హార్వర్డ్‌కు వెళ్లి కూడా ''లాగులో తొండలు'' అంటావా..! రేవంత్‌పై KTR సెటైర్లు..! హరీష్‌రావు సిట్ విచారణపై KTR ఆగ్రహం..!

హరీష్‌రావుకు సిట్ నోటీసులపై మాజీ మంత్రి, బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, కేటీఆర్ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఫోన్ ట్యాపింగ్ కేసు.. ఓ లొట్టపీసు కేసు అంటూ వ్యాఖ్యానించారు. విచారణ, కమీషన్ల పేరుతో మా పార్టీని నేతలను వేధిస్తున్నారని.. రాజకీయ వేధింపుల్లో భాగంగానే ఫోన్ ట్యాపింగ్ కేసులో హరీష్‌రావుకు నోటీసులు అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇది సిట్ విచారణ కాదు.. చిట్టి విచారణ అన్ని అని ఆయన ఎద్దేవా చేశారు.
ఇలాంటి సిట్‌లను, చిట్‌లను వెయ్యి అయినా ఎదుర్కొంటామన్నారు. మీరు ఎన్ని విచారణలైనా చేసుకోండి.. మేం భయపడం. ఈ లొట్టపీసు కేసులో కేసీఆర్‌కు కూడా నోటీసులు ఇస్తారంట.. ఇచ్చుకోండని కేటీఆర్ వ్యాఖ్యానించారు. ‘‘ఫోన్ ట్యాపింగ్ కేసును హైకోర్టు, సుప్రీంకోర్టులు కొట్టేశాయి. అయినా విచారణలు చేయిస్తున్నారు. సింగరేణిలో స్కామ్‌ను హరీష్‌రావు బయటపెట్టడంతో రాత్రి 9 గంటలకు నోటీసులు ఇచ్చి తెల్లారి 11 గంటలకు రావాలన్నారు. సింగరేణిలో రేవంత్ బావమరిదిని కింగ్‌పిన్ చేసి ఆయన రింగ్ తిప్పేలా చేశారు’’ అని కేటీఆర్ ఆరోపించారు.
‘‘కాంగ్రెస్ అధికారంలోకి రాగానే సింగరేణి దోపిడీ మొదలైంది. సింగరేణి టెండర్లపై హరీష్ చేసిన కామెంట్స్‌పై ప్రభుత్వం ఎందుకు స్పందించదు. బీఆర్‌ఎస్ హయాంలో సింగరేణిలో రాజకీయ జోక్యం లేదు. నైని కోల్ బ్లాక్ రద్దు వెనుక వాటాల పంచాయితీ ఉంది. మా హయాంలో మైనస్‌లో వచ్చిన టెండర్లు, మీ హయాంలో ఎందుకు ప్లస్‌కు వెళ్తున్నాయని కేటీఆర్ ప్రశ్నించారు. ఎంతసేపూ డైవర్షన్ రాజకీయం తప్ప ఏదీ లేదన్నారు. ఒక చానెల్‌లో ఓ కథనం వచ్చిందని సిట్ వేశావు , మరి ఇంకో చానెల్‌లో ఇంత కంటే దారుణంగా కథనం వస్తే ఎందుకు సిట్ వేయలేదన్నారు. ఇద్దరు బీసీ బిడ్డలు, ఒక ఎస్సీ బిడ్డను అరెస్ట్ చేశావు కానీ యాజమాన్యాల జోలికి వెళ్లవా అంటూ ప్రశ్నించారు.
హార్వర్డ్ యూనివర్సిటీకి వెళ్తున్నావు.. అక్కడికెళ్లి ఏం మాట్లాడుతావు.. వాళ్లు ఏం చేప్తారు.. నీకు ఏం అర్థమవుతుంది.. మళ్లీ నీవు ఏం సమాధానం చెప్తావ్.. ఇంగ్లీష్ మాట్లాడేవారిని తిడతావు, అక్కడికెళ్లి కూడా బాత్‌రూంల గురించి మాట్లాడుతావా, లాగుల తొండల గురించి మాట్లాడుతావా అని కేటీఆర్ ప్రశ్నించారు.


