ధనాన్ని సంపాదించుకొస్తే కూతుర్నిచ్చి పెళ్లి చేస్తానంటాడు... దానికి తోటరాముడు సిద్ధపడతాడు... సరిగ్గా ఈ సమయంలోనే నేపాళ మాంత్రికుడు రంగ ప్రవేశం చేస్తాడు.రాకుమారి కోసం తోటరాముడు ప్రాణాలివ్వడానికైనా సిద్ధపడతాడు...ఈ బలహీనతను తన స్వార్థానికి ఉపయోగించుకోవాలనే దురాలోచన మాంత్రికుడిది..ప్రపంచంలోని అన్ని శక్తులనూ జయించే పరమశక్తి పాతాళభైరవిని తన పాదాక్రాంతం చేసుకోవడమే నేపాళ మాంత్రికుడి ఏకైక లక్ష్యం.అందుకు దేవిని ప్రసన్నం చేసుకోవాలి. దేవి ప్రసన్నం కావాలంటే ఓ సాహసిని, సన్మార్గుణ్ణి ఆమెకు బలి ఇవ్వాలి...అందుకే తోటరాముడిని మచ్చిక చేసుకుంటాడు...రాముడికి పాపం మాంత్రికుడి పన్నాగం తెలియదు.. అతడి వెంట బయలుదేరుతాడు.. ఇద్దరూ ఓ మంత్రాల మర్రిచెట్టు దగ్గరకి చేరుతారు... అక్కడ్నుంచి పాతాళబిలంలోకి వెడతారు. దేవిని ప్రసన్నం చేసుకునేందుకు ముందు పుష్కరిణిలో స్నానం చేసి శుచివై రమ్మని చెబుతాడు తోటరాముడితో మాంత్రికుడు . పుష్కరిణిలో దిగిన రాముడిని మొసలి నోట కరుచుకుంటుంది... రాముడు దాంతో పోరాడి చంపేస్తాడు.. ఆ మొసలి శాపగ్రస్థ అయిన యక్షకన్య. తనకు శాపవిమోచనం కలిగించిన రాముడి పట్ల కృతజ్ఞతతో మాంత్రికుడి దుర్బుద్ధినంతా వివరించి చెబుతుంది. మాంత్రికుడిని బలి ఇచ్చి దేవిని ప్రసన్నం చేసుకోమని సలహా ఇస్తుంది. రాముడు ఆమె చెప్పినట్టే చేసి దేవిని ప్రసన్నం చేసుకుంటాడు. పాతాళభైరవి ప్రత్యక్షమై తన ప్రతిమను రాముడికి ఇస్తుంది. తలచుకున్నప్పుడల్లా ప్రత్యక్ష్యమై కోరిక కోరిక తీరుస్తాననే వరాన్ని ప్రసాదిస్తుంది...

నిజానికి మాంత్రికుడి తలను రాముడు నరికేయడంతోనే సినిమా ముగియాలి. కానీ అది సినిమాకు సబ్‌ క్లయిమాక్స్‌ మాత్రమే. గురువుకు పట్టిన దుస్థితిని దుర్భిణిలో చూసిన సదాజపుడు సంజీవినితో తలా మొండాన్ని కలిపి మాంత్రికుడికి మళ్లీ ప్రాణం పోస్తాడు. ఈలోగా పాతాళభైరవి సాయంతో రాముడు రాజుగారి తోటలోనే మాయామహల్‌ను సృష్టించుకుంటాడు. సిరిసంపదలను సంపాదించుకొచ్చిన రాముడికి కూతురునిచ్చి పెళ్లి చేసేందుకు రాజుగారు కూడా అంగీకరిస్తాడు. సరిగ్గా అదే సమయంలో మాంత్రికుడు రాజుగారి బావమరిదిని చేరదీసి పాతాళభైరవి ప్రతిమను చేజిక్కించుకుంటాడు. రాకుమారిని మాయామహల్‌తో సహా తన గుహకు ఎత్తుకుపోతాడు. రాజుగారు తోటరాముడ్నే అనుమానిస్తాడు. కథానాయకుడు మాంత్రికుడిని ఎలా మట్టుపెట్టాడు. తన నిర్దోషిత్వాన్ని ఎలా నిరూపించుకున్నాడన్నది క్లయిమాక్స్‌...

పాతాళభైరవి అంత కళాత్మకంగా అంత రసాత్మకంగా అంత జనరంజకంగా తీర్చి దిద్దిన ఘనత దర్శకవరణ్యేడు కదిరి వెంకటరెడ్డిదే! సినిమాకు స్క్రీన్‌ప్లేనే ప్రాణమని త్రికరణశుద్ధిగా నమ్మే దిగ్దర్శకుడాయన. ఆయన సినిమాల్లో మచ్చుకు ఒక్క సన్నివేశం కూడా అనవసరమనిపించదు. స్క్రిప్ట్‌ రూపొందిస్తున్నప్పుడే అన్నీ పక్కాగా రాసుకునేవారు.. స్క్రిప్ట్‌ తయారయిందంటే సినిమా పూర్తయినట్టేనని భావించేవారు.. స్క్రిప్ట్‌ మీద నమ్మకం లేనివాడే షూటింగ్‌ సమయంలో మార్పులు చేస్తాడనేది ఆయన నమ్మిక... ఇప్పుడలాంటి దర్శకులు లేరు. మున్ముందు వస్తారన్న ఆశా లేదు. పాతాళభైరవి విజయం విషయంలో కె.వి.రెడ్డికి ఎలాంటి అనుమానాలు లేవు.. నిర్మాణ సమయంలో సినిమా రష్‌ వేరేవాళ్లు చూడటం ఆయనకు ఇష్టం వుండదు.. సినిమా కంప్లీట్‌ అయ్యాక కూడా ప్రివ్యూకు అంగీకరించేవారు కాదు. సామాన్య ప్రేక్షకులే అంతిమ నిర్ణేతలన్నది ఆయన థియరీ! ఇందులో ఎట్టి పరిస్థితుల్లోనూ కాంప్రమైజ్‌ అయ్యేవారు కాదు.. అయితే పాతాళభైరవి విషయంలో ఆయనకు తెలియకుండా ఓ సంఘటన జరిగిపోయింది. సినిమా రేపు విడుదలనగా ముందురోజు అర్ధరాత్రి బెజవాడ దుర్గకళామందిర్‌లో చిత్ర ప్రముఖులకు ప్రివ్యూ వేశారు. సినిమా చూసిన వాళ్లంతా మహా అయితే నాలుగు వారాలని తేల్చేశారు..

విషయం తెలిసిన నాగిరెడ్డి-చక్రపాణిలకు పై ప్రాణాలు పైనే పోయాయి. ఎందుకంటే సినిమా పోతే నెత్తిన గుడ్డేసుకోవాల్సిందే. అలాంటి పరిస్థితి. మర్నాడు కె.వి.రెడ్డి వాహినీ స్టూడియోకెళ్లారు. అక్కడ వాడిపోయిన మొహాలతో విజయాధినేతలు కనిపించారు. సంగతేంటని అడిగారు.. చక్రపాణి అసలు విషయం చెప్పారు. అంతే -కె.వి.రెడ్డికి కోపం నషాళానికి అంటింది. తన సినిమాకు సంబంధించి ఆయన సుప్రీం. ఎవరిని అడిగి ప్రివ్యూ వేశారని దులిపేశారు. బెజవాడకు ట్రంకాల్‌ చేసి మేనేజర్‌ను తిట్టేశారు. నా అనుమతి లేకుండా సినిమా చూపించడానికి మీరెవరు? మీ కాంప్లిమెంటరీ క్లాస్‌ కోసం కాదు నేను సినిమా తీసింది. సామాన్య ప్రేక్షకుడి కోసం. అతనే నాకు దేవదేవుడు. అతను చెప్పిందే వేదం. టికెట్టు కొని సినిమా చూసే ప్రేక్షకుల రియాక్షనేమిటో కనుక్కో అని ఫోన్‌ పెట్టేశారు. విచిత్రమేమింటే సినిమాకు జనం నుంచి ముందు వచ్చింది యావరేజ్‌ టాకే. మూడో వారం నుంచి ఉప్పెన మొదలైంది... థియేటర్ల దగ్గర జనమే జనం. చూసినవాళ్లే మళ్లీ మళ్లీ చూశారు. చూస్తూనే వున్నారు. సినిమా ఆద్యంతమూ ఆసక్తికరంగా సాగడానికి పింగళినాగేంద్రరావు రచన ఎంతగానో దోహదపడింది. నిజం చెప్పాలంటే పాతాళభైరవి తర్వాతే పింగళి సినీ రంగంలో స్థిర నివాసం ఏర్పరచుకున్నారు..
అరవై ఏళ్ల తర్వాత కూడా మనం తోటరాముడిని...నేపాళ మాంత్రికుడిని...అంజిగాడ్ని మర్చిపోలేకపోతున్నామంటే అది ఆయన ఘనతే! ఎన్నో పదాలు సృష్టించాడు . డింగరీ...డింభకా...బుల్‌బుల్‌... ఝగిణీ వంటి ఊత పదాలను ఇప్పటికీ వాడుతున్నామంటే అది ఆయన మహత్యమే. కనిపించినప్పుడల్లా గిరిజ చేత చెప్పించిన నరుడా ...ఏమి నీ కోరిక వంటి మాటలు ఈ నాటి ప్రేక్షకులను అలరిస్తూనే వున్నాయి... మాటలే కాదు.. ఈ సినిమాలో ఆయన రాసిన పాటలు కూడా శబ్ధ ప్రయోగంలో వింతపోకడలు పోయాయి.. ఎంత ఘాటు ప్రేమయో..అన్న పద ప్రయోగం ఆ రోజుల్లో పెద్ద వివాదం సృష్టించింది... సమాస దృష్ట్యా భావ ప్రకటన రీత్యా ఇది శుద్ధ తప్పు... అని కవి కులమంతా తీర్మానించింది... పింగళి తక్కువ తిన్నాడా.... తోటరాముడు మొరటు వాడు...వాడి ప్రేమలో ఘాటుదనమే తప్ప నీటుదనం వుండదు... రాకుమారి కూడా ఆ ఘాటుదనాన్నే తన పాటలో ప్రస్తావించిందని ఘాటుగానే జవాబిచ్చాడు.. ఇదే పాటలో ఆయన వాడిన కన్నుకాటు అన్న పదం కూడా ఒక ప్రయోగమే.. నాయికకు కన్నుకాటు తిన్నందువల్ల ఏదో పువ్వు రేకులు విరిసినట్టు కళలు విరిశాయట.. అప్పుడు నాయకుడు జాబిలినీ వెన్నెలనీ మలయానిలాన్నీ పిలిచి అవిడగారి విరహాగ్నిని పెంపు చేయమని చెబుతాడు.. నాయికలో సౌకుమార్యాన్నీ...నాయకునిలో దూకుడుతనాన్నీ ఆయనలాగా అందంగా పాటలు చూపించినవారూ ఇవాళ్టికి లేరు.

పాతాళభైరవి సక్సెస్‌లో కళాదర్శకుడు మాధవపెద్ది గోఖలే...ఛాయాగ్రాహకుడు మార్కస్‌ బార్‌ట్లీ భాగం ఎంతో వుంది...నటీనటుల ఎంపిక తర్వాత వాళ్లని రకరకాల భంగిమల్లో ఫోటోలు తీయించేవారు కెవిరెడ్డి... తర్వాత వాటిని గోఖలేకిచ్చి రకరకాల ఆకృతుల్లో స్కెచ్‌ గీయించేవారు.. వాటిల్లోంచి ఉత్తమమైనది ఎంపిక చేసేవారు.. నేపాళమాంత్రికుడి పాత్ర ఆహార్యం ఇలా తయారైందే! మాంత్రికుడి గుహ.. మాయా మహల్‌... పాతాళభైరవి విగ్రహం.....ఇలా ప్రతీది గోఖలే సృజనే! ఆయన కళా ప్రతిభకు తార్కానాలే! కథాకాలం నాటి పరిస్థితులు తెరపై కనిపించేందుకు అమిత శ్రద్ధ తీసుకునేవారాయన! నటీనటుల ఆహార్యాన్ని బట్టి దుస్తులను ఎంపిక చేసేవారు.. అందుకోసం బట్టల దుకాణంలో బోలెడంత సమయాన్ని వెచ్చించేవారు.. ఇక మార్కస్‌ బార్‌ట్లీ...ఎంత చెప్పినా తక్కువే అవుతుంది..నిజంగా ఆయనో మాంత్రికుడు.. సినిమాలోని మాయామహల్‌ నిజంగా ఆయన మాయాజాలమే... మహల్‌ నిర్మాణం మనం చూస్తున్నంత ఎత్తు వుండదు.. సాధారణ ఎత్తు వరకు మాత్రమే సెట్టు... మిగతాదంతా గోఖలే వేసిన పెయింటింగే... ముందు కింద భాగం వర్కంతా పూర్తి చేసి...తర్వాత మాస్క్‌ చేసిన పైభాగాన్ని తీశారు.. అలా ఆ మహల్‌ను అంత ఎత్తున చూపించారు.. క్లయిమాక్స్‌లో అది గాల్లో ఎగురుతూ పోవడాన్ని కూడా బార్‌ట్లీ అద్భుతంగా తీశారు..

ఘంటసాల మాస్టారి సంగీతం సినిమాకు సువర్ణానికి పరిమళమద్దినట్టయింది..మాస్టారికి బంగారు భవిష్యత్తును ప్రసాదించింది...పాతాళభైరవి నిర్మాణ కాలంలోనే ఘంటసాల ఓ ఇంటివాడయ్యారు.. పానగల్‌ పార్క్‌ దగ్గర ఓ ఇల్లు కొనుక్కున్నారు.. ఈ సినిమాకు ప్రముఖ సంగీత దర్శకుడు మాస్టర్‌ వేణు మ్యూజిక్‌ కండక్టర్‌గా వ్యవహరించారు. అప్పట్లో ఆయన కూడా ఘంటసాల మాదిరిగానే విజయవారితో అయిదేళ్ల కాంట్రాక్టులో వున్నారు.. ఈ సినిమా కోసం విజయవారు అమెరికా నుంచి హెమండ్‌ ఆర్గన్‌ అన్న వాయిద్యాన్ని తెప్పించారు.. అప్పట్లోనే దానికి పదహారు వేలు అయింది.. ఓ టీచర్‌ను పెట్టి వేణుకు ఆ వాయిద్యానికి సంబంధించి మెలకువలన్నీ నేర్పించారు.. మాంత్రికుడి గుహ సెట్లు సన్నివేశాలన్నిటిలోనూ బ్యాక్‌గ్రౌండ్‌లో ఈ వాయిద్యం వినిపిస్తుంది... విచిత్రమేమిటంటే ఈ వాయిద్యాన్ని వాయించేవారు అప్పుడు ఇప్పుడు ఇంకొకరు లేరు..

1951, మార్చి 15న పాతాళభైరవి విడుదలైంది... 28 కేంద్రాలలో శతదినోత్సవాన్ని జరుపుకుంది... మూడు సెంటర్లలో సిల్వర్‌ జూబ్లీ చేసుకుంది... ఒక కేంద్రంలో 50 వారాలకుపైగా ఆడింది.. తమిళంలోనూ బాగా ఆడింది... తర్వాత జెమినీ వాళ్లు రైట్స్‌ కొనేసుకుని హిందీలో పారా డబ్బింగ్‌ చేశారు. కొన్ని నృత్య సన్నివేశాలను రంగుల్లోకి మార్చారు. హిందీలో ఎస్వీయార్‌...మాలతి తమ పాత్రలకు తామే డబ్బింగ్‌ చెప్పుకున్నారు.. ఆ మరుసటి ఏడాది మన దేశంలో తొలిసారిగా అంతర్జాతీయ చలన చిత్రోత్సవం జరిగింది... ఆ ఉత్సవానికి దక్షిణ భారతదేశం నుంచి ఎంపికైన ఏకైక చిత్రం పాతాళభైరవే!

Updated On 15 March 2023 5:19 AM GMT
Ehatv

Ehatv

Next Story