విషాద యాత్రగా మారిన విహార యాత్ర.. తుంగభద్రలో పడి వైద్యురాలు గల్లంతు
స్నేహితులతో విహార యాత్రకు వెళ్లి నదిలో కొట్టుకుపోయిన హైదరాబాద్‌కు చెందిన మహిళా డాక్టర్ అనన్య రావు. కర్ణాటక - కొప్పల్ జిల్లాలోని తుంగభద్ర నదిలో ఈత కొట్టడానికి దూకి, ప్రవాహంలో కొట్టుకుపోయిన డాక్టర్ అనన్య రావు. అనన్య రావు కోసం గాలింపు చర్యలు చేపట్టిన పోలీసులు, అగ్నిమాపక సిబ్బంది. వివరాల్లోకి వెళ్తే.. సరదాగా విహారయాత్రకు వచ్చిన యువ వైద్యురాలు తుంగభద్ర నదిలో గల్లంతయింది. ఈ సంఘటన బుధవారం కర్ణాటకలోని హంపీ వద్ద చోటుచేసుకుంది. డాక్టర్ అనన్యరావు (27), స్నేహితుడు సాత్విన్, హషితలతో కలిసి హంపీ టూర్‌కి వచ్చారు. నది ఒడ్డున సణాపురలో ఓ రిసార్టులో మకాం వేశారు. బుధవారం మధ్యాహ్నం నదిలో ఈత కొట్టడానికి వచ్చారు. సుమారు 25 అడుగుల ఎత్తు గల బండరాయి నుంచి అనన్యరావు దూకి ఈత కొట్టాలనుకుంది. నదికి మరోవైపు నుంచి స్నేహితులు సరదాగా వీడియో తీస్తున్నారు. అంతెత్తు నుంచి దూకిన అనన్య కొన్ని క్షణాల పాటు ఈత కొట్టి నీటి ఉధృతికి నదిలో కొట్టుకుపోసాగింది. స్నేహితులు గట్టిగా కేకలు వేసినా ఫలితం లేదు. నీటి ప్రవాహంలో కనుమరుగైపోయింది. స్నేహితులు పోలీసులకు సమాచారం ఇవ్వడంతో ఫైర్ సిబ్బందితో వచ్చి బండరాళ్ల మధ్య గాలించారు. రాత్రి అయినప్పటికీ అనన్యరావు జాడ కానరాలేదు. ఈ సంఘటన ఫొటోలు, వీడియోలు వైరల్ అయ్యాయి. అనన్యరావు తండ్రి డా.మెహన్‌రావు, ఆమె వీకేసీ ఆస్పత్రిలో వైద్యురాలని తెలిసింది.


