కర్ణాటక(Karnataka)లో గెలుపు కోసం బీజేపీ అన్నీ అస్త్రాలు వాడేసింది. ఇప్పుడు అప్పనంగా బజరంగ్‌దళ్(Bajrang Dal) అస్త్రం దొరికంది. అధికారంలోకి వస్తే బజరంగ్ దళ్‌ను నిషేధిస్తామన్న కాంగ్రెస్ ఎన్నికల హామీని బీజేపీ ప్రధాన ప్రచారాస్త్రంగా మలచుకుంది. ప్రధానమంత్రి నరేంద్రమోదీ ఎన్నికల ర్యాలీలో ఇదే అంశాన్ని మాట్లాడారు. ‘కాంగ్రెస్ చరిత్రంతా ఉగ్రవాద, ఉగ్రవాదుల సంతుష్టీకరణమయమన్నారు.

Karnataka Elections 2023
కర్ణాటక(Karnataka)లో గెలుపు కోసం బీజేపీ అన్నీ అస్త్రాలు వాడేసింది. ఇప్పుడు అప్పనంగా బజరంగ్‌దళ్(Bajrang Dal) అస్త్రం దొరికంది. అధికారంలోకి వస్తే బజరంగ్ దళ్‌ను నిషేధిస్తామన్న కాంగ్రెస్ ఎన్నికల హామీని బీజేపీ ప్రధాన ప్రచారాస్త్రంగా మలచుకుంది. ప్రధానమంత్రి నరేంద్రమోదీ ఎన్నికల ర్యాలీలో ఇదే అంశాన్ని మాట్లాడారు. ‘కాంగ్రెస్ చరిత్రంతా ఉగ్రవాద, ఉగ్రవాదుల సంతుష్టీకరణమయమన్నారు. ఉగ్రవాదులు హతమైతే కన్నీరు కారుస్తుందని చెప్పారు. చివరికి సైనికులనూ అవమానిస్తుందంటూ విమర్శలు చేశారు. గతంలో వారికి రామునితో సమస్య అని, ఇప్పుడు జై బజరంగ బలీ అని నినదించే వాళ్లతో సమస్య అని చెప్పుకొచ్చారు. హనుమంతుడు పుట్టిన గడ్డకు వచ్చి ఆ రామభక్తునికి ప్రణామాలు సమర్పించే భాగ్యం తనకు దక్కిందంటూ తెలిపారు. కాంగ్రెస్ అప్పట్లో రామున్ని ఖైదు చేసినట్టే ఇప్పుడు హనుమాన్ భక్తులపైనా పడతామంటోందని పేర్కొన్నారు. ఇటువంటి పనుల వల్లే ఆ పార్టీ ఇప్పుడు కేవలం మూడు రాష్ట్రాలకు పరిమితమైందని ప్రధాని చెప్పుకొచ్చారు.
మోదీ(Modi) వ్యాఖ్యలకు కాంగ్రెస్(Congress) ధీటుగానే కౌంటరిచ్చింది. హనుంతుడిని బజరంగ్ దళ్‌తో పోల్చడం సిగ్గుచేటని మండిపడింది. తద్వారా మత సెంటిమెంట్లను రగిల్చేందుకు మోదీ ప్రయత్నిస్తున్నారని పార్టీ అధికార ప్రతినిధి పవన్ ఖేరా ఆరోపించారు. కోట్లాది హనుమద్భక్తులను అవమానించినందుకు క్షమాపణలు చెప్పాలని ఆయన డిమాండ్ చేశారు.
విచిత్రమేమిటంటే ఇదే భారతీయ జనతా పార్టీ ఉత్తరప్రదేశ్(Uttar Pradesh)లో ఇదే రకమైన వ్యాఖ్యలు చేసింది. 2016, మే 28న ఉత్తరప్రదేశ్‌లో ఆనాటి బీజేపీ జాతీయ అధ్యక్షుడు అమిత్‌షాAmit Shah) ఇలాంటి మాటలే మాట్లాడారు. ఉత్తరప్రదేశ్‌లోని పలు ప్రాంతాలలో బజరంగ్‌దళ్ తమ కార్యకర్తలకు ఆయుధ శిక్షణ ఇస్తున్నదని ఓ విలేకరి అడిగిన ప్రశ్నకు ఆయన చట్టవిరుద్ధమైన కార్యకలాపాలకు పాల్పడుతుందని తేలితే రాష్ట్ర ప్రభుత్వం చర్యలు తీసుకుంటుందని చెప్పారు. చర్యలు తీసుకుంటామని అమిత్‌షా అన్నప్పుడు ఇది హనుమాన్ భక్తులను గాయపరిచినట్టేనని అప్పుడు మోదీతో పాటు ఎవరూ ఎందుకు యాగి చేయలేదని అడుగుతున్నారు కాంగ్రెస్ పార్టీ నేతలు. కాంగ్రెస్ చెబితే అంత రాద్ధాంతం ఎందుకు చేస్తున్నట్టు అని నిలదీశారు.
