ఇది ఏ మాత్రం ఆమోదయోగ్యం కాదని విజయ్ చెప్పుకొచ్చారు

పౌరసత్వ (సవరణ) చట్టం, 2019ని అమలు చేసిన తర్వాత నరేంద్ర మోదీ నేతృత్వంలోని కేంద్ర ప్రభుత్వంపై తమిళ నటుడు, తమిళగ వెట్రి కజగం చీఫ్ (TVK) ఇళయ దళపతి విజయ్ మండిపడ్డారు. డిసెంబర్ 31, 2014 కంటే ముందు భారతదేశానికి వచ్చిన పాకిస్తాన్, బంగ్లాదేశ్, ఆఫ్ఘనిస్తాన్ నుండి పత్రాలు లేని ముస్లిమేతర వలసదారులకు పౌరసత్వం వేగవంతం చేయడానికి ఈ చట్టాన్ని పార్లమెంటు ఆమోదించిన నాలుగు సంవత్సరాల తర్వాత కేంద్రం CAA నిబంధనలను నోటిఫై చేసింది. 2019లో సీఏఏ చట్టం తీసుకువచ్చారు. సీఏఏ నిబంధనలు, మార్గదర్శకాలపై స్పష్టత లేకపోవడంతో దీని అమలు ఆలస్యం కాగా.. తాజాగా నోటిఫికేషన్ విడుదల చేశారు.

ఇది ఏ మాత్రం ఆమోదయోగ్యం కాదని విజయ్ చెప్పుకొచ్చారు. "దేశంలోని పౌరులందరూ సామాజిక సామరస్యంతో జీవించే వాతావరణంలో భారత పౌరసత్వ సవరణ చట్టం 2019 (CAA) వంటి ఏ చట్టాన్ని అమలు చేయడం ఆమోదయోగ్యం కాదు" అని విజయ్ తమిళంలో ఓ ప్రకటనను విడుదల చేశారు. తమిళనాడులో చట్టాన్ని అమలు చేయకుండా చూడాలని తమిళనాడు ప్రభుత్వాన్ని ఆయన అభ్యర్థించారు. ఇతర ప్రతిపక్ష నాయకులు కూడా పౌరసత్వ (సవరణ) చట్టం కోసం నిబంధనలను నోటిఫై చేసిన కేంద్రంపై విమర్శలు గుప్పించారు. సార్వత్రిక ఎన్నికలకు ముందు ప్రజలను విభజించడానికి బీజేపీ ప్రయత్నిస్తోందని ఆరోపించారు.

Updated On 11 March 2024 11:21 PM GMT
Yagnik

Yagnik

Next Story