కొంతకాలంగా భారతదేశంలో కూడా సహజీవనం (Live-in Relationship )అనే ట్రెండ్ కొనసాగుతోంది.

కొంతకాలంగా భారతదేశంలో కూడా సహజీవనం (Live-in Relationship )అనే ట్రెండ్ కొనసాగుతోంది. చాలా మంది యువత పెళ్లి చేసుకొకుండా కలిసి ఉంటున్నారు. ఈ నేపథ్యంలో ఈ సహజీవనంపై రాజస్థాన్ హైకోర్టు సంచలన తీర్పు వెలువరించింది. రాజస్థాన్ (Rajasthan)కోటా జిల్లాకు చెందిన 18 ఏళ్ల యువతి, 19 ఏళ్ల యువకుడు లివ్-ఇన్ రిలేషన్‌షిప్(Live-in Relationship )లో కలిసి జీవిస్తున్నారు. దీని కోసం, గత అక్టోబర్ 27న ఒక ఒప్పందంపై కూడా సంతకం చేశారు. అయితే, వారి తల్లిదండ్రులు ఈ సంబంధానికి తీవ్రంగా వ్యతిరేకత వ్యక్తం చేశారు. అంతేకాకుండా, వారు వివిధ బెదిరింపులకు పాల్పడినట్లు తెలుస్తోంది. దీంతో ఆ లివ్-ఇన్ జంట దీనిపై పోలీసు స్టేషన్‌లో ఫిర్యాదు చేసింది. అయితే, సంబంధిత యువకుడికి ఇంకా వివాహ వయస్సు అయిన 21 సంవత్సరాలు నిండలేదని, పోలీసులు ఎటువంటి చర్యలు తీసుకోలేదు. తమకు తగిన రక్షణ కల్పించాలని కోరుతూ రాజస్థాన్ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు.
ఈ జంట వేసిన పిటిషన్‌పై విచారించిన రాజస్థాన్ హైకోర్టు(Rajasthan High Court) కీలక వ్యాఖ్యలు చేసింది. చట్టపరమైన వివాహ వయస్సు ఒకరి గోప్యతను దోచుకోదని, భారతదేశంలో లివ్-ఇన్ రిలేషన్ చట్టవిరుద్ధం లేదా నేరం కాదని న్యాయమూర్తి అన్నారు. అంతేకాకుండా, మేజర్‌ల గోప్యత, జీవించే హక్కును ఆర్టికల్ 21 రక్షిస్తుందని, వారు ఎక్కడ నివసించాలో, జీవిత భాగస్వామిని ఎంచుకునే హక్కు వారికి ఉందని న్యాయమూర్తి స్పష్టం చేశారు.
అంతేకాకుండా, 18 ఏళ్లు దాటిన ఇద్దరు వ్యక్తులు కలిసి జీవించాలని నిర్ణయించుకుంటే, వారి నిర్ణయంలో ప్రభుత్వం జోక్యం చేసుకోలేదని న్యాయమూర్తి స్పష్టం చేశారు. ఈ కేసులో పోలీసులు లోతుగా విచారణ జరిపి, దరఖాస్తుదారులకు ప్రమాదం ఉంటే, వారికి తగిన రక్షణ కల్పించాలని ఆదేశించారు. చట్ట ప్రకారం పెళ్లికి అర్హతగా నిర్ధారించిన వయస్సు రానప్పటికీ యువతీయువకులు మేజర్లయితే ఇద్దరి అంగీకారంతో సహజీవనం చేయొచ్చని స్పష్టం చేసింది. ఈ మేరకు 18 ఏళ్ల యువతి, 19 ఏళ్ల యువకుడి సహజీవనం కేసులో కోర్టు ఈ తీర్పు వెలువరించింది. యువకుడికి వివాహ వయస్సు రాలేదన్న పబ్లిక్ ప్రాసిక్యూటర్ వాదనను కోర్టు తోసిపుచ్చింది. ఆ జంటకు రక్షణ కల్పించాలని పోలీసులను ఆదేశించింది. భారతీయ చట్టాల ప్రకారం సహజీవనాన్ని నిషేధించలేమని.. దీనిని నేరంగా కూడా చూడలేమని జస్టిస్ అనూప్ ధండ్ స్పష్టం చేశారు.


