ఒక్కోసారి పోలీసుల మందుకు అరుదైన కేసులు ఎదురవుతుంటాయి. ఈ చిన్న ఘటనలకు కూడా కేసు పెడతారా అంటూ పోలీసులే ముక్కున వేలేసుకుంటారు.

ఒక్కోసారి పోలీసుల మందుకు అరుదైన కేసులు ఎదురవుతుంటాయి. ఈ చిన్న ఘటనలకు కూడా కేసు పెడతారా అంటూ పోలీసులే ముక్కున వేలేసుకుంటారు. . రోజురోజుకు పెరుగుతున్న క్రైమ్ రేట్‌తో పోలీసులు సతమతమవుతున్నారు. ముఖ్యంగా దొంగతనాలు, దోపిడీలు, హత్యలు వంటి కేసులతో వాళ్లు బిజీ బిజీగా ఉంటారు. ఈ కేసుల పరిష్కారానికి పోలీసులు నానా తంటాలు పడుతుండగా.. ఇప్పుడు నకిరేకల్ పోలీసుల ముందుకు అటువంటి వింత కేసు వచ్చింది. ఈ కేసును ఎలా పరిష్కరించాలో అర్థం కాక ఖాకీలు తలలు పట్టుకుంటున్నారు. ఏంటా కేసు అనే వివరాల్లోకి వెళ్తే..

నల్లగొండ(Nalgonda) జిల్లా నకిరేకల్ (Nakrekal)మండలం గొల్లగూడెం(Gollagudem)కు చెందిన గంగమ్మ(Gangamma) అనే వృద్ధురాలికి కోడి ఉంది. ఆ కోడి ప్రతిరోజు ఆరు బయటకు వెళ్లి ఏమైనా గింజలు, లేదా ఇతర ఆహారం తిని తిరిగి సాయంత్రం ఇంటికి వస్తుంది. ఈ క్రమంలో గంగమ్మ ఇంటి పక్కనే ఉన్న రాకేష్(Rakesh) ఇంట్లోని గడ్డివాము వద్ద గింజలు తినేది. అయితే తన గడ్డివాములో గంగమ్మ కోడి గింజలు తింటుందని గడ్డివాము యజమాని రాకేష్ కర్రతో కొట్టడంతో కోడి కాళ్లు విరిగిపోయాయి. తన కోడి కాళ్లు విరగొట్టిన రాకేష్‌పై కేసు నమోదు చేయాలంటూ గంగమ్మ బోరున విలపిస్తూ నకిరేకల్ పోలీసులకు ఫిర్యాదు చేసింది. ఇలాంటి గొడవలు సాధారణమే అంటూ కేసులు ఎందుకు..? కోడికి ఎంత రేటో చెప్పు.. రాకేశ్‌‌తో డబ్బులు ఇప్పిస్తామని పోలీసులు చెప్పారు.

తన కళ్ళముందే తన కోడిని కర్రతో కొట్టి కాళ్లు విరగొట్టాడని.. నాకు డబ్బులు వద్దు ఏమి వద్దు రాకేష్‌ను శిక్షించాలని పోలీసులతో వాదించింది. నా కోడికి జరిగినట్లు ఊళ్లో ఏ కోడికి జరగకూడదని ఆ ఊర్లో ఉన్న కోళ్లకు సమన్యాయం జరిగేలా పోలీసులతో పోరాడింది. గంగమ్మకు సర్ది చెప్పేందుకు పోలీసులు ఎంత ప్రయత్నించినా వినలేదు. దీంతో చేసేది ఏమీ లేక నకిరేకల్ పోలీసులు.. గ్రామానికి వచ్చి పంచాయతీని పరిష్కరిస్తామని సర్ది చెప్పారు. ప్రస్తుతానికి ఇంటికి వెళ్లి కోడికి వైద్యం చేయించుకోమని చెప్పి గంగమ్మను పంపించేశారు. ఈ కోడి పంచాయితీనీ ఎలా పరిష్కరించాలో అర్థం కాక పోలీసులు తలలు పట్టుకుంటున్నారు.

ehatv

ehatv

Next Story