పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ 'ఓజీ' చిత్రం నుంచి రెండవ గీతం 'సువ్వి సువ్వి' విడుదల

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ అభిమానులతో పాటు ప్రపంచవ్యాప్తంగా ఉన్న సినీ ప్రియులంతా ఎంతగానో ఎదురుచూస్తున్న చిత్రం 'ఓజీ'. డీవీవీ ఎంటర్‌టైన్‌మెంట్ పతాకంపై డీవీవీ దానయ్య, కళ్యాణ్ దాసరి ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్న ఈ చిత్రానికి సుజీత్ దర్శకత్వం వహిస్తున్నారు. ఓజాస్ గంభీర అనే శక్తివంతమైన పాత్రలో పవన్ కళ్యాణ్ కనువిందు చేయనున్న ఈ చిత్రంలో ప్రియాంక అరుళ్ మోహన్ కథానాయికగా నటిస్తున్నారు.
సంగీత సంచలనం ఎస్. తమన్ సంగీతం అందిస్తున్న 'ఓజీ' చిత్రం నుంచి ఇటీవల విడుదలైన మొదటి గీతం 'ఫైర్ స్టార్మ్'కి విశేష స్పందన లభించింది. సంగీత తుఫాను లాంటి ఈ పాట అభిమానుల రోమాలు నిక్కబొడుచుకునేలా చేసింది. తాజాగా 'ఓజీ' నుంచి రెండవ గీతం 'సువ్వి సువ్వి' విడుదలైంది. 'ఫైర్ స్టార్మ్'కి పూర్తి భిన్నంగా హృదయాలను హత్తుకునేలా 'సువ్వి సువ్వి' గీతం సాగింది. విడుదలైన క్షణాల్లోనే ప్రపంచవ్యాప్తంగా ఉన్న శ్రోతల మనసులను గెలుచుకుంటోంది. తమన్ అద్భుతమైన సంగీత ప్రయాణంలో గొప్ప పాటలలో ఒకటిగా ప్రశంసలు అందుకుంటోంది.
'సువ్వి సువ్వి' అనే ఈ ప్రేమ గీతాన్ని తమన్ ఎంత అందంగా స్వరపరిచారో.. గాయని శృతి రంజని అంతే మధురంగా ఆలపించారు. ఇక కళ్యాణ్ చక్రవర్తి త్రిపురనేని సాహిత్యం ఈ పాటకు మరింత అందాన్ని తీసుకొని వచ్చింది. తక్షణమే శ్రోతల హృదయాలను దోచేలా ఉన్న ఈ పాట ఒక ఆత్మీయమైన లోతును కలిగి ఉంది. ప్రేమ పాటలను స్వరపరచడంలో దిట్టగా తమన్ ఎందుకు రాజ్యమేలుతున్నారో ఈ గీతం మరోసారి రుజువు చేసింది.
'సువ్వి సువ్వి' పాటలో పవన్ కళ్యాణ్, ప్రియాంక అరుళ్ మోహన్ జంట చూడ ముచ్చటగా ఉంది. ఈ జోడీ తెరపై సరికొత్తగా కనిపిస్తున్నారు. పవన్ కళ్యాణ్ గంభీరాన్ని సమతుల్యం చేసేలా కన్మణిగా ప్రియాంక మోహన్ కనిపిస్తున్న తీరు ఆకట్టుకుంటోంది. 'ఓజీ' చిత్రానికి ప్రధాన ఆకర్షణలలో ఒకటిగా పవన్, ప్రియాంక జోడి నిలుస్తోంది. ఈ జంటను వెండితెరపై ఎప్పుడెప్పుడు చూస్తామా అని అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.
'ఓజీ' చిత్రంలో ఇమ్రాన్ హష్మీ, ప్రకాష్ రాజ్, శ్రియా రెడ్డి కీలక పాత్రలు పోషిస్తున్నారు. రవి కె చంద్రన్, మనోజ్ పరమహంస ఛాయాగ్రాహకులుగా వ్యవహరిస్తున్న ఈ చిత్రానికి నవీన్ నూలి ఎడిటింగ్ బాధ్యతలు నిర్వహిస్తున్నారు. ప్రతిభగల సాంకేతిక నిపుణుల సహకారంతో ప్రేక్షకులకు వెండితెరపై గొప్ప అనుభూతిని అందించే చిత్రంగా 'ఓజీ' రూపుదిద్దుకుంటోంది.
ప్రేక్షకులు అత్యంత ఆసక్తిగా ఎదురుచూస్తున్న భారతీయ చిత్రాలలో ఒకటి 'ఓజీ' అనడంలో సందేహం లేదు. సెప్టెంబర్ 25, 2025న ప్రపంచవ్యాప్తంగా విడుదల కానున్న ఈ సినిమాపై అంచనాలు తారాస్థాయిలో ఉన్నాయి. ఈ చిత్రం నుండి వచ్చిన ప్రతి అప్‌డేట్ సామాజిక మాధ్యమాల్లో సంచలనం సృష్టించింది. ఇప్పుడు మాస్‌ను శ్రావ్యతతో మిళితం చేస్తూ స్వరపరిచిన 'సువ్వి సువ్వి' గీతం కూడా సినిమాపై అంచనాలను మరింత పెంచింది.
