ఖమ్మం జిల్లా రఘునాథపాలెం మండలం వి.వెంకటాయపాలెం పంచాయతీ జగ్యాతండాలో విషాదం చోటు చేసుకుంది.

ఖమ్మం జిల్లా రఘునాథపాలెం మండలం వి.వెంకటాయపాలెం పంచాయతీ జగ్యాతండాలో విషాదం చోటు చేసుకుంది. బోడ సుశీల(28)పై ఆమె ఇంటి ఎదురుగా ఉండే రౌడీ షీటర్ ధరావత్ వినయ్ కొంతకాలంగా వేధించసాగాడు. ఆమెను తరచూ వేధింపులకు గురిచేసేవాడు. ఈ క్రమంలో పత్తి తీసేందుకు సుశీల మరో మహిళతో కలిసి సోమవారం నాడు కొణిజర్ల మండలం అమ్మపాలెం వెళ్లింది. అక్కడ సుశీలను గమనించిన రౌడీషీటర్ ధరావత్ వినయ్ మరోసారి తన దగ్గిరికి వెళ్లి కోరిక తీర్చాలని అడిగాడు. దీంతో సుశీల ప్రతిఘటించడంతో ఆమెపై దాడికి పాల్పడి అక్కడి నుంచి వెళ్లిపోయాడు. దీంతో మనస్తాపం చెందిన సుశీల ఇంటికి వచ్చిన తర్వాత ఉరేసుకుని ఆత్మహత్యకు పాల్పడింది. వినయ్ వేధింపుల వల్లే తన భార్య ఆత్మహత్య చేసుకుందని సుశీల భర్త శివకుమార్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఇదిలా ఉంటే సుశీల మృతిపై ఆమె బంధువులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. సుశీల ఒంటిపై గాయాలు ఉన్నాయని, శవపరీక్షలో వాటిని పరిగణనలోకి తీసుకోలేదని, ఉరేసుకుని మరణించిందని మాత్రమే వైద్యులు చెబుతున్నారని ఆరోపించారు. ఈ కేసును పక్కదోవ పట్టించకుండా నిష్పక్షపాతంగా విచారణ జరపాలని కోరారు.
