రిపబ్లిక్ లాంటి చిత్రాలతో పొలిటికల్ థ్రిల్లర్లు తీయడంలో తన నైపుణ్యాన్ని చూపించాడు దర్శకుడు దేవా కట్టా.

రిపబ్లిక్ లాంటి చిత్రాలతో పొలిటికల్ థ్రిల్లర్లు తీయడంలో తన నైపుణ్యాన్ని చూపించాడు దర్శకుడు దేవా కట్టా.ఇప్పుడాయన ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాజకీయాలను శాసించి నాయకుల కథను ‘మయసభ’ వెబ్ సిరీస్ ద్వారా తెరపైకి తెచ్చే ప్రయత్నం చేశారు. సోనీ లివ్ ద్వారా ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ సిరీస్ ఆనాటి రాజకీయాల మీద ఆసక్తి ఉన్న వారందరినీ కూడా అలరిస్తుంది.ఇదే కథను సినిమాగా తీస్తే సెన్సార్ కత్తెరలోనే సగం కథ నలిగిపోయేది. అందులోనూ తెలుగు రాష్ట్రాల రాజకీయాలను ఎప్పుడూ నెగిటివ్ గా చూడడమే కానీ వాటి మొదలు ఎక్కడా అని ప్రస్తావించిన సినిమాలు, కథలు చాలా తక్కువ. అందుకే మయసభ మరింత ఆసక్తికరంగా ఉంటుంది.ఎన్టీఆర్ కథతో యన్.టి.ఆర్ సినిమా తీశారు.
వైఎస్ కథతో ‘యాత్ర..పరిటాల రవి మీద ‘రక్త చరిత్ర’.. వంగవీటి రాధా మీద ‘వంగవీటి’ లాంటి చిత్రాలు వచ్చాయి. చంద్రబాబు మీద కూడా ఒక సినిమా వచ్చింది. పైన చెప్పుకున్న సినిమాల్లో చంద్రబాబు నాయుడు పాత్రను కీలకంగా చూపించారు. ఐతే ఆయా నాయకుల కథలతో వచ్చిన సినిమాలు వారికి అనుకూలంగా.. వారి దృక్కోణంలోనే సాగాయి. వాటిలో ఆ నేతలను గొప్పగా చూపించి.. అవతలి నాయకులను కొంచెం తక్కువ చేసి చూపించడం చూశాం.కానీ దేవా కట్టా అసాధ్యం అనుకున్న ఈ విషయాన్ని ‘మయసభ’లో సుసాధ్యం చేసి చూపించాడు.ప్రతి ఎపిసోడ్ బోర్ కొట్టకుండా నడిపించారు. స్క్రీన్ ప్లే బాగా తీర్చిదిద్దుకున్నారు.టేకింగ్ కూడా ఇంట్రెస్టింగ్ గా ఉండేలా చూసుకున్నారు.కృష్ణమ నాయుడు,రామిరెడ్డి కలిసిన ప్రతీ సీన్ భలేగా ఉంటుంది.
వాస్తవంలో ఇలా ఉంటే బావుండేది అనిపిస్తుంది. అంతలా ఆ పాత్రధారులు ఇద్దరూ ఒదిగిపోయారు.ఎమర్జెన్సీ సన్నివేశాలు, ఆర్సిఆర్ పార్టీ పెట్టిన తరువాత సన్నివేశాలు నెమ్మదిగా సాగినా మిగతా కథ గ్రిప్పింగ్ గా ఉంటుంది.మధ్యలో విజయవాడ కుల ఘర్షణలు, అనంతపురం ఫ్యాక్షన్ చూపిస్తూ ఆ నేపథ్యంలో నాయకులను చూపించిన విధానం బావుంది. మొత్తానికి మయసభ అనే పొలిటికల్ డ్రామా నాకు మాత్రం బాగా నచ్చింది బహుశా ఆనాటి విషయాలు మొత్తం పేపర్ల రూపంలో గానీ, రచ్చబండల దగ్గర గాని, వీధిఅరుగుల దగ్గర కానీ పాలుపంచుకోవడం వల్లనేమో..
మయసభ నటీనటుల విషయానికొస్తే ప్రధాన పాత్రలు పోషించిన ఇద్దరు నటులూ పోటాపోటీగా నటించారు.
ఆది పినిశెట్టి చంద్రబాబును పోలినట్లు కనిపించలేకపోయినా ఆలోచన విధానం ప్రతిబింబించేలా ఆ పాత్రను పోషించాడు. కానీ రాజకీయాల్లో ఎదగాలని తపించే యువకుడి పాత్రలో ఒదిగిపోయాడు. సిరీస్ ఆద్యంతం ఒక ఇంటెన్సిటీ మెయింటైన్ చేశాడు. ఇక చైతన్య రావుకు నటుడిగా ఇది కెరీర్ బెస్ట్ అని చెప్పొచ్చు. ట్రైలర్ చూస్తే ఇతను వైఎస్ పాత్రలో మెప్పించగలడా అన్న సందేహాలు కలిగాయి కానీ.. సిరీస్ లో మాత్రం అతను అంచనాలను మించిపోయాడు. వైఎస్ ను గుర్తుకు తెచ్చేలా నటించాడు. పాత్రలో పరిణామ క్రమాన్ని అతను తన నటనతో బాగా చూపించాడు. చివరి రెండు మూడు ఎపిసోడ్లలో చైతన్యరావు నటన మరింత మెప్పిస్తుంది. తమిళ అమ్మాయి తన్య రవిచంద్రన్ ఓ ముఖ్య పాత్రలో రాణించింది. ఎన్టీఆర్ పాత్రలో సాయికుమార్ అదరగొట్టాడు. ఇందిరా గాంధీగా దివ్య దత్తా లుక్ సరిపోనప్పటికీ.. ఆమె నటన మాత్రం బాగుంది. సంజయ్ గాంధీ పాత్రలో చేసిన నటుడూ ఆకట్టుకున్నాడు. శ్రీకాంత్ అయ్యంగార్.. రవీంద్ర విజయ్.. శత్రు.. వీళ్లంతా కూడా బాగా చేశారు. రామోజీ రావు పాత్రలో నాజర్ ఓకే అనిపించారు.
టెక్నికల్ గా కూడా ‘మయసభ’ ఉన్నత ప్రమాణాలతో తెరకెక్కింది. వెబ్ సిరీస్ అయినా సినిమాకు ఏమాత్రం తక్కువ కాకుండా క్వాలిటీ కనిపిస్తుంది. ప్రతి ఎపిసోడ్లో భారీతనానికి లోటు లేదు. 70-80 దశకాల వాతావరణాన్ని చూపించడంలో శ్రమ తెరపై కనిపిస్తుంది. శక్తికాంత్ కార్తీక్ నేపథ్య సంగీతం ఆకట్టుకుంది. పాటలు అంతగా మెప్పించవు. సురేష్ రగుతు,జ్ఞానశేఖర్ కలిసి అందించిన ఛాయాగ్రహణం చాలా బాగుంది. దేవా కట్టా రైటింగ్ సినిమాకు మేజర్ హైలైట్. వాస్తవ ఘటనలు.. కల్పిత అంశాలతో సిరీస్ చాలా ఇంట్రెస్టింగ్ గా నడిపించాడు. తన మాటలు తూటాల్లా పేలాయి. దేవా-కిరణ్ జై కుమార్ దర్శకత్వం కూడా ఆకట్టుకుంటుంది.రియల్ లైఫ్ లో పాత్రలు జోడించి వాటికి కల్పితాలు అద్ది తీసిన పొలిటికల్ డ్రామా మాయసభ బావుంది.
