పాకిస్థాన్‌కు బుద్ధి చెప్పేందుకు భారత్‌ సిద్ధమవుతోందా?

సర్వసన్నద్ధమవుతున్న భారత్‌!

అమెరికా, చైనా సహా పలు దేశాలకు పరిస్థితిని వివరించిన విదేశాంగ శాఖ

పీ5 దేశాలతో జైశంకర్‌ చర్చలు

తాలిబాన్‌ కూడా మనవైపే..

సీసీఎస్‌ భేటీలో సైనిక సన్నద్ధతపై ప్రధాని సమీక్ష

కీలక విన్యాసాలు ప్రారంభించిన త్రివిధ దళాలు

జాతీయ భద్రతా సలహా బోర్డు పునర్వ్యవస్థీకరణ

చైర్మన్‌గా 'రా' మాజీ చీఫ్‌ అలోక్‌ జోషి

తెలుగు అధికారి వెంకటేశ్‌ వర్మకూ స్థానం

మాపై నేడో, రేపో సైనిక దాడి

మా దగ్గర విశ్వసనీయ సమాచారం ఉంది

దాడి చేస్తే భారత్‌కు మూల్యం తప్పదు

పాకిస్థాన్‌ సమాచార మంత్రి తరార్‌ వ్యాఖ్య

పాకిస్థాన్‌కు బుద్ధి చెప్పేందుకు భారత్‌ సిద్ధమవుతోందా? ఏ క్షణంలోనైనా పాక్‌పై విరుచుకుపడేందుకు సన్నద్ధమవుతోందా? దాయాదికి గట్టి గుణపాఠం నేర్పనుందా? పహల్గాం ఉగ్రదాడికి బదులు తీర్చుకోనుందా? అంటే.. కేంద్ర ప్రభుత్వం తీసుకుంటున్న చర్యల్ని చూస్తే అవుననే సమాధానం వస్తుంది. పాకిస్థాన్‌ కూడా తమపై నేడో రేపో దాడి జరగడం తథ్యమని భావిస్తోంది. కాగా, 2018 నుంచీ పెద్దగా పనిలేకుండా ఉన్న జాతీయ భద్రతా సలహా బోర్డును మోదీ సర్కారు తాజాగా పునర్వ్యవస్థీకరించింది. 'రా' మాజీ చీఫ్‌ను చైర్మన్‌గా, ఆరుగురు కీలక అధికారులను సభ్యులుగా నియమించింది. పాక్‌ సీమాంతర ఉగ్రవాదం గురించి చాటిచెప్పడంతోపాటు తాము తీసుకోబోయే చర్యలను వివరించేందుకు భారత్‌ జీ-20, గ ల్ఫ్‌ దేశాలతో సహా ఇప్పటికే 25 ప్రధాన దేశాలను సంప్రదించింది. పాకిస్థాన్‌ను తీవ్రంగా వ్యతిరేకిస్తున్న తాలిబాన్‌ను కూడా విశ్వాసంలోకి తీసుకున్నట్లు సమాచారం. పహల్గాం ఉగ్రదాడిని తాలిబాన్‌ తీవ్రంగా ఖండించిన సంగతి తెలిసిందే. ఖైబర్‌ పఖ్తున్‌ఖ్వాలో పాకిస్థాన్‌ ఇప్పటికే తాలిబాన్‌ తిరుగుబాటును ఎదుర్కొంటోంది. ఈ క్రమంలో భారత విదేశాంగ శాఖ సంయుక్త కార్యదర్శి ఆనంద్‌ ప్రకాశ్‌ నేతృత్వంలో భారత ప్రతినిఽధులు కాబూల్‌ చేరుకుని తాలిబాన్‌ విదేశాంగ మంత్రితో చర్చలు జరిపారు. తాజాగా కేంద్ర విదేశాంగ శాఖ మంత్రి జైశంకర్‌ స్వయంగా పీ5 దేశాలైన అమెరికా, చైనా, బ్రిటన్‌, రష్యా, ఫ్రాన్స్‌ విదేశాంగ మంత్రులతో మాట్లాడారు.

మరోవైపు బుధవారం రెండోసారి జరిగిన భద్రతా వ్యవహారాల క్యాబినెట్‌ కమిటీ సమావేశంలో ప్రధాని మోదీ త్రివిధ దళాల సన్నద్ధతపై సమీక్షించారు. త్రివిధ దళాలు ఇప్పటికే కీలక విన్యాసాలు ప్రారంభించాయని అధికారులు ప్రధానికి వివరించినట్లు తెలిసింది. భారత వైమానిక దళం 'ఆక్రమణ్‌' పేరుతో నేలపై, పర్వతాలపై దాడులు జరిపేందుకు విన్యాసాలు ప్రారంభించగా, ఆర్మీ నైరుతి కమాండ్‌ తమ దళాలకు ఆయుధాల ప్రయోగంలో శిక్షణను ముమ్మరం చేసింది.

పాక్‌ కాల్పులు.. భారత్‌ ఎదురుకాల్పులు..

జమ్మూకశ్మీరులోని పరగవాల్‌ సెక్టార్‌లో నియంత్రణ రేఖ వద్ద నిబంధనలను ఉల్లంఘించి బుధవారం పాక్‌ దళాలు కాల్పులు జరిపాయి. వారికి మన సైన్యం ఎదురు కాల్పులతో దీటైన జవాబిచ్చింది. మరోవైపు సింధు జలాల ఒప్పందం రద్దును అమలు చేసే విషయమై కేంద్ర హోంమంత్రి అమిత్‌ షా, జలశక్తి మంత్రి సీఆర్‌ పాటిల్‌ బుధవారం రాత్రి కీలక చర్చలు జరిపారు.

జాతీయ భద్రతా సలహా బోర్డు..

భారతదేశ రక్షణ పరిస్థితిని విశ్లేషించి, ఎప్పటికప్పుడు సిఫారసులు చేసేందుకు గాను జాతీయ భద్రతా సలహా బోర్డును పునర్వ్యవస్థీకరించారు. దీనికి చైర్మన్‌గా రా మాజీ చీఫ్‌ అలోక్‌ జోషీని నియమించారు. ఈ బోర్డులో ముగ్గురు సైనిక నేపథ్యం, ఇద్దరు పోలీసు నేపథ్యం, ఒకరు విదేశాంగ వ్యవహారాల నేపథ్యం కలిగిన వారు ఉన్నారు. సదరన్‌ ఆర్మీ కమాండర్‌ లెఫ్టినెంట్‌ జనరల్‌ ఏకే సింగ్‌, వెస్ట్రన్‌ ఎయిర్‌ మాజీ కమాండర్‌ ఎయిర్‌ మార్షల్‌ పీఎం సిన్హా, మాజీ రేర్‌ అడ్మిరల్‌ మాంటీ ఖన్నా, మాజీ ఐపీఎస్‌ అధిరులు రాజీవ్‌ రంజన్‌ వర్మ, మన్మోహన్‌ సింగ్‌, విదేశాంగ శాఖ మాజీ అధికారి బి.వెంకటేశ్‌ వర్మ వీరిలో ఉన్నారు. పశ్చిమ గోదావరి జిల్లాకు చెందిన మాజీ ఐఎ్‌ఫఎస్‌ అధికారి వెంకటేశ్‌ వర్మ హైదరాబాద్‌ పబ్లిక్‌ స్కూలులో, నిజాం కాలేజీలో చదివారు. 1988 బ్యాచ్‌ అధికారి అయిన వర్మ.. రష్యా, చైనా దేశాలకు రాయబారిగా పనిచేశారు. భారత్‌-అమెరికా అణు ఒప్పందంలో కీలక పాత్ర పోషించారు. పాకిస్థాన్‌పై తదుపరి దశ ఆంక్షలు, దాడులపై ఈ బోర్డు సలహాలు ఇవ్వనుంది.

పాక్‌కు మన గగనతలం బంద్‌

పాకిస్థాన్‌కు చెందిన అన్ని రకాల విమానాలకు గగనతలాన్ని మూసివేస్తూ భారత్‌ బుధవారం నిర్ణయం తీసుకుంది. పాక్‌ ఇప్పటికే భారత విమానాలకు తమ గగనతలాన్ని మూసివేసింది. తాజాగా భారత్‌ ఆ చర్య తీసుకుంది. దీనితో పాక్‌ నుంచి దక్షిణాసియా, ఆగ్నేయాసియా దేశాలకు వెళ్లే విమానాలు.. చైనా లేదా శ్రీలంక మీదుగా చుట్టూ తిరిగి వెళ్లాల్సిందే. ఇప్పటికే ఆర్థికంగా కుదేలైన పాక్‌ విమానయాన సంస్థలకు దీనితో మరింత దెబ్బతగలడం ఖాయమని నిపుణులు చెబుతున్నారు.

786 పాకిస్థాన్‌కు.. 1,465మంది భారత్‌కు..

పాకిస్థానీల వీసాల రద్దు నిర్ణయం తర్వాత భారతదేశం నుంచి 786 మంది పాక్‌ దేశస్థులు వెళ్లిపోయారు. వీరిలో దౌత్యవేత్తలు, వారి కుటుంబసభ్యులు, సిబ్బంది కూడా ఉన్నారు. వీరితో పాటు పాక్‌ వీసా కలిగి ఉన్న 8 మంది భారతీయులు కూడా వెళ్లిపోయారు. మరోవైపు, పాకిస్థాన్‌ నుంచి 1,465 మంది ఇండియాకు వచ్చారు.

ఆలస్యం చేయొద్దు: రాహుల్‌

పహల్గాంలో 28 మంది పర్యాటకుల ప్రాణాలను బలిగొన్న ఉగ్రమూక భారీ మూల్యం చెల్లించుకోవాల్సిందేనని కాంగ్రెస్‌ అగ్రనేత రాహుల్‌ గాంధీ అన్నారు. ఈ దాడికి బాధ్యులైన వారిపై ఆలస్యం చేయకుండా ప్రధాని మోదీ కఠిన చర్యలు తీసుకోవాలని.. తద్వారా ఇలాంటి మూర్ఖపు చేష్టలకు పాల్పడితే భారత్‌ ఎంతమాత్రం ఉపేక్షించదనే గట్టి సందేశాన్ని ఇవ్వాలని పేర్కొన్నారు. పహల్గాం ఘటనలో ప్రభుత్వం తీసుకోబోయే చర్యలకు తమ నుంచి వందశాతం మద్దతు ఉంటుందని రాహుల్‌ ఈ సందర్భంగా స్పష్టం చేశారు.

ehatv

ehatv

Next Story