Love at an early age: తెలిసీ తెలియని వయసులో ప్రేమ.. తల్లిదండ్రులు మందలించారని బాలిక ఏంచేసిందంటే..!

ప్రేమ వ్యవహారం ఒకరి ప్రాణం తీసుకోగా మరొకరు చావు అంచుల వరకు వెళ్లాడు, అతని పరిస్థితి ఇంకా విషమంగానే ఉందని వైద్కులు వెల్లడించారు. ఈ ఘటన ఆదిలాబాద్ జిల్లాలో జరిగింది. తెలిసీ తెలియని వయసులో ప్రేమలో పడి ఓ మైనర్ విద్యార్థినిని తల్లిదండ్రులు మందలించడంతో ఆ బాలిక పురుగులమందు తాగి ఆత్మహత్యకు పాల్పడింది. ఈ విషయం తెలియడంతో ప్రియుడు (మైనర్) సైతం పురుగుల మందు తాగాడు. ప్రస్తుతం అతను ఆదిలాబాద్‌లోని రిమ్స్‌లో చికిత్స పొందుతున్నాడు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం బేల మండలంలోని పాఠన్ గ్రామానికి చెందిన 16 ఏళ్ల బాలిక స్థానిక జెడ్పీ పాఠశాలలో పదో తరగతి చదువుతోంది. జైనథ్ మండలంలోని ఆకుర్లకు చెందిన 17 ఏళ్ల బాలుడిని ప్రేమించింది. ఈ విషయం రెండు రోజుల క్రితం బాలిక తల్లిదండ్రులకు తెలిసింది. దీంతో కుటుంబీకులు మందలించారు. ఈ వయసులో ప్రేమలేంటి అని ప్రశ్నించి, చదువుపై దృష్టి పెట్టాలని గట్టిగానే చెప్పారు. దీంతో మనస్తాపం చెందిన ఆ బాలిక సోమవారం మధ్యాహ్నం ఇంటి వద్ద పురుగుల మందు తాగి ఆత్మహత్య చేసుకుంది. ఆత్మహత్యకు ముందు ఈ విషయాన్ని ఆమె ప్రియుడికి ఫోన్ ద్వారా తెలిపింది. ఇది తెలిసి ఆదిలాబాద్ పట్టణంలోని ఓ సూపర్ మార్కెట్ దగ్గర ఆ బాలుడు కూడా పురుగుల మందు తాగాడు. బాలుడి పరిస్థితి గమనించిన స్థానికులు అతడిని చికిత్స కోసం రిమ్స్‌కు తరలించారు. ప్రస్తుతం అతడి పరిస్థితి విషమంగా ఉందని వైద్యులు తెలిపారు. బాలిక కుటుంబీకుల ఫిర్యాదు మేరకు కేసు దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు వెల్లడించారు.


