పానీపూరి (గప్‌చుప్)ని చిన్నాపెద్ద అనే తేడా లేకుండా అందరూ ఇష్టంగా తింటారు.

పానీపూరి (గప్‌చుప్)ని చిన్నాపెద్ద అనే తేడా లేకుండా అందరూ ఇష్టంగా తింటారు. పానీపూరి వాసన తగిలిందంటే అందరి నోట్లో ఉవ్విళ్లు ఊరుతాయి. పానీపూరి తిన్న తర్వాత పానీ తాగడం, స్వీట్ పానీపూరి తినడం అస్సలు మర్చిపోరు. ప్లేట్ పానీపూరి అడిగిన ఓ మహిళకు పానీపూరి అమ్మే వ్యక్తి కేవలం నాలుగు పానీపూరిలు ఇచ్చాడని చిన్న పిల్ల ఏడ్చినట్లు గుక్క పెట్టి మరీ ఏడ్చింది. అంతేకాదు రోడ్డుకు అడ్డంగా కూర్చొని ట్రాఫిక్‌ను స్తంభింపజేసింది. గుజరాత్ రాష్ట్రం వడోదరలోని ఓ మహిళకు పానీపూరి తినేందుకు రోడ్డుపైకి వచ్చింది. పానీపూరి అమ్మే వ్యక్తికి రూ.20 ఇచ్చి ప్లేట్ పానీపూరి అడిగింది. కానీ అతడు ఆమెకు ఆరుకు బదులుగా కేవలం నాలుగు పానీపూరిలే ఇచ్చాడు. దాంతో ఆమె ఇంకో రెండు పానీపూరిలు ఇవ్వాలని పట్టుబట్టింది. కానీ.. అతడు ధరలు పెరిగాయని, కాబట్టి నాలుగే వస్తాయని చెప్పాడు. దాంతో ఆ మహిళ తట్టుకోలేకపోయింది. దుఃఖం తట్టుకోలేక చిన్నపిల్లలా ఏడుస్తూ రోడ్డుకు అడ్డంగా కూర్చుంది. దాంతో భారీగా ట్రాఫిక్ జామ్ అయ్యింది. ఘటనా స్థలానికి చేరుకున్న ట్రాఫిక్ పోలీసులు కారణం తెలుసుకుని ఆశ్చర్యపోయారు. స్థానికులతో కలిసి ఆమెకు సర్దిచెప్పి అక్కడి నుంచి పంపించారు. పానీపూరిల కోసం ఓ మహిళ ట్రాఫిక్‌కు అంతరాయం కలిగించిందని తెలుసుకుని వాహనదారులు ఆమెపట్ల అసహనం వ్యక్తంచేశారు. మహిళ ఏడుపు, నిరసన సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి.
