మధ్యప్రదేశ్‌లోని ఝాబువా జిల్లాలోని మేఘ్‌నగర్ తెహసీల్‌లో బుధవారం తెల్లవారుజామున ఘోర రోడ్డు ప్రమాదం సంభవించింది.

మధ్యప్రదేశ్‌లోని ఝాబువా జిల్లాలోని మేఘ్‌నగర్ తెహసీల్‌లో బుధవారం తెల్లవారుజామున ఘోర రోడ్డు ప్రమాదం సంభవించింది. సిమెంట్‌తో నిండిన ట్రక్ ఒక వ్యాన్‌పై ఒక్కసారిగా బోల్తా పడటంతో ఈ ప్రమాదం జరిగింది. ఈ ఘటనలో 11 మంది ప్రయాణిస్తున్న వ్యాన్‌లో 9 మంది మరణించగా, ఇద్దరు తీవ్రంగా గాయపడ్డారు. మరణించిన వారిలో ముఖేష్ ఖాపెడ్ (40), అతని భార్య సావ్లీ (35), వారి చిన్నారి కుమారుడు, కుమార్తె, మాదీ బామ్నియా (38), విజయ్ బామ్నియా (14), మరో ఇద్దరు చిన్నారులు, అకలీ పర్మార్ (35) ఉన్నారు. ఈ వ్యాన్‌లోని ప్రయాణికులు శివ్‌గఢ్ మహుదా గ్రామానికి చెందినవారు. వివాహ వేడుకకు హాజరై ఇంటికి తిరిగి వస్తుండగా ఈ ప్రమాదం సంభవించింది. ప్రమాదం సంజెలీ రైల్వే క్రాసింగ్ సమీపంలో నిర్మాణంలో ఉన్న రైల్ ఓవర్ బ్రిడ్జ్ వద్ద తాత్కాలిక రోడ్డుపై జరిగింది. ట్రక్ డ్రైవర్ సమతుల్యత కోల్పోవడంతో ట్రక్ వ్యాన్‌పై ఒక్కసారిగా బోల్తా పడిందని ఝాబువా ఎస్పీ పదం విలోచన్ శుక్లా తెలిపారు. గాయపడిన వారిని తండ్లా సివిల్ హాస్పిటల్, మేఘ్‌నగర్ హాస్పిటల్‌కు తరలించారు. ట్రక్ డ్రైవర్ ఘటనా స్థలం నుంచి పరారైనట్లు పోలీసులు తెలిపారు.
