ఆ గ్రామాల్లో కోడళ్లు కెమెరాలు ఉన్న ఫోన్లు లేదా స్మార్ట్ ఫోన్లు వాడకూడదని పంచాయతీ పెద్దలు తీర్మానించుకున్నారు.

ఆ గ్రామాల్లో కోడళ్లు కెమెరాలు ఉన్న ఫోన్లు లేదా స్మార్ట్ ఫోన్లు వాడకూడదని పంచాయతీ పెద్దలు తీర్మానించుకున్నారు. రాజస్థాన్‌లోని ఒక పంచాయతీ ఒక వింతైన షరతు విధించింది. జలోర్ జిల్లాలోని సుంధమాత ప్రాంతంలో ఉన్న చౌదరి కమ్యూనిటీ ఉన్న 15 గ్రామాల్లో మహిళలు కెమెరాలతో కూడిన మొబైల్ ఫోన్‌ల వాడకాన్ని నిషేధించాలని తీర్మానించింది. ఈ నిర్ణయం జనవరి 26 నుండి అమలులోకి వస్తుంది.
గ్రామ పంచాయతీ ఆదేశం ప్రకారం, ఈ గ్రామాల్లోని మహిళలు, మరీ ముఖ్యంగా కోడళ్లు, కూతుళ్లు ఇకపై స్మార్ట్‌ఫోన్‌లు లేదా కెమెరాలతో కూడిన మొబైల్ ఫోన్‌లను వాడకూడదని ఆదేశాలు జారీ చేశారు. ప్రధానంగా కీప్యాడ్‌లతో కూడిన సాధారణ మొబైల్ ఫోన్‌లను మాత్రమే తీసుకెళ్లడానికి అనుమతించనున్నట్లు తీర్మానించారు. అంతేకాకుండా, వివాహాలు, సామాజిక సమావేశాలు, బహిరంగ కార్యక్రమాలకు లేదా పక్కింటికి వెళ్తే మొబైల్ ఫోన్‌లను తీసుకెళ్లకూడదని తీర్మానించారు. జలోర్ జిల్లాలోని ఘాజీపూర్ గ్రామంలో జరిగిన చౌదరి కమ్యూనిటీ సమావేశంలో ఈ నిర్ణయం తీసుకున్నారు. ఈ సమావేశానికి సుంధమాత పట్టి అధ్యక్షుడు సుజనరామ్ చౌదరి అధ్యక్షత వహించారు. 14 పట్టిలు, కమ్యూనిటీ పంచుల ప్రతినిధులు హాజరయ్యారు. పెరుగుతున్న మొబైల్ ఫోన్ల వినియోగం, దాని దుష్ప్రభావాలను వివరంగా చర్చించి ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలిపారు. సమాజంలో సోషల్ మీడియాతో తీవ్రంగా నష్టపోతున్నామని వారు ఆందోళన చెందారు.


