శాసన సభ ఆవరణలో మీడియాతో జరిగిన చిట్‌చాట్‌లో భారత రాష్ట్ర సమితి వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ రాష్ట్రంలోని పలు కీలక అంశాలపై విస్తృతంగా స్పందించారు.

శాసన సభ ఆవరణలో మీడియాతో జరిగిన చిట్‌చాట్‌లో భారత రాష్ట్ర సమితి వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ రాష్ట్రంలోని పలు కీలక అంశాలపై విస్తృతంగా స్పందించారు. ముఖ్యంగా పాలమూరు ప్రాజెక్టు, నీటిపారుదల అంశాలు, శాసన సభలో జరుగుతున్న చర్చలు, జీహెచ్ఎంసీ విభజన, టెలిఫోన్ ట్యాపింగ్ ఆరోపణలు, కేసీఆర్‌ను కలవడంపై ముఖ్యమంత్రి వ్యాఖ్యలు, మీసాలు–గడ్డాలపై చేసిన వ్యాఖ్యలపై తన అభిప్రాయాలను స్పష్టంగా వెల్లడించారు.

ఏ ప్రభుత్వం అయినా ముందుగా తాగునీటి అవసరాల పేరుతోనే ప్రాజెక్టులను ప్రారంభిస్తుందని, అనంతరం అన్ని అనుమతులు తెచ్చుకోవడం పరిపాటేనని కేటీఆర్ తెలిపారు. అయితే ఈ విషయాన్ని ఎవరూ బయటకు చెప్పరని వ్యాఖ్యానించారు. పోలవరం ప్రాజెక్టు గురించి 70 ఏండ్ల నుంచి వింటున్నామని, కానీ ఇప్పటికీ అది పూర్తి కాలేదని గుర్తుచేశారు. అదే సమయంలో కాలేశ్వరం ప్రాజెక్టు మాత్రం తమ నాయకుడు కేసీఆర్ హయాంలోనే పూర్తయిందని, దీనికి కారణం కేసీఆర్ నిబద్ధతే అని స్పష్టం చేశారు. కాలంతో పోటీ పడి మరీ కేసీఆర్ కాలేశ్వరం ప్రాజెక్టును నిర్మించారని చెప్పారు. కాలేశ్వరంలో రంద్రాన్వేషణ చేస్తే రాష్ట్రానికి నష్టం జరుగుతుందే తప్ప రాజకీయంగా తమకు నష్టం జరగదని అన్నారు. ప్రజలకు నీళ్లు ఇచ్చింది ఎవరో ప్రజలకు బాగా తెలుసని స్పష్టం చేశారు. పాలమూరు–రంగారెడ్డి ప్రాజెక్టు విషయంలో 45 టీఎంసీలకు ఒప్పుకుంటే అది నష్టమే అవుతుందని, 299 టీఎంసీలకు ఒప్పుకున్నది అప్పటి కాంగ్రెస్ ప్రభుత్వమేనని గుర్తుచేశారు. దాని ఆధారంగానే తమ ప్రభుత్వం మరిన్ని నీటి కేటాయింపుల కోసం కేంద్రాన్ని కోరిందన్నారు. అయినప్పటికీ పాలమూరు ప్రాజెక్టును రేవంత్ రెడ్డి కావాలనే పండబెట్టాడని ఆరోపించారు. ప్రాజెక్టు పూర్తయితే కేసీఆర్‌కు పేరు వస్తుందన్న భయంతోనే, తన పాత బాస్ చంద్రబాబు నాయుడికి కోపం వస్తుందన్న ఉద్దేశంతో రేవంత్ రెడ్డి ఈ ప్రాజెక్టును అడ్డుకుంటున్నాడని కేటీఆర్ విమర్శించారు. కృష్ణా నదినుంచి నీళ్లు తీసుకుంటే చంద్రబాబుకు కోపం వస్తుందని, అందుకే ప్రాజెక్టును పండబెట్టి కాలువలు కూడా తవ్వడం లేదన్నారు.

రేవంత్ రెడ్డి అవినీతి, అక్రమాలు బయటపడుతున్నాయనే కారణంతోనే ఆయన బూతులు మాట్లాడుతున్నారని ఆరోపించారు. తనపై వ్యాఖ్యలు చేస్తే తాను స్పందించనని, కానీ తన తండ్రి కేసీఆర్‌పై మాట్లాడితే మాత్రం ఊరుకునేది లేదని స్పష్టం చేశారు. రేవంత్ బూతులకు తాను స్పందిస్తే తన స్థాయికి దిగజారొద్దని కొందరు చెబుతున్నారని అన్నారు. నీళ్ల గురించి ప్రశ్నిస్తే నికృష్టమైన మాటలు మాట్లాడుతున్నారని, కేసీఆర్ ప్రెస్ మీట్‌కే కాంగ్రెస్ నాయకులు అల్లాడిపోతున్నారని చెప్పారు. మీడియా ముందు కెసిఆర్ గారు లేవనెత్తిన ప్రశ్నలకు కాంగ్రెస్ సమాధానం చెప్పలేక బూతులు మాట్లాడుతున్నది అన్నారు. అలాంటప్పుడు కేసీఆర్‌ను అసెంబ్లీకి రావాలని డిమాండ్ చేయడం హాస్యాస్పదమన్నారు. నీళ్ల సబ్జెక్ట్ నాలుగు రోజులు చదివితే రాదని, రాష్ట్రంపై ప్రేమ ఉండాలని కేటీఆర్ వ్యాఖ్యానించారు.

ముఖ్యమంత్రి కృష్ణా నది ఏ బేసిన్‌లో ఉందో, ఎక్కడ ఉందో కూడా అడిగిన పరిస్థితి ఉందని ఎద్దేవా చేశారు. బాక్రా నంగల్ ఏ రాష్ట్రంలో ఉందో కూడా తెలియని ముఖ్యమంత్రి ఉన్నారని విమర్శించారు. పాలమూరు–రంగారెడ్డి ప్రాజెక్టును అడ్డుకున్న వ్యక్తే ఈరోజు నీటిపారుదల శాఖ సలహాదారుడిగా ఉన్నారని అన్నారు. ఇలాంటి వారు నీటిపారుదల శాఖపై చర్చ కోరుతున్నారని, అసలు దేనిపై చర్చ పెడుతున్నారో కూడా తెలియని పరిస్థితి ఉందన్నారు. నీటిపారుదలపై కనీస అవగాహన లేని వారు కేసీఆర్ చర్చకు రావాలని అంటున్నారని విమర్శించారు. కేసీఆర్ వస్తున్నారన్న మాట వినగానే కాంగ్రెస్ నాయకులు చర్చకు ప్రిపేర్ అవుతున్నారని చెప్పారు. కౌశిక్ రెడ్డి సభలో మేడిగడ్డను ఎవరో బాంబులు పెట్టి పేల్చారని స్పష్టంగా చెప్పారని గుర్తు చేశారు. బూతులు మాట్లాడాలంటే ఎన్ని రోజులైనా సభ నడుపుతారని, కానీ సబ్జెక్ట్ లేనప్పుడు సభను ఎక్కువ రోజులు నడపలేరని వ్యాఖ్యానించారు. చెక్ డ్యాం పేల్చివేత కేసులో రాఘవ కన్స్ట్రక్షన్ కంపెనీ ఉన్నదని, మేడిగడ్డ పేల్చారని ఇంజనీర్లు ఆనాడే ఫిర్యాదు చేశారని చెప్పారు. అయినా ఎందుకు విచారణ చేపట్టడం లేదని ప్రశ్నించారు. తీసుకున్న చర్యలు ఎక్కడున్నాయని నిలదీశారు. రష్యా ఉక్రేన్న్ యుద్ధంలో కాకువ డ్యాం పేల్చారని, అదే తరహాలో ఇక్కడ కూడా పేల్చారని ఆర్‌ఎస్‌ ప్రవీణ్ క్లుప్తంగా వివరించారని తెలిపారు.

జీహెచ్ఎంసీపై కేటీఆర్ వ్యాఖ్యలు

జీహెచ్ఎంసీని మూడు భాగాలుగా విభజిస్తారన్న ప్రచారం జరుగుతోందని, ఫోర్త్ సిటీ అని పెట్టిన దానిని కూడా కార్పొరేషన్ చేస్తారేమోనని అన్నారు. ఏం చేసినా శాస్త్రీయంగా ఉండాలని, ఇష్టం వచ్చినట్లు చేస్తే ఊరుకోబోమని, అన్నింటికీ సమాధానం చెప్పాల్సిందేనని స్పష్టం చేశారు. చర్చ పెట్టాలని, ఆ చర్చలో తమ పార్టీ అన్ని విషయాలు మాట్లాడుతుందని చెప్పారు. జీహెచ్ఎంసీలో కాంగ్రెస్, ఎంఐఎం ఏం చేసుకుంటారో, ఎవరికీ లాభం చేకూర్చేలా చేసుకుంటారో వారి ఇష్టమని వ్యాఖ్యానించారు. 2016లో జరిగిన జీహెచ్ఎంసీ ఎన్నికలు చరిత్రాత్మకమని, అటువంటి ఎన్నికలను ఇప్పటివరకు చూడలేదని, మళ్లీ చూడబోమని అన్నారు. కేవలం డబ్బుల సేకరణ కోసం మర్చంట్ బ్యాంకర్లు, బ్రోకర్లు చెప్పినట్లు డిలిమిటేషన్ చేస్తున్నారని ఆరోపించారు. ఈ విభజన మొత్తం డబ్బుల కోసమేనని, అడ్డగోలుగా విభజన చేశారని విమర్శించారు. గతంలో ఓల్డ్ సిటీలో కూడా తమ పార్టీ రెండో స్థానంలో నిలిచిందని, గతంలో తాము గెలిచిన సీట్లను భవిష్యత్తులో ఎవ్వరూ గెలవలేరని ధీమా వ్యక్తం చేశారు.

ఫోన్ ట్యాపింగ్ అంశంపై కేటీఆర్

ముఖ్యమంత్రికి ఇంటెలిజెన్స్ సమాచారం వస్తుందని, గూఢచారి వ్యవస్థ నెహ్రు కాలం నుంచి ఇప్పటి వరకు కొనసాగుతూనే ఉందని చెప్పారు. శాంతిభద్రతలు, రాష్ట్ర రక్షణ కోసమే ఈ వ్యవస్థ పనిచేస్తుందని అన్నారు. ఈరోజు నిఘా వ్యవస్థ లేదా ఫోన్ ట్యాపింగ్ లేదని ఎవరైనా అనగలరా అని ప్రశ్నించారు. ప్రతిపక్ష నాయకుల ఫోన్లు ట్యాప్ చేయడం లేదని ముఖ్యమంత్రి చెప్పగలరా అని ప్రశ్నించారు. ట్యాపింగ్ నిజం కాకపోతే అధికారులు ఎందుకు ప్రెస్ మీట్ పెట్టడం లేదని అడిగారు. ప్రస్తుత డీజీపీ కూడా అప్పట్లో అధికారులుగానే ఉన్నారని, ఆయనకు కూడా నిఘా వ్యవస్థ గురించి పూర్తి అవగాహన ఉందని తెలిపారు. నిఘా వ్యవస్థ ఎలా పనిచేస్తుందో అధికారులు ముఖ్యమంత్రికి వివరించరని, ఉన్న నిబంధనల మేరకు సమాచారం ఎలా వస్తుందో ముఖ్యమంత్రి అడగరని చెప్పారు. ఎస్ఐటీ వంటి డ్రామాలతో ప్రజల దృష్టిని ఎంతకాలం మళ్లిస్తారని ప్రశ్నించారు. ఈ అటెన్షన్ డైవర్షన్‌తో ఎంతకాలం కాలం వెల్లదీస్తారని అన్నారు. ఇన్ని ఎస్ఐటీలు, విచారణలు, కేసుల పేరుతో సాధించింది ఏమిటని ప్రశ్నించారు. కనీసం ఒక్క దాంట్లో అయినా నిజం ఉందని తేలిందా అని అడిగారు. ప్రజలు ఈ డైవర్షన్లను స్పష్టంగా గ్రహిస్తున్నారని, అందుకే సర్పంచ్ ఎన్నికల్లో ప్రజలు తమ పార్టీకి ఓటు వేశారని చెప్పారు. కాంగ్రెస్‌కు పరిపాలన రాదని ప్రజలు తేల్చిచెప్పారని, కాంగ్రెస్ అప్పుల ప్రచారాన్ని కూడా ప్రజలు నమ్మడం లేదన్నారు. కాగ్ లెక్కలు, నిజాలు కూడా ప్రజలకు తెలుసని, 24 నెలల్లో చేసిన రెండున్నర లక్షల కోట్ల అప్పుతో కాంగ్రెస్ ప్రభుత్వం ఏమి చేసిందని ప్రశ్నించారు.

కేసీఆర్‌ను రేవంత్ రెడ్డి కలవడంపై కేటీఆర్

కేసీఆర్ అంటే గౌరవం ఉంటే చాలని, తెలంగాణ తెచ్చిన నాయకుడిగా కేసీఆర్ పట్ల తెలంగాణలో ఉన్న ప్రతి ఒక్కరికీ గౌరవం ఉంటుందని చెప్పారు. ముఖ్యమంత్రి హోదాలో శాసన సభలో కేసీఆర్‌ను కలిసేంత సంస్కారం ఉంటే చాలని వ్యాఖ్యానించారు. ఇదే సంస్కారం బయట మాటల్లో కూడా ఉంటే బాగుంటుందని అన్నారు. రాజకీయ ప్రత్యర్థులు ఒకరినొకరు పలకరించుకునేంత సానుకూల వాతావరణం ఉంటే మంచిదని కేటీఆర్ పేర్కొన్నారు.

మీసాలు, గడ్డాలపై రేవంత్ రెడ్డి వ్యాఖ్యలపై కేటీఆర్ స్పందన

గడ్డం పెంచిన ప్రతి ఒక్కరూ గబ్బర్ సింగ్ కాదని కేటీఆర్ స్పష్టం చేశారు. గడ్డాలు పెంచడం చాలా ఈజీ కానీ పాలన చేయడమే కష్టమని వ్యాఖ్యానించారు. రేవంత్ రెడ్డి గడ్డం, మీసాలు లేవని అన్నది తనను కాదని, రాహుల్ గాంధీని, రాజీవ్ గాంధీని కూడా అన్నారని చెప్పారు. తాను ఆంధ్రాలో చదివితే తప్పు అంటారని, కానీ అల్లుడిని మాత్రం ఆంధ్ర నుంచి తెచ్చుకున్నారని ఎద్దేవా చేశారు.

పంచాయితీలలో తమ పార్టీ గొప్ప ఫలితాలు సాధించిందని, రెండేళ్లలోనే కాంగ్రెస్ ప్రభుత్వానికి తీవ్ర వ్యతిరేకత వచ్చిందన్నారు. ముఖ్యమంత్రి చెప్పిన జాబితాలోనే ఇతర పార్టీల సర్పంచులను కూడా కలిపుకున్నారని విమర్శించారు. సర్పంచ్ ఎన్నికలలో ప్రజలు కాంగ్రెస్ పార్టీని తిరస్కరించాలని కేటీఆర్ అన్నారు. అడ్డగోలు హామీలు ఇచ్చి ప్రజలను మోసం చేసినందునే కేవలం రెండు సంవత్సరాల్లోనే ప్రజలు కాంగ్రెస్ పట్ల ఆగ్రహంగా ఉన్నారన్నారు. మా పార్టీ ఎమ్మెల్యేలు కష్టపడి పార్టీ నేతల సహకారంతో భారీగా సర్పంచ్ స్థానాలు గెలుచుకున్నమని తెలిపారు.

Updated On
ehatv

ehatv

Next Story