తమిళ నటుడు జయం రవి(Jayam Ravi) విడాకుల వ్యవహారం ఇప్పుడు కొత్త మలుపు తిరిగింది

తమిళ నటుడు జయం రవి(Jayam Ravi) విడాకుల వ్యవహారం ఇప్పుడు కొత్త మలుపు తిరిగింది. తన భార్య ఆర్తితో ఈ విషయాన్ని చర్చించిన తర్వాతే పరస్పర అంగీకారంతోనే విడాకుల నిర్ణయం తీసుకున్నానని జయం రవి తెలిపిన విషయం కూడా తెలిసిందే! పైగా తమ ప్రైవసీని అందరూ గౌరవించాలని రిక్వెస్ట్‌ చేశారు. అయితే ఆర్తి ఇందుకు విరుద్ధమైన ప్రకటన చేశారు. తన అనుమతి లేకుండానే జయం రవి విడాకుల ప్రస్తావన తీసుకొచ్చారంటూ బాంబు పేల్చారు. 'నాకు తెలియకుండా, నా సమ్మతి లేకుండా ఇటీవల మా విడాకులపై బహిరంగ ప్రకటన చేయడంతో నేను తీవ్ర దిగ్భ్రాంతికి గురయ్యాను, ఎంతో బాధపడ్డాను. 18 సంవత్సరాల వైవాహిక జీవితంలో ఉన్న నేను, ఇలాంటి ముఖ్యమైన విషయాన్ని తెలుసుకోవడానికి తగినంత గౌరవం, అర్హత కలిగి ఉన్నానని భావిస్తున్నాను' అని ఆర్తి సోషల్‌ మీడియాలో పోస్ట్‌ చేశారు. జయం రవితో మనసు విప్పి మాట్లాడటానికి చాన్నాళ్లుగా ప్రయత్నిస్తున్నానని, తనకు ఆ అవకాశం దొరకడం లేదని చెప్పారు ఆర్తి. విడాకుల విషయం తనకు కానీ, తన పిల్లలకు కానీ అసలు తెలియదని, పూర్తిగా ఏకపక్షంగా తీసుకున్న నిర్ణయమని ఆర్తి అంటున్నారు. ఈ విషయంపై తాను బయటకొచ్చి పబ్లిక్ గా మాట్లాడొచ్చు కానీ తాను గౌరవప్రదంగా ఉండడానికే నిర్ణయించుకున్నానని అన్నారు. 'నాపై అన్యాయంగా నిందలు వేసి, నా వ్యక్తిత్వాన్ని దెబ్బతీసే తప్పుడు ప్రచారాన్ని నేను భరించలేను. ఒక తల్లిగా నా తొలిప్రాధాన్యం నా పిల్లలే. వాళ్లపై తప్పుడు కథనాలు ప్రభావం చూపించడం నాకు ఇష్టం లేదు' అని ఆర్తి చెప్పుకొచ్చారు. ఈ లెక్కన పరస్పర అంగీకారంతో తీసుకున్న నిర్ణయం కాదని తేలిపోయింది. అలాగే ఆలుమగల మధ్య మాటలు లేవన్న విషయం కూడా తెలిసిపోయింది.

Updated On
Eha Tv

Eha Tv

Next Story