రైతు రుణమాఫీ పథకాన్ని షరతులు లేకుండా అమలు చేయాలని కాంగ్రెస్‌ ప్రభుత్వాన్ని డిమాండ్‌ చేస్తూ ఆగస్టు 22న రాష్ట్రవ్యాప్తంగా నిరసనలు, ధర్నాలు నిర్వహించనున్నట్లు బీఆర్‌ఎస్‌ ప్రకటించింది

రైతు రుణమాఫీ పథకాన్ని షరతులు లేకుండా అమలు చేయాలని కాంగ్రెస్‌ ప్రభుత్వాన్ని డిమాండ్‌ చేస్తూ ఆగస్టు 22న రాష్ట్రవ్యాప్తంగా నిరసనలు, ధర్నాలు నిర్వహించనున్నట్లు బీఆర్‌ఎస్‌ ప్రకటించింది. రాష్ట్ర ప్రభుత్వం కేవలం 40% అర్హులైన రైతులకు మాత్రమే రుణమాఫీ చేసిందని బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అన్నారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, ఇతర మంత్రుల పరస్పర విరుద్ధ ప్రకటనలతో రైతుల్లో అయోమయం నెలకొందని అన్నారు.

అర్హులైన వారందరికీ 2 లక్షల వరకు రుణమాఫీ జరిగిందని ముఖ్యమంత్రి పేర్కొంటుండగా.. మాఫీ ప్రక్రియ ఇంకా అసంపూర్తిగానే ఉందని కొందరు మంత్రులు అంటున్నారని కేటీఆర్ పేర్కొన్నారు. రుణమాఫీ అవ‌ని రైతులు స్థానిక కార్యాలయాల్లో తమ సమస్యల పరిష్కారానికి నానా తంటాలు పడుతున్నారని కేటీఆర్ ఉద్ఘాటించారు.

రుణమాఫీ ప్రకటనలపై కాంగ్రెస్ ప్రభుత్వ విశ్వసనీయత ఏంటని మాజీ మంత్రి హరీశ్ రావు ప్రశ్నించారు. 18 వేల కోట్లతో రుణమాఫీని పూర్తి స్థాయిలో అమలు చేశామని ఖమ్మంలో జరిగిన సమావేశంలో ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి పేర్కొనగా.. రుణ‌మాఫీ పూర్తి చేసిన మొత్తం రూ.31,000 కోట్లు అని ఉపముఖ్యమంత్రి భ‌ట్టీ విక్ర‌మార్క‌ తరువాత పేర్కొన్నార‌ని.. మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి రుణమాఫీకి అదనంగా రూ.12,000 కోట్లు విడుదల చేయనున్నట్లు తెలిపార‌ని.. ప్రజలు ఎవరిని నమ్మాలి అని హరీశ్ రావు ప్రశ్నించారు.

Updated On
Sreedhar Rao

Sreedhar Rao

Next Story