తెలంగాణ రాజకీయాలు ఆసక్తికరంగా మారాయి. అన్ని పార్టీల్లో విభేదాలు తారా స్థాయికి చేరాయనే చెప్పాలి.

తెలంగాణ రాజకీయాలు ఆసక్తికరంగా మారాయి. అన్ని పార్టీల్లో విభేదాలు తారా స్థాయికి చేరాయనే చెప్పాలి. రాష్ట్రం ఏర్పడిన 2014 నుంచి ఇక్కడి రాజకీయాల్లో అనేక మలుపులు, విభేదాలు కనిపిస్తాయి. ప్రధాన పార్టీలైన భారత రాష్ట్ర సమితి, భారతీయ జనతా పార్టీ, కాంగ్రెస్‌లలో నాయకుల మధ్య అంతర్గత పోటీలు, విభేదాలు రాజకీయ వ్యూహాలను ప్రభావితం చేస్తున్నాయి.

భారతీయ జనతా పార్టీ తెలంగాణలో బండి సంజయ్‌, ఈటల రాజేందర్‌ మధ్య విభేదాలు 2023లో బహిర్గతమయ్యాయి. బండి సంజయ్‌, ఆర్‌ఎస్‌ఎస్‌ నేపథ్యం నుంచి వచ్చిన నాయకుడు, హిందుత్వ ఎజెండాతో పార్టీని బలోపేతం చేయడంలో కీలక పాత్ర పోషించాడు. అతని నాయకత్వంలో దుబ్బాక, హుజురాబాద్ ఉప ఎన్నికల్లో BJP విజయాలు సాధించింది. అయితే, ఈటల రాజేందర్‌ BRS నుంచి 2021లో BJPలో చేరిన సీనియర్ నాయకుడు, తనకు పార్టీలో తగిన ప్రాధాన్యత లభించడం లేదని భావించాడు. బండి సంజయ్‌ మున్నూరు కాపు సామాజిక వర్గానికి చెందినవాడు కాగా, ఈటల ముదిరాజ్‌ సామాజిక వర్గానికి ప్రాతినిధ్యం వహిస్తాడు. ఈ రెండు కులాల మధ్య పోటీ ఈ విభేదాలకు ఒక కారణమని భావిస్తున్నారు. ఈటల రాజేందర్‌, తన సీనియారిటీ, రాజకీయ అనుభవాన్ని బట్టి తెలంగాణ BJP అధ్యక్ష పదవి తనకు ఇవ్వాలని ఆశించాడు. అయితే, బండి సంజయ్‌ హిందుత్వ ఎజెండాతో పార్టీని ఆకర్షణీయంగా మలిచినందున, అతన్ని తొలగించడం పార్టీకి రిస్క్‌గా భావించారు. 2023 కర్ణాటక ఎన్నికల్లో BJP ఓటమి తర్వాత, తెలంగాణలో పార్టీ వ్యూహాలను మార్చాలని ఈటల వంటి నాయకులు ఒత్తిడి తెచ్చారు. ఈ సమయంలో బండి సంజయ్‌ను అధ్యక్ష పదవి నుంచి తొలగించి, కిషన్‌ రెడ్డిని నియమించారు, ఇది విభేదాలను మరింత తీవ్రతరం చేసింది.

ఈ విభేదాలు BJPలో ఐక్యతను దెబ్బతీశాయి. ఈటలను ఎన్నికల నిర్వహణ కమిటీ చైర్మన్‌గా నియమించడం ద్వారా పార్టీ అధిష్ఠానం విభేదాలను ముగించేందుకు చేయడానికి ప్రయత్నించినప్పటికీ, అంతర్గత కుల రాజకీయాలు, నాయకత్వ సమస్యలు పార్టీ బలాన్ని దెబ్బతీశాయి. 2023 అసెంబ్లీ ఎన్నికల్లో BJP కేవలం 8 సీట్లు గెలుచుకుంది, ఊహించిన స్థాయిలో రాణించలేకపోయింది. ఈ మధ్యనే కొత్త అధ్యక్షుడిగా రాంచందర్‌రావును నియమించడంతో అటు ఈటల రాజేందర్‌కు ఆశలు ఇక సన్నగిల్లాయి. మరోవైపు బండిసంజయ్‌ ఈ మధ్యనే తీవ్ర వ్యాఖ్యలు చేశారు. హుజూరాబాద్‌లో తనకు మెజార్టీ తగ్గించేందుకు కొందరు ప్రయత్నించారని, దీనికి పరోక్షంగా ఈటలనే కారణమని, అలాంటి వారికి స్థానిక సంస్థల ఎన్నికల్లో టికెట్లు ఎలా ఇస్తామన్నట్లు వ్యవహరించారు. మరోవైపు రాంచందర్‌రావు అభ్యర్థిత్వాన్ని వ్యతిరేకిస్తూ పార్టీకి రాజాసింగ్‌ రాజీనామా చేశారు.

తెలంగాణ కాంగ్రెస్‌లో రేవంత్‌ రెడ్డి, కోమటిరెడ్డి రాజగోపాల్‌ రెడ్డి, కోమటిరెడ్డి వెంకట్‌ రెడ్డి మధ్య విభేదాలు రాష్ట్ర రాజకీయాల్లో ముఖ్యమైన అంశంగా మారాయి. రేవంత్‌ రెడ్డి, 2019లో తెలంగాణ కాంగ్రెస్ అధ్యక్షుడిగా నియమితుడైన తర్వాత, అతని నాయకత్వ శైలి కొందరు సీనియర్ నాయకులకు అసంతృప్తిని కలిగించింది. 50 కోట్లు ఇచ్చి పీసీసీ అధ్యక్ష పదవిని కొనుకున్నారని కోమటిరెడ్డి వెంకటరెడ్డి వ్యాఖ్యలు కూడా చేశారు. తాను ఇక గాంధీభవన్‌ మెట్లు ఎక్కబోననని ప్రకటించారు. కోమటిరెడ్డి రాజగోపాల్‌ రెడ్డి, రేవంత్‌ రెడ్డి నాయకత్వంతో విభేదించి 2022లో కాంగ్రెస్‌ను వీడి BJPలో చేరాడు. రేవంత్‌ గతంలో కాంగ్రెస్ నాయకులను విమర్శించిన విషయాన్ని కారణంగా చెప్పాడు. మునుగోడు ఉప ఎన్నికల్లో BJP తరపున పోటీ చేసి ఓడిపోయాడు. కోమటిరెడ్డి వెంకట్‌ రెడ్డి, రాజగోపాల్‌ సోదరుడు, కాంగ్రెస్‌లోనే ఉన్నప్పటికీ రేవంత్‌ నాయకత్వంపై అసంతృప్తితో ఉన్నాడు. మునుగోడు ఉప ఎన్నికల సమయంలో వెంకట్‌ రెడ్డి తన సోదరుడికి మద్దతు ఇచ్చినట్లు ఆరోపణలు వచ్చాయి, ఇది కాంగ్రెస్‌లో అంతర్గత సంక్షోభాన్ని సృష్టించింది. 2023లో తిరిగి కాంగ్రెస్‌లో చేరాడు. ఆ సమయంలో అతనికి మంత్రి పదవి ఆఫర్‌ చేశారని చెప్తారు. అయితే ప్రభుత్వం ఏర్పడి ఏడాదిన్నర గడుస్తున్నా కానీ, మంత్రివర్గ విస్తరణలో తనకు అవకాశం రాలేదని నిరాశలో కొమటిరెడ్డి ఉన్నాడు. అంతేకాదు ముఖ్యమంత్రి తుంగతుర్తి సభ పెట్టినప్పుడు ఉమ్మడి జిల్లా నేతలంతా హాజరైనా కోమటిరెడ్డి హాజరుకాలేదు.

తాజాగా ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి చేసిన వ్యాఖ్యలు కోమటిరెడ్డికి ఆగ్రహం తెప్పించాయి. ముఖ్యమంత్రి రేవంత్‌ వ్యాఖ్యలకు కాంగ్రెస్‌ ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్‌ రెడ్డి కౌంటర్‌ ఇచ్చారు. రాబోయే పదేళ్లు నేనే ముఖ్యమంత్రి అని రేవంత్ రెడ్డి ప్రకటించుకోవడం కాంగ్రెస్ పార్టీ విధానాలకు వ్యతిరేకం అంటూ ఘాటు వ్యాఖ్యలు చేశారు. కాంగ్రెస్‌ ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్‌ రెడ్డి ట్విట్టర్‌ వేదికగా..‘రాబోయే పదేళ్లు నేనే ముఖ్యమంత్రి అని రేవంత్ రెడ్డి గారు ప్రకటించుకోవడం కాంగ్రెస్ పార్టీ విధానాలకు వ్యతిరేకం. జాతీయ పార్టీ అయిన కాంగ్రెస్ లో అధిష్ఠానం ఆదేశాల మేరకు, ప్రజాస్వామ్యబద్ధంగా ముఖ్యమంత్రి ఎన్నిక ఉంటుంది. తెలంగాణ కాంగ్రెస్ ను వ్యక్తిగత సామ్రాజ్యంగా మార్చుకునే ప్రయత్నాలను నిఖార్సయిన కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు సహించరు’ అంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు. అంతకుముందు పాలమూరు సభలో ముఖ్యమంత్రి రేవంత్‌ రెడ్డి మాట్లాడుతూ..‘2034 వరకు ఇంకో పదేళ్ల పాటు పాలమూరు బిడ్డనే ముఖ్యమంత్రిగా ఉంటాడని వ్యాఖ్యానించారు.

భారత రాష్ట్ర సమితిలో కల్వకుంట్ల తారక రామారావు (కేటీఆర్‌), కల్వకుంట్ల కవిత మధ్య విభేదాలు సూక్ష్మంగా ఉన్నప్పటికీ, ఇవి బహిర్గతంగా తెరపైకి రాలేదు. కేసీఆర్‌ కుటుంబంలో కీలక సభ్యులైన కేటీఆర్‌, కవిత ఇద్దరూ పార్టీలో ముఖ్యమైన బాధ్యతలు నిర్వహిస్తున్నారు, కానీ వారి పాత్రలు, రాజకీయ ఆకాంక్షలు విభేదాలకు దారితీశాయనే చర్చ జరుగుతోంది. కేటీఆర్‌, బీఆర్‌ఎస్‌ వర్కింగ్ ప్రెసిడెంట్‌గా, పార్టీ రోజువారీ కార్యకలాపాలను నిర్వహిస్తున్నాడు అయితే కవిత, ఎమ్మెల్సీగా జాతీయ రాజకీయాల్లో బీఆర్‌ఎస్‌ ఆధిపత్యాన్ని విస్తరించడానికి ప్రయత్నిస్తోంది. ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసులో కవిత పేరు రావడం, ఆమె అరెస్ట్ కావడం బీఆర్‌ఎస్‌ ఇమేజ్‌ను దెబ్బతీశాయి, ఇది కేటీఆర్‌కు ఒత్తిడిని కలిగించింది.

కేసీఆర్‌ తర్వాత పార్టీ నాయకత్వం ఎవరు అనే ప్రశ్నలో కేటీఆర్‌ ఆధిపత్యం స్పష్టంగా కనిపిస్తుంది. కవిత, జాతీయ స్థాయిలో తన ప్రభావాన్ని పెంచుకోవాలని ఆశిస్తున్నప్పటికీ, కేటీఆర్‌ పార్టీలో ఆధిపత్యం కోసం ఆమెకు అవకాశం ఇవ్వడం లేదనే ఆరోపణలు ఉన్నాయి. కేటీఆర్‌, కవిత మధ్య విభేదాలు బహిర్గతంగా కనిపించకపోయినా, బీఆర్‌ఎస్‌లో కుటుంబ రాజకీయాలు, నాయకత్వ వారసత్వంపై జరుగుతున్న చర్చలు పార్టీ ఐక్యతను ప్రశ్నార్థకం చేస్తున్నాయి. 2024 లోక్‌సభ ఎన్నికల్లో బీఆర్‌ఎస్‌ ఒక్క సీటు కూడా గెలవకపోవడం, కవిత లిక్కర్ స్కామ్ కేసు వంటి వివాదాలు పార్టీని మరింత బలహీనపరిచాయి.

ehatv

ehatv

Next Story