బీహార్‌లో రాబోయే అసెంబ్లీ ఎన్నికల సందర్భంగా కాంగ్రెస్ పార్టీ మహిళల కోసం "ప్రియదర్శిని ఉడాన్ యోజన" పేరిట ఒక కార్యక్రమాన్ని ప్రకటించింది.

బీహార్‌లో రాబోయే అసెంబ్లీ ఎన్నికల సందర్భంగా కాంగ్రెస్ పార్టీ మహిళల కోసం "ప్రియదర్శిని ఉడాన్ యోజన" పేరిట ఒక కార్యక్రమాన్ని ప్రకటించింది. ఈ కార్యక్రమం ద్వారా రాష్ట్రంలోని మహిళలకు ఉచిత శానిటరీ ప్యాడ్(Sanitary Pads )లను పంపిణీ చేయనున్నారు. ఈ శానిటరీ ప్యాడ్‌ల ప్యాకెట్లపై కాంగ్రెస్ నాయకుడు రాహుల్ గాంధీ ఫోటోను ముద్రించారు, అలాగే "మై-బహిన్ మాన్ యోజన" కింద మహిళలకు నెలకు రూ. 2,500 ఆర్థిక సహాయం అందించే హామీ, "నారీ న్యాయ్, మహిళా సమ్మాన్" నినాదం కూడా ముద్రించబడింది. ఈ కార్యక్రమం ద్వారా మహిళల్లో ఋతుస్రావ పరిశుభ్రతపై అవగాహన కల్పించడం లక్ష్యంగా పెట్టుకున్నారు. అయితే, ఈ శానిటరీ ప్యాడ్‌లపై రాహుల్ గాంధీ ఫోటో ముద్రించడం వివాదాస్పదమైంది. బీజేపీ, జేడీ(యూ) వంటి ప్రతిపక్ష పార్టీలు ఈ చర్యను విమర్శించాయి. బీజేపీ జాతీయ ప్రవక్త ప్రదీప్ భండారీ ఈ చర్యను మహిళలకు వ్యతిరేకమైన కాంగ్రెస్ వైఖరిగా అభివర్ణించారు. జేడీ(యూ) నాయకుడు నీరజ్ కుమార్, బీహార్ ముఖ్యమంత్రి నీతీష్ కుమార్ మహిళల సాధికారత కోసం చేస్తున్న కృషిని హైలైట్ చేస్తూ, ఈ చర్యను అహంకార ప్రదర్శనగా విమర్శించారు. కొందరు మహిళలు కూడా, శానిటరీ ప్యాడ్‌లపై పురుషుడి ఫోటో ఉండటం సముచితం కాదని, ఇది మహిళల గౌరవాన్ని దిగజార్చే చర్యగా భావించారు. కాంగ్రెస్ నాయకురాలు అల్కా లాంబా ఈ విమర్శలను ఖండిస్తూ ఆధునిక యుగంలో, ప్యాడ్‌లపై రాహుల్ గాంధీ ఫోటో ఎందుకు ఉందని ప్రశ్నించడం కాదు, బీహార్‌లోని మహిళలు ఇప్పటికీ ఋతుస్రావ సమయంలో గుడ్డలు వాడటం వల్ల ఆరోగ్య సమస్యలు ఎదుర్కొంటున్నారని ప్రశ్నించాలి" అని వాదించారు. ఈ కార్యక్రమం బీహార్‌లోని గ్రామీణ, పట్టణ ప్రాంతాల్లో ఋతుస్రావ సంబంధిత సామాజిక అపోహలను ఛేదించడానికి, మహిళల ఆరోగ్యాన్ని పరిరక్షించడానికి ఉద్దేశించినదని కాంగ్రెస్ పేర్కొంది. ఈ వివాదం బీహార్‌లో ఎన్నికల రాజకీయాలను మరింత రసవత్తరం చేసింది, ఇది కాంగ్రెస్‌కు ఎదురుదెబ్బగా మారుతుందా లేక మహిళా ఓటర్ల మద్దతును సంపాదిస్తుందా అనేది చూడాలి
