తల్లి పాలు తాగి రొమ్ము గుద్దినట్లు.. తమ స్వార్థం కోసం తల్లిలాంటి దేశానికి ద్రోహం చేస్తున్న వాళ్లు ఎక్కువయిపోయారు. యూట్యూబర్ జ్యోతి మల్హోత్రాతో మొదలుపెడితే..

తల్లి పాలు తాగి రొమ్ము గుద్దినట్లు.. తమ స్వార్థం కోసం తల్లిలాంటి దేశానికి ద్రోహం చేస్తున్న వాళ్లు ఎక్కువయిపోయారు. యూట్యూబర్ జ్యోతి మల్హోత్రాతో మొదలుపెడితే.. ఇప్పటి వరకు పాక్ కోసం పని చేస్తున్నట్లు భావిస్తున్న 11 మంది గూఢాచారులు బయటపడ్డారు. భారత్, పాక్ యుద్ధం తర్వాత పోలీసులు, నిఘా వర్గాలు, ఇతర అధికారుల చేతికి వీరు చిక్కారు. వీరంతా హర్యానా, పంజాబ్, ఉత్తర ప్రదేశ్ రాష్ట్రాలకు చెందిన వారు కావటం గమనార్హం. ఆ 11 మంది గురించిన వివరాల్లోకి వెళితే..
1) జ్యోతి మల్హోత్రా
జ్యోతి మల్హోత్రాది హర్యానాలోని హిసర్. 33 ఏళ్ళ జ్యోతికి సోషల్ మీడియాలో మంచి ఫాలోయింగ్ ఉంది. ట్రావెలింగ్ వీడియోలు చేస్తూ ఉంటుంది. యూట్యూబ్‌లో ట్రావెల్ విత్ జో పేరిట ఛానల్ ఉంది. ఢిల్లీలోని పాకిస్తాన్ హై కమిషన్‌కు చెందిన డానిష్ అనే ఉద్యోగితో ఆమెకు పరిచయం ఏర్పడింది. ఆ పరిచయంతో పాకిస్తాన్ కోసం గూఢాచారిగా పని చేయటం మొదలెట్టింది.
2) దేవేంద్ర సింగ్ దిల్హన్
పంజాబ్‌లోని మస్త్‌ఘర్‌కు చెందిన దేవేంద్ర సింగ్ దిల్హన్ పాటియాల లోని ఖల్స కాలేజీలో ఎమ్‌ఏ ఫస్ట్ ఇయర్ చదువుతున్నాడు. కొన్నేళ్ల క్రితం ఇతడికి పాకిస్తాన్ ఇంటెలిజెన్స్, ఐఎస్ఐలతో పరిచయం అయింది. అప్పటినుంచి భారత్‌కు వ్యతిరేకంగా పని చేస్తున్నాడు. మే 12వ తేదీన తన ఫేస్‌బుక్ ఖాతాలో పిస్టోళ్లు, గన్నుల ఫొటోలు పెట్టి అరెస్ట్ అయ్యాడు. పోలీసుల విచారణలో పాకిస్తాన్ కోసం పని చేసినట్లు ఒప్పుకున్నాడు.
3) తారిఖ్
తారిఖ్‌ది హర్యానాలోని కంగర్కా గ్రామం. పాకిస్తాన్ కోసం గూఢచర్యం చేస్తున్నాడన్న కారణంతో హర్యానా పోలీసులు, కేంద్ర నిఘా వర్గాలు సంయుక్తంగా కలిసి అతడ్ని అదుపులోకి తీసుకున్నాయి.
4) అర్మన్
23 ఏళ్ల అర్మన్ భారత్, పాకిస్తాన్ యుద్ధం సమయంలో భారత దేశానికి సంబంధించిన విషయాలను పాకిస్తాన్‌కు చేరవేశాడు. హర్యానాలోని నోహ్‌లో ఇతడ్ని అరెస్ట్ చేశారు.
5) నౌమన్ ఇల్లహి
24 ఏళ్ల నౌమన్ ఇల్లహిది ఉత్తర ప్రదేశ్‌లోని కైరానా. నౌమన్ హర్యానాలో సెక్యూరిటీ గార్డుగా పని చేస్తున్నాడు. ఇతడు పాకిస్తాన్ ఐఎస్ఐతో సంబంధం పెట్టుకున్నాడు. పాకిస్తాన్‌కు సమాచారం అందించిన ప్రతీసారి డబ్బులు వచ్చేవి. అవి అతడి బావ మరిది అకౌంట్‌లో పడేవి.
6) షహజాద్
ఉత్తర ప్రదేశ్‌లోని మొరాదాబాద్‌కు చెందిన షహజాద్ పాకిస్తాన్, భారత్ సరిహద్దు ప్రాంతాల్లో వస్తువుల్ని అక్రమ రావాణా చేస్తుంటాడు. పాకిస్తాన్ ఇంటెలిజెన్స్ ఏజెన్సీతో సంబంధం పెట్టుకున్నాడు. నిన్న కూడా దేశానికి సంబంధించిన సమాచారాన్ని పాకిస్తాన్‌కు చేరవేశాడు. దీంతో ఉత్తర ప్రదేశ్ యాంటీ టెర్రరిజం స్క్వాడ్ అతడ్ని అరెస్ట్ చేసింది.
7) మహ్మద్ ముర్తాజా అలీ
మహ్మద్ ముర్తాజా అలీ పాకిస్తాన్‌కు చెందిన ఐఎస్ఐతో కలిసి పని చేస్తున్నాడు. పాకిస్తాన్ కోసం పని చేయటం కోసం ఏకంగా ఓ మొబైల్ యాప్‌ను తయారు చేశాడు. గుజరాత్ పోలీసులు ఇతడ్ని అరెస్ట్ చేశారు.
8) గజాలా
పంజాబ్‌కు చెందిన ఈమె పాకిస్తాన్‌కు డబ్బులు చేరవేస్తూ ఉండేది. ఈమెది పంజాబ్‌లోని మలెర్‌కోట్ల.
9) యామిన్ మహ్మద్
పాకిస్తాన్ ఇతడ్ని విభిన్నమైన పనులు చేయడానికి ఎంపిక చేసుకుంది. ఈ విషయం తెలుసుకున్న పంజాబ్ పోలీసులు తాజాగా అరెస్ట్ చేశారు.
10) సుఖ్‌ప్రీత్ సింగ్
పంజాబ్లోని గుర్‌దాస్‌పూర్‌కు చెందిన సుఖ్‌ప్రీత్ సింగ్‌ను పాకిస్తాన్ కోసం గూఢాచారిగా పని చేస్తున్నట్లు గుర్తించారు. పంజాబ్ పోలీసులు ఇతడ్ని అరెస్ట్ చేశారు.
11) కరన్‌బీర్ సింగ్
పంజాబ్‌కు చెందిన కరన్‌బీర్ సింగ్‌కు నేరుగా ఐఎస్ఐతోటే సంబంధాలు ఉన్నాయి. ఇతడు భారత ఆర్మీకి చెందిన కీలక సమాచారాన్ని ఐఎస్ఐకి చేరవేసినట్లు తేలింది. పంజాబ్ పోలీసులు గుర్‌దాసపూర్‌లో ఇతడ్ని అరెస్ట్ చేశారు.
