సెప్టెంబర్ 7న (రేపు) ఆకాశంలో ఒక అద్భుతమైన ఖగోళ ఘట్టం ఆవిష్కరణ కానుంది.

సెప్టెంబర్ 7న (రేపు) ఆకాశంలో ఒక అద్భుతమైన ఖగోళ ఘట్టం ఆవిష్కరణ కానుంది. చంద్రుడు ఎరుపు రంగులో కనిపించనున్నాడు. ఇది చంద్రగ్రహణం కారణంగా జరుగుతుంది. ఈ సంఘటనను ఆసియా, ఆస్ట్రేలియా, ఆఫ్రికా, ఐరోపా వంటి ఖండాల్లోని ప్రజలు స్పష్టంగా వీక్షించగలరు. భారతదేశంలో కూడా ప్రజలు ఈ దృశ్యాన్ని ఆస్వాదించే అవకాశం ఉంది.
హైదరాబాద్, ఢిల్లీ, ముంబై, కోల్‌కతా, పూణే, లక్నో, చండీగఢ్ వంటి ప్రధాన నగరాల్లో ఆకాశం నిర్మలంగా ఉంటే చంద్రగ్రహణాన్ని స్పష్టంగా చూడవచ్చు. ఈసారి చంద్రగ్రహణం ఎక్కువ సమయం పాటు కనిపించనుండటం మరో ప్రత్యేకత. గత కొన్ని సంవత్సరాల్లో ఇంత ఎక్కువ సమయం వరకు కనిపించే చంద్రగ్రహణం ఇదే అవుతుందని శాస్త్రవేత్తలు చెప్తున్నారు. చంద్రగ్రహణం అనేది భూమి సూర్యుడి మరియు చంద్రుడు మధ్యలో వచ్చినప్పుడు సంభవిస్తుంది. ఈ సమయంలో భూమి నీడ చంద్రుడిపై పడుతుంది. ఫలితంగా చంద్రుడు తన సహజ కాంతిని కోల్పోతాడు. కానీ ఈ క్రమంలో ఒక ప్రత్యేకమైన ప్రక్రియ జరుగుతుంది.
సూర్యుని కాంతి భూమి వాతావరణం గుండా ప్రయాణించే సమయంలో నీలి కాంతి భాగం వాతావరణంలో శోషించబడుతుంది. దాంతో చంద్రుడి పైకి ఎరుపు, నారింజ రంగుల కాంతి మాత్రమే చేరుతుంది. అందువల్ల చంద్రుడు ప్రకాశవంతమైన ఎరుపు రంగులో కనిపిస్తాడు. దీనిని "బ్లడ్ మూన్" అని కూడా అంటారు. ఈ అరుదైన దృశ్యాన్ని చూడటానికి ఖగోళ శాస్త్ర ప్రియులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. వాతావరణం అనుకూలంగా ఉంటే, ఈ సంఘటన ప్రజలకు మరపురాని అనుభూతిని ఇస్తుంది. చంద్రుడు ఎరుపు వర్ణంతో ప్రకాశించే ఈ దృశ్యం ప్రకృతిలో ఒక అద్భుతమని వర్ణిస్తున్నారు.
