Kingdom Review: 'కింగ్‌డమ్' సినిమాపై సీనియర్ జర్నలిస్ట్ త్రినాధ రావు గరగ రివ్యూ

ఎప్పటినుంచో హిట్ కోసం ఎదురుచూస్తున్న విజయ్ దేవరకొండ హీరోగా,గౌతమ్ తిన్ననూరి దర్శకత్వంలో సితార ఎంటర్టైన్మెంట్స్ నాగవంశీ నిర్మించిన 'కింగ్‌డమ్' సినిమాపై ప్రేక్షకులలో భారీ అంచనాలున్నాయి.'కింగ్‌డమ్' ఓ స్పై యాక్షన్ డ్రామాగా తెరకెక్కింది. ఇందులో అన్నదమ్ముల సెంటిమెంట్ ప్రధానంగా ఉంటుంది. శ్రీలంక బ్యాక్‌డ్రాప్‌తో రూపొందిన ఈ యాక్షన్ డ్రామాలో భాగ్యశ్రీ బోర్సే హీరోయిన్‌గా నటించగా, సత్యదేవ్ కీలక పాత్రలో నటించాడు.తీసినవి రెండు సినిమాలే అయినా దర్శకుడు గౌతమ్ తిన్ననూరికి ఇండస్ట్రీలో ఒక ప్రత్యేక స్థానం ఉంది..ఆయన తీసిన మళ్ళీ రావా, జెర్సీ అనే సినిమాలలో మధ్యతరగతి మనుషులు, వాళ్ళ మానవ సంబంధాలు వాటి మధ్యలో రగిలే భావోద్వేగాలు అద్భుతంగా తెరమీద పండించాడు. అలాంటిది ఆయన కూడా పాన్ ఇండియా మోజులో సినిమాలలో హంగులు,ఆర్భాటాలు ముఖ్యమని భావించాడు.బాహుబలి, కేజిఎఫ్ సినిమాలు వచ్చి ఎంత మంచి చేశాయో తెలీదు కానీ, చాలామంది క్రియేటివ్ దర్శకులను పాడుచేసాయనిపిస్తుంది.మినిమం బడ్జెట్ తో అద్భుతంగా ఫ్రెష్ సినిమాలు తీసే క్రియేటివ్ డైరెక్టర్లు ఈ దిక్కుమాలిన పార్ట్ వన్, పార్ట్ టు సినిమాలపై దృష్టి పెట్టి అసలు పార్టును గాలికి వదిలేస్తున్నారు. సాక్షాత్తు విజయ్ దేవరకొండ కింగ్డమ్ విషయంలో కూడా అదే జరిగింది. అసలు తెరపై డ్రామా పండించకుండా సరైన భావోద్వేగాలు లేకుండా ఎన్ని హైవోల్టేజ్ సీన్లు పెట్టినా ప్రేక్షకులు తొందరగా కనెక్ట్ అవ్వరనేది దర్శకుడు విస్మయించాడు. పైగా సినిమా చూస్తున్నంత సేపూ అప్పుడెప్పుడో రాజమౌళి తీసిన చత్రపతి,యుగానికిఒక్కడు సినిమాలు గుర్తుకొస్తుంటాయి.

దర్శకుడుగౌతమ్ తిన్ననూరి రైటింగ్ స్కిల్స్ కనపడకపోవడం ఒకరకంగా ఆయన అభిమానులకు మింగుడు పడని అంశం. ముఖ్యంగా ఈ సినిమాకు బాగా కలిసి వచ్చిన అద్భుతమైన సాంకేతిక విభాగాన్ని ఉపయోగించుకోవడంలో దర్శకుడు ఫెయిల్ అయ్యాడు. ఏదో ఒక గొప్ప కథ చెప్పాలని ప్రయత్నించి దానికి తగ్గట్లుగా స్క్రీన్ ప్లే దర్శకుడు రాసుకోలేకపోయాడేమో అనిపిస్తుంది.కానీ దర్శకుడు తడబాటుకు గురైన ప్రతీసారి విజయ్ దేవరకొండ తన పర్ఫామెన్స్ తో బలహీనమైన సన్నివేశాలకు మరింత బలం చేకూర్చాడు.టెక్నికల్ గా అన్నీ బ్రహ్మాండంగా కుదిరినా ఎక్కడో ఏదో వెలితి కనిపిస్తుంది. అందుచేత విజయ్ దేవరకొండ కష్టం బూడిదలో పోసిన పన్నీరయ్యిందనే చెప్పాలి.

ఇక నటీనటుల విషయానికొస్తే ముందే చెప్పినట్లు విజయ్ దేవరకొండ వరుస పరాజయాల తర్వాత స్ట్రాంగ్‌ కమ్‌ బ్యాక్‌ మూవీ. యాక్షన్‌ సీన్లతో అదరగొట్టి,ఆడియెన్స్ ని కట్టిపడేశాడనే చెప్పొచ్చు.ఇక హీరోయిన్ భాగ్యశ్రీ భోర్సే డాక్టర్‌గా సపోర్టింగ్ రోల్‌కే పరిమితమయ్యారు. తన పాత్రకు స్కోప్ ఉన్నా.. నటించడానికి అవకాశం లేకపోయింది. గ్లామర్‌పరంగా కూడా అంతంత మాత్రమే ఉంది. భాగ్య శ్రీ బోర్సే హీరోయిన్ మెటీరియల్‌గా ఊహించుకుంటే మాత్రం నిరాశ తప్పదు.

సత్యదేవ్ ఎప్పటిలానే పవర్ ప్యాక్డ్‌గా కనిపించడమే కాకుండా విజయ్ దేవరకొండతో పోటాపోటీగా నటించాడు. విలన్ పాత్రలో వెంకిటేష్ వైపీ స్పెషల్ ఎట్రాక్షన్.మలయాళి సినీరంగం నుంచి మళ్లీ ఒక వజ్రం లాంటి నటుడు ప్రతినాయకుడి పాత్రలో అందరినీ ఆకట్టుకున్నాడుఅయ్యప్ప పి శర్మ బైరాగిగా దేవరలో ప్రకాష్ రాజ్ ను గుర్తు చేస్తాడు. మిగితా పాత్రల్లో నటించిన వారంతా ఫర్వాలేదనిపించారు.

సాంకేతిక నిపుణుల విషయానికొస్తే ఈ సినిమాకు ప్రధాన వాళ్లే..అనిరుద్ రవిచంద్రన్ మ్యూజిక్, బ్యాక్ గ్రౌండ్ స్కోర్ ఈ మూవీకి మెయిన్ ప్లస్ పాయింట్. తమిళ సినిమాల్లో మాదిరిగా అవసరం ఉన్నా లేకపోయినా ఎలివేషన్ మ్యూజిక్‌తో హడావిడి చేయకుండా బ్యాక్ గ్రౌండ్ స్కోర్‌ని కరెక్ట్‌గా వాడాడు. జోమౌన్ టీ జాన్, గిరీష్ గంగాధరన్ సినిమాటోగ్రఫీ కూడా బాగుంది. నాగ వంశీ నిర్మాణ విలువలు మాత్రం ఎక్కడ రాజీపడకుండా అద్భుతంగా ఉన్నాయి. చివరిగా ఒక సినిమా తీసే ముందు ఆ సినిమా కథాంశంలో మూలమైన సమస్య కనీసం తెలుగు వారికి తెలిసేది గానూ మన నేటివిటీకి తగ్గట్లుగాను ఉండాలి. లేకపోతే ఓ కింగ్డమ్ సినిమాలా..పులిని చూసి వాతలు పెట్టుకున్న పాన్ ఇండియా సినిమాలా ఉంటుంది..

త్రినాధ రావు గరగ

సీనియర్ జర్నలిస్ట్

ehatv

ehatv

Next Story