Supreme Court: ఈడీపై సుప్రీంకోర్టు తీవ్ర వ్యాఖ్యలు..!

సుప్రీంకోర్టు ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్‌పై తాజాగా తీవ్ర వ్యాఖ్యలు చేసింది. తమిళనాడు స్టేట్ మార్కెటింగ్ కార్పొరేషన్ (TASMAC) కార్యాలయాలపై ఈడీ దాడుల సందర్భంగా జరిగిన విచారణలో, సుప్రీంకోర్టు ఈ వ్యాఖ్యలు చేసింది. ఈ సందర్భంగా'' ఈడీ అన్ని పరిమితులనూ దాటింది" అని, రాజ్యాంగంలోని సమాఖ్య (ఫెడరల్) స్ఫూర్తిని ఉల్లంఘిస్తోందని ఆగ్రహం వ్యక్తం చేసింది. ఈడీ అధికారులు రాష్ట్ర ప్రభుత్వ సంస్థ అయిన TASMACపై దాడులు చేసిన నేపథ్యంలో తమిళనాడు ప్రభుత్వం సుప్రీంకోర్టును ఆశ్రయించింది. ఈ దాడులను మద్రాస్ హైకోర్టు ఏప్రిల్‌లో నిలుపుదల చేయడానికి నిరాకరించింది, దీంతో రాష్ట్రం సుప్రీంకోర్టుకు వెళ్లింది. చీఫ్ జస్టిస్ గవాయ్ నేతృత్వంలోని బెంచ్ వ్యాఖ్యానిస్తూ "మీరు పూర్తిగా దేశ సమాఖ్య నిర్మాణాన్ని ఉల్లంఘిస్తున్నారు" అని ఈడీని ఉద్దేశించి వ్యాఖ్యానించింది. రాష్ట్రం ఇప్పటికే బహుళ ఎఫ్‌ఐఆర్‌లు నమోదు చేసినప్పుడు ఈడీ జోక్యం ఎందుకు అవసరమని ప్రశ్నించింది. సుప్రీంకోర్టు TASMACపై ఈడీ దర్యాప్తును తాత్కాలికంగా నిలిపివేసింది, ఈడీ చర్యలు రాజ్యాంగ సమాఖ్య సూత్రాలకు విరుద్ధమని పేర్కొంది. గతంలో కూడా సుప్రీంకోర్టు ఈడీని తప్పుబట్టింది ఛత్తీస్‌గఢ్ లిక్కర్ స్కామ్ కేసులో, ఈడీ ఆధారాలు లేకుండా ఆరోపణలు చేస్తోందని, ఒక్క పైసా కూడా స్వాధీనం చేసుకోలేదని కోర్టు విమర్శించింది. అలాగే, PMLA కింద అరెస్టు చేసిన వ్యక్తుల వాంగ్మూలాలను ఆధారాలుగా పరిగణించడం తప్పని 2024 ఆగస్టులో కోర్టు తేల్చింది.
