కర్నాటకలో సంచలనం సృష్టించిన నవ వివాహిత గానవి, భర్త సూరజ్ ఆత్మహత్యల కేసు రోజుకో మలుపు తిరుగుతోంది.

కర్నాటకలో సంచలనం సృష్టించిన నవ వివాహిత గానవి, భర్త సూరజ్ ఆత్మహత్యల కేసు రోజుకో మలుపు తిరుగుతోంది. భర్త వేధించాడని, అతను సంసారానికి పనికిరాడని, నపుంసకుడని ఆరోపిస్తూ గానవి మెట్టినింటిలో ఆత్మహత్యాయత్నం చేసి రెండురోజుల తరువాత కన్నుమూసింది. ఆమె తల్లిదండ్రులు కేసు పెట్టడంతో సూరజ్, అతని తల్లి జయంతి, అన్న నాగపూర్‌కు పరారయ్యారు, అక్కడ సూరజ్ శనివారం బలవన్మరణానికి పాల్పడ్డాడు. దీంతో వివాహం జరిగిన రెండు నెలల్లోనే వీరి జీవితం విషాదాంతంగా ముగిసింది. అయితే గానవి పెళ్లికి ముందు ఓ యువకున్ని ప్రేమించిందని వార్తలు వచ్చాయి. ఆమె భర్తతో శ్రీలంకకు హనీమూన్ వెళ్లిన సమయంలో ఇద్దరి మధ్య గొడవ జరిగింది. తాను హర్ష అనే యువకున్ని ప్రేమిస్తున్నట్లు భర్తకు చెప్పడమే కారణమని తెలిసింది. అతడినే పెళ్లి చేసుకోవాలని అనుకున్నానని, తల్లిదండ్రుల ఒత్తిడితో ఈ పెళ్లి చేసుకున్నట్లు ఆమె సూరజ్‌కు చెప్పడంతో కుంగిపోయాడు. హనీమూన్‌ని రద్దుచేసుకుని తిరిగి వచ్చినట్లు తెలిసింది. ఈ నేపథ్యంలో సూరజ్ మృతికి గానవి తల్లిదండ్రులు కారణమని అతని బావ రాజ్‌కుమార్ ఇచ్చిన ఫిర్యాదు మేరకు విద్యారణ్యపురం పోలీసులు కేసు నమోదు చేశారు. గానవి తల్లి రుక్మిణి రాధ, బాబుగౌడ, సతీశ్‌లు కారణమని ఫిర్యాదులో పేర్కొన్నారు. తప్పుడు ప్రచారం చేయడం వల్ల సూరజ్ ప్రాణాలు తీసుకున్నాడన్నారు.


