కల్నల్ సోఫియా ఖురేషీని మతంతో ముడిపెట్టి మంత్రి వ్యాఖ్యలు, వివాదం

పాకిస్థాన్‌(Pakistan)తో ఉద్రిక్తతల నేపథ్యంలో మీడియాకు సమాచారం అందిస్తున్న సైనికాధికారిణి కల్నల్ సోఫియా ఖురేషీని ఉద్దేశించి మధ్యప్రదేశ్ గిరిజన సంక్షేమ శాఖ మంత్రి విజయ్ షా చేసిన వ్యాఖ్యలు తీవ్ర వివాదానికి దారితీశాయి. ఈ వ్యాఖ్యలు రాజకీయంగా తీవ్ర చర్చనీయాంశమయ్యాయి. ప్రతిపక్ష కాంగ్రెస్ పార్టీ షాపై తీవ్రంగా విరుచుకుపడగా, అధికార బీజేపీ కూడా ఆయన వ్యాఖ్యలపై అసంతృప్తి వ్యక్తం చేసింది.

ఇటీవల ఇండోర్ సమీపంలోని ఒక గ్రామంలో జరిగిన బహిరంగ సభలో విజయ్ షా మాట్లాడుతూ,

"ఉగ్రవాదులు మన సోదరీమణుల నుదుటి సిందూరాన్ని తుడిచి, వారిని వితంతువులుగా మార్చారు. దానికి ప్రతిగా, వారి మతానికి చెందిన ఒక సోదరిని (కల్నల్ సోఫియా ఖురేషీని ఉద్దేశిస్తూ) గౌరవనీయులైన మోదీ(PM Modi)జీ సైనిక విమానంలో పాకిస్థాన్‌కు పంపి గట్టిగా బుద్ధి చెప్పారు" అని అన్నారు.

ఈ వ్యాఖ్యలు వైరల్ కావడంతో విమర్శలు వెల్లువెత్తాయి. మహిళా సైనికాధికారిణిని మతంతో ముడిపెట్టి మాట్లాడటంపై పలువురు తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు.

కాంగ్రెస్ రాజీనామా డిమాండ్

విజయ్ షా వ్యాఖ్యలపై కాంగ్రెస్(Congress) తీవ్రంగా స్పందించింది. ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే(Mallikarjuna Kharge) ఈ వ్యాఖ్యలను సిగ్గుచేటని, మహిళలను కించపరిచేవిగా విమర్శించారు. బాధ్యతాయుతమైన మంత్రి ఇలాంటి వ్యాఖ్యలు చేయడం దారుణమని, షాను వెంటనే మంత్రి మండలి నుంచి తొలగించాలని కాంగ్రెస్ డిమాండ్ చేసింది.

బీజేపీ నాయకత్వం మందలింపు

వివాదం తీవ్రమవడంతో మధ్యప్రదేశ్ బీజేపీ(BJP) నాయకత్వం జోక్యం చేసుకుంది. విజయ్ షా(Vijay Shah)ను పిలిపించి, ఆయన వ్యాఖ్యలపై తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేసినట్లు తెలిసింది. భవిష్యత్తులో ఇలాంటి వ్యాఖ్యలు పునరావృతం కాకుండా జాగ్రత్త వహించాలని గట్టిగా హెచ్చరించారు. పార్టీ ప్రతిష్ఠకు హాని కలిగించే విధంగా వ్యవహరించవద్దని సూచించారు.

మంత్రి క్షమాపణ

అన్ని వైపుల నుంచి విమర్శలు ఎదురవడంతో విజయ్ షా క్షమాపణ చెప్పారు. ఉగ్రవాదుల చర్యల వల్ల తన మనసు కలత చెందిందని, ఆ ఆవేశంలో ఆ వ్యాఖ్యలు చేశానని వివరణ ఇచ్చారు.

"కులమతాలకు అతీతంగా దేశానికి సేవ చేస్తున్న కల్నల్ ఖురేషీ సేవలకు సెల్యూట్ చేస్తాను. ఆమెను కించపరిచే ఉద్దేశం నాకు లేదు. నా మాటలు ఎవరినైనా నొప్పించి ఉంటే, పదిసార్లు క్షమాపణ చెప్పడానికి సిద్ధంగా ఉన్నాను" అని షా పేర్కొన్నారు

ehatv

ehatv

Next Story