సినీ పరిశ్రమలో (Film industry)మహిళలు ఎదుర్కొంటున్న ఇబ్బందులు, వేధింపులు, అసమానతలు అన్నీ ఇన్నీ కావు.

సినీ పరిశ్రమలో (Film industry)మహిళలు ఎదుర్కొంటున్న ఇబ్బందులు, వేధింపులు, అసమానతలు అన్నీ ఇన్నీ కావు. ఎక్కడైనా మహిళలు వేధింపబడుతూనే ఉన్నారు. మలయాళ (Malayalam)చిత్ర పరిశ్రమ భిన్నమైనది కాబట్టే సినీ ఇండస్ట్రీలో మహిళల ఎన్ని రకాలుగా వేధింపులను ఎదుర్కొంటారు తెలుసుకోవాలనుకుంది ప్రభుత్వం. అయిదేళ్ల కిందట సిట్టింగ్‌ జడ్జి ఆధ్వర్యంలో ఓ కమిషన్‌ను వేసింది. కమిషన్ రిపోర్ట్‌తో మలయాళ ఇండస్ట్రీలో ఉన్న మగ రాక్షసుల దుశ్చర్యలు వెలుగులోకి వచ్చాయి. కొత్తగా ఇండస్ట్రీలోకి వచ్చే మహిళలకు ఏడుపొక్కటే తక్కువ. పెద్దలు చెప్పినట్టుగా వినాల్సిందే. వింటేనే మేకప్‌.. వినకపోతే ప్యాకప్‌..

ఏడేళ్ల కిందట మలయాళ నటి భావనపై కొంతమంది దుండగులు కొచ్చి శివార్లలో లైంగిక దాడికి ప్రయత్నించారు. భావనపై కసిని పెంచుకున్న సూపర్‌స్టార్‌ దిలీప్‌ దీనికి సూత్రధారి! ఇప్పటికీ ఈ కేసు కోర్టులో నడుస్తూనే ఉంది. కొన్ని రోజుల పాటు దిలీప్‌(Dileep) జైలుకు కూడా వెళ్లి వచ్చాడు. ఈ సంఘటన తర్వాత ఇండస్ట్రీలో ప్రకంపనలు వచ్చాయి. మలయాళ చిత్ర పరిశ్రమలో మహిళల పరిస్థితిని అధ్యయనం చేయడానికి ప్రభుత్వం జస్టిస్‌ హేమా కమిషన్‌ (Justice Hema Commission )ను నియమించింది. మన నటీమణి శారద(Sarada) కూడా ఈ కమిటీలో ఒక సభ్యురాలు. సకాలంలోనే కమిషన్ విచారణ ముగించింది. 2019లో ప్రభుత్వానికి నివేదిక కూడా ఇచ్చింది. కారణాలేమిటో తెలియదు కానీ ఇంతకాలం అది బయటకు రాలేదు. ఇప్పుడు రైట్‌ టు ఇన్ఫర్మేషన్‌ యాక్ట్‌(Right to Information Act) కింద కోరిన వారికి ఆ కమిటీ రిపోర్టు ఇవ్వవచ్చని కేరళ హైకోర్టు(Kerala High court) చెప్పింది. దీంతో ఆగస్టు 19వ తేదీన ఆ రిపోర్టు జర్నలిస్టుల(Journlaist)కు అందింది. మొత్తం 295 పేజీలతో కమిటీ నివేదికను రూపొందించింది. అయితే కొన్ని సున్నితమైన అంశాలు, వ్యక్తిగత వివరాలు ఉన్న విషయాలను మాత్రం రహస్యంగానే ఉంచారు. 63 పేజీల రిపోర్టు తప్ప మిగతాది ఇప్పుడు బహిర్గతమయ్యింది. 15 మంది పెద్దలు ఇండస్ట్రీని గుప్పిట్లో పెట్టుకుని మహిళల జీవితాలను శాసిస్తున్నారని కమిటీ తెలిపింది. కొత్తగా వచ్చేవారు ఎదురుప్రశ్నించకూడదు. శరీరాలను సమర్పించుకోవాలి. అడగ్గానే కోరికలు తీర్చాలి. పక్కన పడుకోమంటే పడుకోవాలి. కాదు కూడదన్న వారికి సినిమా ఛాన్సులు ఉండవు. జస్టిస్‌ హేమా కమిటీ (Justice Hema Committee)నివేదికలో విస్తుపోయే వాస్తవాలు ఇవి. చాలా మంది నటీమణులు కమిటీ ముందు తమ ఆవేదనను, బాధను వ్యక్తపరచుకున్నారు. ఒక సీనియర్‌ నటి తనకు ఎదురైన అనుభవాలను కమిటీ ముందు చెప్పుకుంది. ' ఓ హీరో నన్ను అనేక మార్లు లైంగికంగా వేధించే ప్రయత్నంచేశాడు. నేను లొంగలేదు. అందుకే ఓ సినిమాలో కౌగిలించుకునే సన్నివేశాన్ని సృష్టించారు. నిజానికి ఆ సీన్‌ సినిమాలో అనవసరం. సరే ఆ సీన్‌ తీసేటప్పుడు కావాలనే 17 టేకులు తీసుకున్నాడు. దర్శకుడు కూడా ఏమీ మాట్లాడలేదు. ఇది జరిగిన తర్వాత బెడ్‌ రూమ్‌ సీన్‌ పెట్టాడు. ఇలా నన్ను అతడు బాగా వేధించాడు' అని కన్నీటి పర్యంతమయ్యిందా నటి! ఇలాంటి వేధింపులు ఇండస్ట్రీలో సర్వసాధారణమని తేలింది. గతంలో పేరు ప్రతిష్టలు సాధించిన వారంతా ఇలా నడుచుకునే పైకి వచ్చారని కొత్తగా వచ్చే నటిమణులకు మగ పెద్దలు చెబుతూ ఉంటారు. వేషం ఇస్తామని సినిమా వాళ్లే ఫోన్‌ చేస్తే పర్లేదు కానీ అదే మహిళలు వెళ్లి వేషం అడిగితే మాత్రం వారి కోరిక తీర్చాల్సిందేనని కమిటీ ముందు చాలా మంది చెప్పుకున్నారు. కొందరు హీరోలు, కొందరు దర్శకులు, కొందరు నిర్మాతలు కలిసి ఇండస్ట్రీని తమ గుప్పిట్లో పెట్టుకున్నారని, వారు చెప్పినట్టుగానే సాగాలని రిపోర్ట్‌ చెప్పింది. ఆ 15 మంది ఎవరో బయటకు రావాల్సి ఉంది. సినీ పరిశ్రమలో మహిళల సమస్యలను పరిష్కరించడానికి ప్రత్యేక చట్టాలు ఉండాలని కమిటీ రికమెండ్‌ చేసింది. అవసరమైతే ప్రత్యేక ట్రిబ్యునల్‌ను ఏర్పాటు చేయాలని తెలిపింది. నేర చరిత్ర ఉన్నవారిని ఇండస్ట్రీ నుంచి బహిష్కరించాలని కమిటీ సిఫారసు చేసింది. షూటింగ్‌ జరిగే ప్రాంతాల్లో మద్యం, మాదకద్రవ్యాలపై నిషేధం విధించాలని, ఫ్యాన్‌ క్లబ్స్‌ మహిళలను వేధించకుండా చర్యలు తీసుకోవాలని, పరిశ్రమలో పనిచేసే మహిళలకు పురుషులతో సమానంగా వేతనాలు అందించాలని కమిటీ రికమెండ్‌ చేసింది. హీరోయిన్లు ఎంత గొప్పగా నటించినా, హీరోయిన్‌ ఓరియెంటెడ్‌ సినిమా అయినప్పటికీ పారితోషికం విషయంలో మహిళలకు ఇస్తున్నది చాలా తక్కువ. కమిటీ ఇందుకు టేక్‌ ఆఫ్‌ సినిమాను ఉదహరించింది. అందులో ఇద్దరు హీరోలు సెట్‌లో ఉన్నది చాలా తక్కువ సమయమే అయినప్పటికీ హీరోయిన్‌కు వారి కంటే తక్కువ పారితోషికం ఇచ్చారు. ఈ చిత్రానికి మహేశ్‌ నారాయణ్‌ (Mahesh Narayan)దర్శకత్వం వహించాడు. కుంచాకో బోబన్‌(Kunchacko Boban), ఫహద్‌ ఫాజిల్‌(Fahadh Faasil)లు ప్రధాన పాత్రలను పోషించారు. కథానాయికగా పార్వతి తిరువోతు(Parvathy Thiruvothu)నటించారు. జాతీయ చలనచిత్ర అవార్డులలో ఈ సినిమాకుగాను పార్వతికి ప్రత్యేక జ్యూరీ అవార్డు లభించింది. కేరళ స్టేట్‌(Kerala state)అవార్డు వచ్చింది. సినిమా మొత్తాన్ని పార్వతి ఒంటిచేత్తో నడిపించినప్పటికీ ఆమెకు ఇచ్చిన రెమ్యునరేషన్‌ చాలా తక్కువ. సినిమాలలో ఈ లింగ వివక్ష ప్రబలంగా ఉందని జస్టిస్‌ హేమ కమిషన్ తెలిపింది. మన తెలుగు సినిమా పరిశ్రమలో మహిళలు ఎదుర్కొంటున్న వేధింపులపై ఓ కమిషన్‌ వేస్తే ఇంతకంటే దారుణమైన విషయాలు వెలుగులోకి వస్తాయి. మన దగ్గర అమ్మాయి కనిపిస్తే కడుపైనా చేయాలి, ముద్దయినా పెట్టుకోవాలి అనే బాపతు వాళ్లు ఎక్కువే కదా!

Updated On
ehatv

ehatv

Next Story