ఇటీవల రాంబాయి వెడ్స్ రాజు సినిమా గురించే తెలుగు సినీ లోకంలో చర్చ నడుస్తోంది.

ఇటీవల రాంబాయి వెడ్స్ రాజు సినిమా గురించే తెలుగు సినీ లోకంలో చర్చ నడుస్తోంది. రియల్ స్టోరీ ఆధారంగా రీల్‌గా తీసిన ఈ కథను ప్రేక్షకులు ఆదరిస్తున్నారు. శివాజీ రాజా రాజు వెడ్స్ రాంబాయి చిత్రంలో హీరో తండ్రి పాత్రతో ఆకట్టుకున్నారు. ఈ సినిమా విజయాన్ని పురస్కరించుకొని నిర్వహించిన సక్సెస్ మీట్‌లో ఆయన పలు ఆసక్తికర విషయాలు వెల్లడించారు.ఈ చిత్రంలో శివాజీ రాజాతో పాటు నటీ అనితా చౌదరి భార్యాభర్తలుగా నటించారు. వీరిద్దరూ గతంలో కూడా అనేక సినిమాల్లో కలిసి నటించారు. ఈ అనుభవాన్ని గుర్తుచేసుకుంటూ శివాజీ రాజా సక్సెస్ మీట్‌లో ఒక సరదా సంఘటనను షేర్ చేసుకున్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ '' అనిత చాలా మంచి నటి. సెట్‌కి ఎప్పుడూ టైమ్‌కే వస్తుంది. మురారి సినిమాలో షూటింగ్ జరుగుతున్నప్పుడు ఒకసారి ఆమె ఖాళీగా కూర్చుంది. దాన్ని చూసిన దర్శకుడు కృష్ణవంశీ సరదాగా ‘ఖాళీగా కూర్చోకు.. ఆమెకి తెలుగులో ఒక లవ్ లెటర్ రాసి ఇచ్చేయ్’ అని అన్నాడు. నేను కూడా సరే అని గోదావరి జిల్లా స్లాంగ్‌లో ఒక లవ్ లెటర్ రాశాను,” అని శివాజీ రాజా నవ్వుతూ చెప్పారు. ఆ తర్వాత ఆ లెటర్ విషయంలో ఊహించని ట్విస్ట్ చోటు చేసుకుందని ఆయన వెల్లడించారు. ఆ లెటర్ తను ఒక్కతే చదువుతుందని అనుకుంటే.. ఆమె యూనిట్ అంతా వినిపించింది. సరే అనుకున్నా.. కొన్ని రోజుల తర్వాత నాకు యాక్సిడెంట్ అయ్యి హాస్పిటల్‌లో ఉండగా ఆ లెటర్‌ను మా మిసెస్‌కి చూపించింది. ఆ సందర్భం ఇప్పటికీ గుర్తు వస్తే నవ్వు వస్తుంది,” అని చెప్పుకొచ్చారు. శివాజీ రాజా చెప్పిన ఈ సంఘటన సక్సెస్ మీట్ హాల్‌ని కాసేపు నవ్వులతో నింపింది. ‘రాజు వెడ్స్ రాంబాయి’. చిన్న సినిమాగా వచ్చిన ఈ చిత్రం ప్రేక్షకుల్ని మెప్పించి విజయవంతంగా ప్రదర్శితమవుతోంది. ఈ క్రమంలో సక్సెస్ మీట్ ఏర్పాటు చేయగా, హీరో శ్రీవిష్ణుతో పాటు, దర్శకుడు బాబీ, రచయితలు కోన వెంకట్, బి.వి.ఎస్.రవి ముఖ్య అతిథులుగా హాజరయ్యారు.


