రూరల్‌ ఏరియాలో BRS తన పట్టు కోల్పోలేదని తేలింది. అధికారంలో లేకపోయినా.

రూరల్‌ ఏరియాలో BRS తన పట్టు కోల్పోలేదని తేలింది. అధికారంలో లేకపోయినా.. తొలి విడతలో దాదాపుగా వెయ్యికి పైగా పంచాయతీల్లో తమ పార్టీ మద్దతుదారులు విజయం సాధించేలా చూసుకున్నారు. ఇంకా రెండు విడతల ఎన్నికలు ఉన్నాయి. ఎలా చూసినా.. కనీసం 30 శాతం పంచాయతీల్లో బీఆర్ఎస్ మద్దతుదారులు విజయం సాధిస్తారు. అధికారంలో లేకపోయినా ఈ మాత్రం స్థానాల్లో విజయం సాధించారంటే సాధారణమైన విషయం కాదు. ఆపరేషన్ ఆకర్ష్ నుంచి.. అధికార పార్టీ బలాన్ని తట్టుకుని నిలబడ్డారు. ఇది ఆ పార్టీకి, పార్టీ నాయకత్వానికి నైతిక బలాన్ని ఇస్తుందని చెప్పడంలో అతిశయోక్తి ఉండదు.

పంచాయతీ ఎన్నికల్లో భారత రాష్ట్ర సమితికి అత్యంత కీలకంగా మారాయి. గతంలో జరిగిన పరిణామాలు, పంచాయతీ ఎన్నికలను కాంగ్రెస్ ప్రభుత్వం సీరియస్‌గా తీసుకున్న పరిస్థితుల్ని చూసి, ఏకంగా ముఖ్యమంత్రి నియోజకవర్గాల పర్యటనలు చూసిన తర్వాత, భారత రాష్ట్ర సమితి కనీసం పోటీ అయినా సాధిస్తుందా అన్న అనుమానాలు వచ్చాయి. సీఎం రేవంత్ రెడ్డి కాంగ్రెస్ పార్టీ మద్దతుదారులే కనీసం 90 శాతం పంచాయతీల్లో గెలవాలని దిశానిర్దేశం చేశారు. ఎమ్మెల్యేలు చాలా వరకూ ఆ దిశగానే ప్రయత్నించారు. వీలైనంత వరకూ ఏకగ్రీవాలు చేశారు. ఎన్నికలు జరిగిన గ్రామాల్లో ఎమ్మెల్యే స్థాయి నేతలు కూడా దృష్టి పెట్టి రాజకీయ వ్యూహాలు నడిపారు. కాంగ్రెస్ పార్టీకి ఆ మేరకు మంచి ఫలితాలు వచ్చాయి. కానీ చాలా చోట్ల బీఆర్ఎస్ పార్టీని నిలువరించలేకపోయారు.

2019లో జరిగిన పంచాయతీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీకి బీఆర్ఎస్ పెద్దగా అవకాశం ఇవ్వలేదు. దాదాపుగా ఎనిమిదివేల పంచాయతీల్లో బీఆర్ఎస్ సర్పంచ్‌లు విజయం సాధించారు. కాంగ్రెస్ పార్టీ నేతలు 2,700 పంచాయతీలతో సరి పెట్టుకున్నారు . TDP, వామపక్షాలు, స్వతంత్ర అభ్యర్థులు మొదలైనవారు దాదాపు 1,700 పంచాయీతీల్లో గెలిచారు. ఈ సారి భారత రాష్ట్ర సమితి మూడు విడుతలు ముగిసే సరికి.. గతంలో కాంగ్రెస్ పార్టీ సాధించిన విజయాల కన్నా ఎక్కువగానే సాధించనున్నాయని అనుకోవచ్చు. అధికారంలో లేకుండా.. వరుస ఓటములతో తీవ్ర ఒత్తిడి ఎదుర్కొంటున్న బీఆర్ఎస్‌కు లోకల్ క్యాడర్ కాస్త ఊపిరి పోస్తున్నారని అనుకోవచ్చు.

అసెంబ్లీ ఎన్నికల్లో పరాజయం, లోక్ సభ ఎన్నికల్లో డిపాజిట్లు కోల్పోవడం, రెండు అసెంబ్లీ ఉపఎన్నికలు వస్తే రెండు సిట్టింగులు పోగొట్టుకోవడం వంటి పరిణామాలతో క్యాడర్ గందరగోళంలో ఉంది. ఓ వైపు బీజేపీతో పొత్తు వార్తలు.. విలీనం చర్చలు.. మరో వైపు కవిత తిరుగుబాటు .. క్యాడర్ ను ఇబ్బంది పెడుతున్నాయి. ఇలాంటి సమయంలో గ్రామాల్లో ఆ పార్టీ పరిస్థితి దెబ్బతిని ఉంటే కొత్త సవాళ్లు ఎదురయ్యేవి. అలాంటి పరిస్థితి నుంచి బీఆర్ఎస్ బయటపడిందని అనుకోవచ్చు. కాంగ్రెస్ పార్టీ మెజార్టీ సీట్లు సాధించి ఉండవచ్చు కానీ.. బీఆర్ఎస్ ఇంకా పూర్తిగా నిర్వీర్యం కాలేదని.. బలంగా పుంజుకునే ప్రయత్నంలో ఓ అడుగు ముందుకు వేసిందని ఈ పంచాయతీ ఫలితాలు నిరూపిస్తున్నాయి.

Updated On
ehatv

ehatv

Next Story