ముగ్గుల పండుగ సంక్రాంతి వచ్చేసింది. ఈ సందర్భంగా వాకిట్లో అందమైన, పెద్దపెద్ద ముగ్గులు వేసి, వాటిని గొబ్బెమ్మలు, పూలతో అలంకరించడం మన ఆచారం.

అయితే పట్టణాల్లో పెద్ద ముగ్గులు వేసి గొబ్బెమ్మలు పెట్టుకొనే స్థలం, తీరికా రెండూ ఉండట్లేదు. దానికి పరిష్కారంగా వచ్చాయి ఈ రెడీమేడ్ ముగ్గులు.
పెద్దసైజు పళ్లెంలా ఉండే వీటిల్లో రంగోలి డిజైన్లో ముగ్గుపొడి వేసే ఖాళీలు ఉంటాయి. మనకు నచ్చిన రంగుల్ని ఎంచుకుని ఆ ఖాళీల్లో నింపామంటే చక్కటి ముగ్గు రెడీ అయిపోతుంది.
కావాలంటే దీంట్లో పూరేకులు, రంగుల బియ్యం నింపుకోవచ్చు. సమయం ఉన్నప్పుడు నిదానంగా ముందే రంగుల్ని నింపి అవసరమైనప్పుడు దీన్ని వాకిట్లో పెట్టుకోవచ్చు.
అంతేకాదు, కాసేపు దేవుడి ముందు ఉంచిన ఈ రంగోలిని మరికాసేపటికి మనకు నచ్చిన చోటుకూ పట్టుకెళ్లొచ్చు. ఉపయోగించిన తర్వాత వీటిని కడిగి దాచుకోవచ్చు కూడా.
ఇవి కావాలంటే ఆన్లైన్లో డెకోడెస్క్ ఐలాండ్ రంగోలి అని వెతికితే చాలు బోలెడు ఆప్షన్లు వస్తాయి. వాటిలో నచ్చిన వాటిని ఎంచుకొని ఇంటికి తెచ్చేసుకోండి.