మేడారం సమ్మక్క–సారలమ్మ ఆలయ ప్రాంగణ విస్తరణ పనులు తుది దశకు చేరుకున్నాయి.

మేడారం సమ్మక్క–సారలమ్మ ఆలయ ప్రాంగణ విస్తరణ పనులు తుది దశకు చేరుకున్నాయి. భక్తుల రద్దీని దృష్టిలో ఉంచుకుని చేపట్టిన ఈ అభివృద్ధి పనులు ఆలయానికి మరింత వైభవాన్ని తీసుకొస్తున్నాయి.ఆలయ ప్రాంగణంలో 271 మీటర్ల పొడవుతో, 46 బలమైన పిల్లర్లతో నిర్మిస్తున్న రాతి ప్రాకారం భక్తులను విశేషంగా ఆకట్టుకుంటోంది. ఈ ప్రాకార గోడలపై ఆదివాసీల సంప్రదాయ జీవనశైలి, వారి సంస్కృతి, ఆచారాలను ప్రతిబింబించే అద్భుత శిల్పాలు, చిత్రాలను చెక్కుతున్నారు. ఇవి సందర్శకులకు గిరిజన సంస్కృతిని కళ్ల ముందే నిలబెడుతున్నాయి.
సమ్మక్క, సారలమ్మ గద్దెల ఎదుట ప్రధాన ద్వారం ఇప్పటికే సిద్ధమైంది. జనవరి 28 నుంచి 31 వరకు జరగనున్న మహా జాతరకు ముందే అన్ని పనులు పూర్తి చేయాలని అధికారులు లక్ష్యంగా పెట్టుకున్నారు. పనులు వేగంగా సాగుతుండటంతో, నిర్ణీత గడువులోనే ప్రాంగణ విస్తరణ పూర్తయ్యే అవకాశముంది.కొత్త హంగులు, ఆధునిక సదుపాయాలతో మేడారం ఆలయ ప్రాంగణం ఇప్పుడు సరికొత్త రూపును సంతరించుకుంది. ఈ మహా జాతరకు వచ్చే కోట్లాది భక్తులకు ఇది మరింత సౌకర్యాన్ని, ఆధ్యాత్మిక అనుభూతిని అందించనుంది.


