పిల్లలతో సహా ఆత్మహత్య చేసుకోవాలని కారును చెరువులో దూకించాడు

హైదరాబాద్‌లో(Hyderabad) తృటిలో ముగ్గురు పిల్లలు, తండ్రి(Father) ప్రాణాపాయాల నుంచి బయటపడ్డారు. హయత్‌ నగర్‌(hayathnagar) సమీపంలోని ఇమామ్‌గూడా చెరువులోకి ఓ కారు దూసుకెళ్లింది. కారు నీట మునగడం గుర్తించిన స్థానికులు అప్రమత్తమై ప్రాణాలకు తెగించి వారిని కాపాడారు. బుధవారం హయత్‌ నగర్‌ ఇమామ్ గూడా చెరువులోకి కారు దూసుకెళ్లడాన్ని స్థానికులు గుర్తించారు. అందులో ఉన్న నలుగురు నీట మునిగిపోవడం గుర్తించిన స్థానికులు వెంటనే స్పందించారు. అందుబాటులో ఉన్న ట్యూబులు, తాళ్ల సాయంతో చెరువులోకి వెళ్లారు. కారులో ఉన్న డ్రైవర్‌తో పాటు ముగ్గురు చిన్నారులను స్థానికులు కాపాడారు. ఈ ఘటనలో డ్రైవర్‌తో పాటు పదేళ్లలోపు వయసున్న ముగ్గురు చిన్నారులు ఉన్నారు. ఒక బాలుడు, ఇద్దరు బాలికల్ని ప్రాణాలతో కాపాడారు.

క్షతగాత్రులను కాపాడిన తర్వాత అసలు విషయం తెలిసి కంగుతిన్నారు. ఆత్మహత్య చేసుకోడానికి చెరువులోకి కారును పోనిచ్చినట్టు తెలిసి అవాక్కయ్యారు.భార్యతో ఉన్న విభేదాల కారణంగానే ఆత్మహత్యకు ప్రయత్నించినట్లు వ్యక్తి తెలిపారు. పదేళ్లలోపు వయసు ఉన్న ముగ్గురు పిల్లల్ని చంపి తాను చనిపోవాలని భావించిన వ్యక్తి కారుతో సహా చెరువులోకి నడిపినట్టు తెలుసుకున్నారు. భార్య తన మాట వినడం లేదనే కోపంతో ఆఘాయిత్యానికి పాల్పడినట్టు వాపోయాడు. దీంతో స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు. తండ్రి వెంట కారులో వచ్చిన చిన్నారులు ప్రాణభయంతో కొంతసేపు విలవిలలాడారు. స్థానికులు వేగంగా స్పందించడంతో ప్రాణాలు నిలిచాయి. దీంతో అప్రమత్తమై కాపాడేందుకు ముందుకొచ్చిన వారిని పోలీసులు ప్రశంసిస్తున్నారు. ఆత్మహత్యాయత్నానికి ప్రయత్నించిన వ్యక్తిని పోలీసులు ప్రశ్నిస్తున్నారు.

Eha Tv

Eha Tv

Next Story