Heroine Uravashi: బాలీవుడ్‌ హీరోయిన్‌ ఊర్వశి నగలు కొట్టేసిన కేటుగాళ్లు..!

బాలీవుడ్ నటి ఊర్వశి రౌతేలా వింబుల్డన్ 2025 టోర్నమెంట్‌కు హాజరై ముంబై నుంచి ఎమిరేట్స్ విమానంలో లండన్‌లోని గాట్‌విక్ ఎయిర్‌పోర్ట్‌కు చేరుకున్నారు. అయితే, ఆమె లగ్జరీ క్రిస్టియన్ డియోర్ సూట్‌కేస్, దానిలో సుమారు రూ.70 లక్షల విలువైన ఆభరణాలతో సహా, బ్యాగేజ్ బెల్ట్ నుంచి చోరీకి గురైందని ఆమె ఆరోపించారు. ఈ ఘటనపై ఆమె ఇన్‌స్టాగ్రామ్‌లో తెలియచేస్తూ చేస్తూ, "అన్యాయాన్ని సహించడం మరోసారి అన్యాయానికి ఆహ్వానం పలకడమే" అని రాశారు. బ్యాగేజ్ ట్యాగ్, టికెట్ వివరాలను పోస్ట్ చేసి, ఎమిరేట్స్, గాట్‌విక్ ఎయిర్‌పోర్ట్, మెట్రోపాలిటన్ పోలీసులను ట్యాగ్ చేస్తూ తక్షణ సహాయం కోరారు. ఎయిర్‌పోర్ట్ అధికారులు, ఎమిరేట్స్ సిబ్బంది నుంచి ఎలాంటి సహాయం అందలేదు, ఇది ఎయిర్‌పోర్ట్ భద్రతలో తీవ్ర లోపంగా ఆమె పేర్కొన్నారు. సోషల్ మీడియాలో ఈ పోస్ట్‌పై కొందరు నెటిజన్లు దీన్ని పబ్లిసిటీ స్టంట్‌గా అభివర్ణించి ట్రోల్ చేశారు. "డియోర్ బ్యాగ్ కోసం బాలీవుడ్ దివా ఏడవడం చౌకగా ఉంది" అని ఒకరు, "మీ లబుబు డాల్స్ దొంగిలించాయేమో" అని మరొకరు వ్యంగ్యంగా కామెంట్ చేశారు. 2023లో, నరేంద్ర మోదీ స్టేడియంలో వరల్డ్ కప్ మ్యాచ్ చూస్తుండగా తన 24 క్యారెట్ గోల్డ్ ఐఫోన్ పోగొట్టుకున్నట్లు పేర్కొన్నారు. అలాగే, ఈ నెలలో ఆమె తల్లి మీరా రౌతేలా, ఊర్వశి మాజీ మేనేజర్ వేదికా ప్రకాష్ శెట్టిపై 2015-17 మధ్య చోరీ, మోసం ఆరోపణలు చేశారు. ఊర్వశి రౌతేలా 'సింగ్ సాబ్ ది గ్రేట్', 'సనం రే', 'హేట్ స్టోరీ 4' వంటి చిత్రాల్లో నటించారు. ఆమె ఊర్వశి రౌతేలా ఫౌండేషన్ ద్వారా సేవా కార్యక్రమాలు నిర్వహిస్తూ, PETA ఇండియాతో కలిసి పనిచేస్తున్నారు. ఉర్వశి రౌతేలా ప్రస్తుతం బాలీవుడ్‌తో పాటు తెలుగు పరిశ్రమలోనూ మంచి క్రేజ్‌ను సంపాదించుకున్నారు. మెగాస్టార్ చిరంజీవి వాల్తేరు వీరయ్య చిత్రంలోని బాస్ పార్టీ పాటతో తెలుగు ప్రేక్షకుల మనసులు గెలుచుకున్నారు. ఆ పాట యూట్యూబ్‌లో మిలియన్ల వ్యూస్‌ను సొంతం చేసుకొని ఆమెకు భారీ పాపులారిటీని తీసుకొచ్చింది. ఇక నందమూరి బాలకృష్ణ – గోపీచంద్ మలినేని కాంబినేషన్‌లో వచ్చిన చిత్రంలో SI జానకి పాత్రలో నటించిన ఊర్వశి, దబిడి దిబిడి పాటలో బాలయ్యతో కలసి స్టెప్పులు వేసి మాస్ ప్రేక్షకులను ఆకట్టుకున్నారు.

ehatv

ehatv

Next Story