పవర్ స్టార్ పవన్ కళ్యాణ్‌ నటించిన హరిహర వీరమల్లు సినిమా ఆశించిన స్థాయిలో ఆడలేదు.

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్‌ నటించిన హరిహర వీరమల్లు సినిమా ఆశించిన స్థాయిలో ఆడలేదు. దాంతో పవన్ కళ్యాణ్‌ అభిమానులు, జనసేన కార్యకర్తలంతా స్టైలిష్ గ్యాంగ్ స్టర్ డ్రామా 'ఓజీ' సినిమా మీదనే ఆశలు పెట్టుకున్నారు. ఈ సినిమా కోసమే వాళ్ళు కొన్ని నెలలుగా ఎదురుచూస్తున్నారు. వారి ఎదురు చూపులకు తగ్గట్టుగానే ఓజీ సినిమాను స్వతహాగా పవన్ కళ్యాణ్ అభిమాని అయిన రాజా రన్,సాహో చిత్రాల దర్శకుడు సుజిత్, అభిమానుల ఆశలకు అనుగుణంగానే సినిమాను వండి వార్చాడు.సుజీత్ అల్లుకున్న ఈ కథ విషయానికి వస్తే, ఓజీ చాలా సింపుల్ కథ.ఇంకా విపులంగా చెప్పాలంటే సాహో సినిమాను కాస్త మార్చి మళ్లీ దానికి మాఫియా బ్యాక్ డ్రాప్ పెట్టి తీశాడు సుజిత్. కాకపోతే అందులో చేసిన తప్పులు ఇందులో చేయలేదు. చూడడానికి చాలా రొటీన్ కథలాగా అనిపించినా స్క్రీన్ ప్లే విషయంలో చాలా పకడ్బందీగా ప్లాన్ చేశాడు సుజిత్. పవన్ కళ్యాణ్ చుట్టూ కథ అల్లుకున్నాడు. నిజం చెప్పాలంటే కేవలం పవన్ కళ్యాణ్ ఆరా మాత్రమే ఈ సినిమా కథను నడిపించింది.

గంభీరమైన లుక్, స్టైలిష్ యాక్షన్ సీన్స్‌తో ఫ్యాన్స్‌కు పూనకాలు పుట్టించాడు. మధ్య మధ్యలో ఫ్యామిలీ ఆడియన్స్ కు నచ్చేలా ఎమోషనల్ బ్యాక్ డ్రాప్ కూడా పెట్టాడు కూడా.. అది ఎక్కడా వర్క్ అవుట్ కూడా అయినట్టు కనపడదు.గోరంత ఎమోషన్ చుట్టూ కొండంత యాక్షన్ ను డిజైన్ చేసుకున్నాడు ఈ తెలివైన దర్శకుడు.మార్షల్ ఆర్ట్స్ తో ముడిపడిన ఈ యాక్షన్ ఎపిసోడ్స్ పవన్ ఫ్యాన్స్ తో విజిల్స్ వేయిస్తాయి.సినిమా ప్రధమార్ధం అంతా కూడా పాత్రల పరిచయాలతో జెట్స్పీడ్తో పరిగెడుతుంది.ఇంటర్వెల్ ఎపిసోడ్ తర్వాత.. ద్వితీయార్దంలో ఫాలో అప్ కూడా బాగానే ఉంది. పోలీస్ స్టేసన్ ఎపిసోడ్ సినిమాలో హైలైట్. ఇక్కడ దర్శకుడిగా సుజీత్ పనితనం కనిపిస్తుంది. ఈ సన్నివేశాన్ని కన్సీవ్ చేసిన విధానం ఆకట్టుకుంటుంది. ఐతే ఇదే టెంపోను తర్వాత కూడా కొనసాగించి ఉంటే ‘ఓజీ’ స్థాయి వేరుగా ఉండేది. సరిగ్గా పోలీస్ స్టేషన్ సీన్ తర్వాత సినిమా ఏకపక్షంగా మారిపోయి ఆసక్తి సన్నగిల్లిపోతుంది.కొన్ని మలుపులు ఉన్నప్పటికీ అవి అంతగా పండలేదు. ద్వితీయార్ధాన్ని నిలబెట్టేంత డ్రామా కథలో లేకపోయింది.

ఆర్డీఎక్స్ కంటైనర్ వ్యవహారం ఒక దశ దాటాక చికాకు పెడుతుంది. ఇంత పెద్ద యాక్షన్ సినిమాను నడిపించేంత వెయిట్ ఆ కాన్సెప్టులో లేదు. సినిమాలో ప్రథమార్థంలో ఉన్న వేగం ద్వితీయార్ధంలో కనిపించదు.కానీ క్రమం తప్పకుండా ప్రతి పది నిమిషాలకు ఒకసారి హై ఇచ్చాడు దర్శకుడు సుజిత్.. అది కూడా మాములు హై కాదు.. ఈ పది పదిహేనేళ్ల కాలంలో పవన్ కళ్యాణ్ అభిమానులు ఎప్పుడూ ఆయనను అలా చూడనంత.క్లైమాక్స్ యాక్షన్ సీక్వెన్సులో టేకింగ్ బాగున్నప్పటికీ.. ఆ ఎపిసోడ్ పేలిపోయే రేంజిలో అయితే లేదు. ఓవరాల్ గా చెప్పాలంటే.. పవన్ అభిమానులకు అయితే ‘ఓజీ’ కనువిందుగా అనిపిస్తుంది. ఎలివేషన్లకు.. యాక్షన్ సీక్వెన్సుల్లో మెరుపులకు ఇందులో లోటు లేదు. కానీ సామాన్య ప్రేక్షకులకు మాత్రం ఒకింత నిరాశ తప్పదు.

ఇక నటీనటుల విషయానికొస్తే ముందే చెప్పినట్టుగా కేవలం పవన్ కళ్యాణ్ "ఆరా" మాత్రమే సినిమాను మొత్తం నడిపిస్తుంది.తన మార్క్ కంటెంట్ కావడంతో ఆయన చెలరేగి పోయాడు. ఆయన తరువాత ఎవరు బాగా చేశారు అనే ప్రశ్నకి సమాధానం చెప్పలేం.ఎందుకంటే తెర మొత్తాన్ని ఆయన మాత్రమే ఆక్రమించిన సినిమా ఇది. ఇక మిగిలిన ప్రధానమైన పాత్రల స్థానాలలో బాలీవుడ్ నటుడు ఇమ్రాన్ హష్మీ .. ప్రకాశ్ రాజ్ .. శ్రేయారెడ్డి .. అర్జున్ దాస్ పాత్రలు కనిపిస్తాయి. హీరో హీరోయిన్ల మధ్య కెమిస్ట్రీ కి అవకాశం ఉన్నా,ఎందుకో దర్శకుడు అంతగా అటువైపు చూడలేదనిపించింది అందుకే హీరోయిన్ ప్రియాంక అరుల్ మోహన్, పవన్ కళ్యాణ్ మధ్య ప్రేమ కథ అంతగా ఆకట్టుకోలేదు. కానీ,ఇంటర్వెల్ ఎపిసోడ్ ఆ ప్రేమకథను మర్చిపోయేలా చేసింది.సాంకేతిక నిపుణులు మాత్రం ఈ సినిమాను ఒకరని కాదు, అందరూ ప్రాణం పెట్టి నిలబెట్టారు. ఒక రకంగా ఈ సినిమాకి అసలైన హీరోలు సుజిత్, తమన్ లే.. తమన్ అందించిన బ్యాక్ గ్రౌండ్ స్కోర్ చూశాక బయటకు వచ్చిన ప్రేక్షకుడు ఆయనను తలుచుకోని వాడు ఎవడూ ఉండడు ..రవి కె చంద్రన్ - మనోజ్ పరమహంస ఫొటోగ్రఫీ బాగుంది. నవీన్ నూలి ఎడిటింగ్ ఓకే.

చివరగా పవన్ కళ్యాణ్ అభిమానుల ముచ్చట తీర్చడంలో సుజీత్ 100% సక్సెస్ అయ్యాడనే చెప్పాలి.పవన్ ఫ్యాన్స్ కి కావలసిన ఎలివేషన్ మరియు యాక్షన్ 80% అయితే ఫ్యామిలీ ఆడియన్స్ కి కావలసిన ఎమోషన్ 20%.

ehatv

ehatv

Next Story