పంజాబ్‌లో అవినీతి పోలీస్ ఆఫీసర్ అవినీతి బాగోతం బయటపడింది.

పంజాబ్‌లో అవినీతి పోలీస్ ఆఫీసర్ అవినీతి బాగోతం బయటపడింది. పంజాబ్ డిప్యూటీ ఇన్స్పెక్టర్ జనరల్(డీఐజీ) ఆఫ్ పోలీస్ హర్చరణ్ భుల్లార్‌ను లంచం ఆరోపణల నేపథ్యంలో సీబీఐ అధికారులు అరెస్ట్ చేశారు. రూ. 8 లక్షల లంచం కేసులో సీబీఐ.. భుల్లార్‌కు సంబంధించిన ఇళ్లలో తనిఖీలు చేయగా ఆయన అవినీతి కొండ బయటపడింది. మండి గోబింద్‌గఢ్‌కు చెందిన తుక్కు వ్యాపారి ఆకాశ్ బట్టాపై 2023లో కేసు నమోదైంది. ఈ కేసును మాఫీ చేసేందుకు, నెలవారీ మామూళ్లతోపాటు రూ.8 లక్షల లంచం ఇవ్వాలని డీఐజీ భుల్లార్ డిమాండ్ చేశారు. ఇందుకుగాను కిషన్ అనే మధ్యవర్తితో వ్యవహారం నడిపారు. ఈ మేరకు వ్యాపారి ఆకాశ్ నుంచి సమాచారం అందుకున్న సీబీఐ అధికారులు నిఘా పెట్టారు. గురువారం చండీగఢ్‌లో ఆకాశ్ నుంచి డీఐజీ తరఫున రూ.8 లక్షలు తీసుకుంటుండగా కిషన్‌ను సీబీఐ రెడ్ హ్యాండెడ్‌గా పట్టుకుంది. ఈ మేరకు సీబీఐ ఆయన అరెస్టును ధృవీకరించింది. ఈ సందర్భంగా డీఐజీ, మధ్యవర్తి కిషను, వ్యాపారి ఆకాశ్ మధ్య జరిగిన వాట్సాప్ సంభాషణ ఆధారంగా డీఐజీని అరెస్ట్ చేశామని పేర్కొంది డీఐజీ కార్యాలయం, నివాసంలో జరిపిన సోదాల్లో రూ.5 కోట్ల నగదు, కిలోన్నర బరువున్న ఆభరణాలు, ఆస్తి పత్రాలు, మెర్సిడెజ్, ఆడి కార్లు, 22 ఖరీదైన గడియారాలు, డబుల్ బ్యారెల్ గన్, పిస్టల్, రివాల్వర్, ఎయిర్ గన్, మందుగుండు సామగ్రిని స్వాధీనం చేసుకున్నామని వివరించింది.
