World Cup 2023 : హంగామా లేదు, హడావుడి లేదు..క్రెడిట్ తీసుకోవడానికి ఏ నేతా రాలేదు!
వన్డే వరల్డ్‌కప్(World Cup 2023) ఫైనల్లో టీమిండియా(Team India)ను ఆరు వికెట్ల తేడాతో ఓడించి కప్‌ను గెల్చుకున్న ఆస్ట్రేలియా జట్టు మంగళవారం స్వదేశానికి చేరుకుంది. ఆరోసారి ప్రపంచకప్‌ను గెల్చుకుని సొంత దేశానికి అడుగుపెట్టిన క్రికెట్ వీరులకు ఎయిర్‌పోర్టులో మామూలు స్వాగతమే లభించింది. హంగు ఆర్భాటాలు అసలు లేవు. ఎప్పటిలాగే తమ ఇళ్లకు వెళ్లిపోయారు.

World Cup 2023
వన్డే వరల్డ్‌కప్(World Cup 2023) ఫైనల్లో టీమిండియా(Team India)ను ఆరు వికెట్ల తేడాతో ఓడించి కప్‌ను గెల్చుకున్న ఆస్ట్రేలియా జట్టు మంగళవారం స్వదేశానికి చేరుకుంది. ఆరోసారి ప్రపంచకప్‌ను గెల్చుకుని సొంత దేశానికి అడుగుపెట్టిన క్రికెట్ వీరులకు ఎయిర్‌పోర్టులో మామూలు స్వాగతమే లభించింది. హంగు ఆర్భాటాలు అసలు లేవు. ఎప్పటిలాగే తమ ఇళ్లకు వెళ్లిపోయారు. ఎయిర్‌పోర్టులో కూడా ఆస్ట్రేలియా ఆటగాళ్లు సాధారణ ప్రయాణికులులాగా తమ లగేజ్‌ను తామే మోసుకెళ్లారు. తామేదో గొప్ప ఫీట్‌ను సాధించామనే ఫీలింగ్ వారిలో అసలు కనిపించలేదు. అదే మన దగ్గర అయితే ఎలా ఉండేదో ఊహించుకోండి. బ్రహ్మండమైన వెల్కమ్ దక్కేది. ఎయిర్‌పోర్టులోనే సన్మానాలు, సత్కారాలు జరిగేవి. అరుపులు, కేకలతో ఎయిర్‌పోర్టు దద్దరిల్లేది. మీడియా అయితే నానా హైరానా పడేది. అసలు ఇలాంటి వాతావరణమేదీ అక్కడ కనిపించలేదు. ఎలాంటి డ్రామా జరగలేదు. చాలా తక్కువ మంది ఫోటోగ్రాఫర్లు ఉన్నారంతే. అన్నట్టు క్రీడాకారులు సాధించినదానికి క్రెడిట్ తీసుకోవడానికి ఏ రాజకీయనాయకుడు రాలేదు. వ్యక్తి పూజ లేనేలేదు. ఎయిర్‌పోర్టు నుంచి ఆసీస్ కెప్టెన్ పాట్ కమిన్స్ బయటకు వెళుతున్న వీడియో సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది. చాలా మంది ఆస్ట్రేలియా సింప్లిటీని మెచ్చుకుంటున్నారు.
