ఈ మధ్య కాలంలో లింగ మార్పిడి(Gender change) చేయించుకుంటున్న వార్తలను చాలానే చూస్తున్నాం.

ఈ మధ్య కాలంలో లింగ మార్పిడి(Gender change) చేయించుకుంటున్న వార్తలను చాలానే చూస్తున్నాం. తమకు ఉన్న ఆసక్తులకు అనుగుణంగా లింగ మార్పిడి చేసుకుంటున్నారు. అది సాధారణమే అయినా దేశంలోనే అత్యున్నత అధికారిక స్థానంలో ఉన్న ఓ మహిళా ఐఆర్‌ఎస్ అధికారిని(IRS Officer) లింగ మార్పిడి చేసుకుంది. తనకు సంబంధించిన అధికారిక రికార్డుల్లో పేరు, జెండర్ మార్చుకున్నారు. ఈ మేరకు ఐఆర్ఎస్ అధికారిని చేసిన అభ్యర్థనకు కేంద్ర ఆర్థిక మంత్రిత్వ శాఖ కూడా ఆమోదం తెలిపింది. ఇలాంటి కీలక పరిణామం చరిత్రలో ఇదే తొలిసారి అంటున్నారు. ఆసక్తికరమైన విషయమేంటంటే ఇలా పేరు, జండర్ మార్చుకున్న ఆఫీసర్ ప్రస్తుతం మన హైదరాబాద్‌లోనే పనిచేస్తున్నారు.
వివరాల్లోకి వెళ్తే ఇండియన్ రెవెన్యూ సర్వీస్‌లో పనిచేస్తున్న మహిళా అధికారి తన పేరు, జెండర్ మార్చుకున్నారు. ఈ ఐఆర్‌ఎస్ అధికారి ఇన్నిరోజులు స్త్రీగా ఉన్నా ఇక నుంచి పురుషుడి హోదాలో కనిపించనున్నారు. కస్టమ్స్ ఎక్సైజ్, సర్వీస్ ట్యాక్స్ అప్పిలేట్ ట్రిబ్యూనల్ చీఫ్ కమిషనర్ ఆఫీసులో జాయింట్ కమిషనర్‌గా పనిచేస్తున్న ఎం.అనసూయ (35) ఇక నుంచి ఎం. అనుకర్ సూర్యగా మారిపోయారు. ఇందుకు కేంద్ర ఆర్థిక శాఖ మంత్రిత్వశాఖ కూడా అనుమతించడంతో అధికారిక రికార్డుల్లో ఇప్పుడు అనుకర్ సూర్యగా గుర్తిస్తారు. కేంద్రం నుంచి కూడా మంగళవారం ఉత్తర్వులు వెలుపడ్డాయి. అనుకర్ సూర్య 2013 బ్యాచ్‌కు చెందిన ఐఆర్‌ఎస్ అధికారి. 2018లో డిప్యూటీ కమిషనర్‌గా ప్రమోషన్ పొంది హైదరాబాద్‌లో బాధ్యతలు నిర్వహిస్తున్నారు. ఇతను మద్రాస్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీలో ఎలక్ట్రానిక్ అండ్ కమ్యూనికేసన్‌లో బ్యాచిలర్ డిగ్రీ చదివారు. 2023లో భోపాల్‌లోని(Bhopal) నేషనల్ లా ఇనిస్టిట్యూట్ యూనివర్సిటీలో సైబర్ లా అండ్ సైబర్ ఫోరెన్సిక్‌లో కూడా పీజీ డిప్లొమా పూర్తి చేశారు. దేశ చరిత్రలోనే ఓ ఉన్నత స్థాయి అధికారి జండర్, పేరు మార్చడం చరిత్రలో నిలిచిపోనుందని అధికారులు విశ్లేషిస్తున్నారు.
