ఇంతకీ ఐసీసీ ఛాంపియన్స్‌ ట్రోఫీ(ICC Champions trophy) జరుగుతుందా?

ఇంతకీ ఐసీసీ ఛాంపియన్స్‌ ట్రోఫీ(ICC Champions trophy) జరుగుతుందా? టోర్నమెంట్‌కు ఆతిథ్యమిస్తున్న పాకిస్తాన్‌(Pakistan) ఓ మెట్టు దిగుతుందా? లేక అదే పట్టుదలతో ఉంటుందా? లేదూ ఛాంపియన్స్ ట్రోఫీ నిర్వహణ బాధ్యతలను దక్షిణాఫ్రికాకు(South africa) అప్పగిస్తారా? ఇదే ఇప్పుడు క్రికెట్ అభిమానుల మదిలో మెదులుతున్న సందేహాలు. సెక్యూరిటీ కారణంగా తాము పాకిస్తాన్‌కు వెళ్లలేమని, హైబ్రిడ్‌ మోడల్‌(Hybrid Model) అయితేనే ఆడతామని బీసీసీఐ(BCCI) ఇది వరకే చెప్పింది. పాకిస్తాన్‌ మాత్రం హైబ్రిడ్‌ మోడల్‌కు అంగీకరించడం లేదు. భారత జట్టు పాకిస్తాన్‌కు రావాల్సిందేనని అంటోంది. ఇవాళ జరగాల్సి ఉన్న ఐసీసీ వర్చువల్‌ సమావేశానికి కొద్దిగంటల ముందు కూడా పాకిస్తాన్‌ క్రికెట్ బోర్డు(PCB) అదే పట్టుదలను ప్రదర్శిస్తూ.హైబ్రిడ్‌ మోడల్‌ను అంగీకరించే ప్రసక్తే లేదని తేల్చి చెప్పేసింది. దీనిపై తాము ఇది వరకే ఐసీసీకి తమ నిర్ణయాన్ని స్పష్టం చేశామని అని బోర్డు ప్రతినిధి ఒకరు చెప్పారు. ఈ నేపథ్యంలో అసలు ఈ టోర్నీ పాకిస్థాన్‌లో ఉంటుందా? మరో దేశానికి తరలిపోతుందా? అలా చేస్తే పాక్‌ పరిస్థితి ఏమిటి? భారత్‌ కోరుకున్నట్టుగా హైబ్రిడ్‌ మోడల్‌ సాధ్యమవుతుందా? అన్న అంశాలపై ఆసక్తి నెలకొంది. పాకిస్తాన్‌కు వెళ్లబోమని చెప్పినప్పటికీ టీమ్‌ఇండియా తమ దేశానికి రావాల్సిందేనని పీసీబీ అంటోంది.. తాము ఇండియాకు వెళ్లి ఆడంగా లేదని ఇండియా వస్తే తప్పేమిటన్నది పాక్‌ వాదన. అయితే పాకిస్తాన్‌ క్రికెట్ బోర్డుకు గత వారం రోజులుగా ఇస్లామాబాద్‌లో జరుగుతున్న ఆందోళనలు, నిరసనలు తలనొప్పిగా మారాయి. మాజీ ప్రధానమంత్రి ఇమ్రాన్‌ఖాన్‌ను(PM Imran Khan) జైలు నుంచి విడుదల చేయాలని డిమాండ్‌ చేస్తూ పీటీఐ ఆందోళనలు చేస్తున్నది. ఆ ఆందోళన హింసాత్మకంగా మారడంతో ఆరుగురు భద్రతా సిబ్బంది మరణించారు. వందలాది మంది గాయపడ్డారు. దీంతో పాకిస్తాన్‌ ప్రభుత్వం ఇస్లామాబాద్‌ను అష్టదిగ్బంధం చేసింది. ఆందోళనకారులు హింసాత్మక ఘటనలకు పాల్పడితే కాల్చి చంపాలని ఆదేశాలు జారీ చేసింది. ఇదిలా ఉండగా ప్రస్తుతం పాకిస్తాన్‌ పర్యటనలో ఉన్న శ్రీలంక – ఏ జట్టు ఈ అల్లర్ల నేపథ్యంలో తమ ఆటగాళ్లను వెనక్కి పిలిచింది. ఇది పీసీబీకి గట్టి ఎదురుదెబ్బే. ఇదే కారణాన్ని చూపుతూ మరికొన్ని దేశాల బోర్డులు తమ ఆటగాళ్లను పాక్‌కు పంపడానికి ఒకటికి రెండుసార్లు ఆలోచిస్తున్నాయి. ఈ కారణంగా అసలు పాకిస్తాన్‌లో ఛాంపియన్స్‌ ట్రోఫీ ఉంటుందా? అనేది సందేహంగా మారింది. . ఒకవేళ టోర్నీ మొత్తం రద్దు చేయాలని భావిస్తే తాము చాంపియన్స్‌ ట్రోఫీని ఎక్కడ నిర్వహించినా పాల్గొనేది లేదని పీసీబీ ఇప్పటికే బెదిరింపులకు దిగింది. ఛాంపియన్స్‌ ట్రోఫీ ఆడేందుకు టీమిండియా తమ దేశానికి రాకుంటే ఇకపై తాము కూడా ఆ దేశంలో జరిగే ఐసీసీ ఈవెంట్లకు వెళ్లమని పీసీబీ చీఫ్‌ మోహ్సిన్‌ నఖ్వీ తెలిపాడు. . భారత్‌లో జరిగే ఐసీసీ టోర్నీలు ఆడేందుకు తాము వెళుతున్నామని, కానీ వాళ్లు ఇక్కడకు రాకపోవడం ఆమోదయోగ్యం కాదని ఆయన అన్నారు.

Updated On
Eha Tv

Eha Tv

Next Story