2014-2023 మధ్య కాలంలో రాష్ట్రానికి లక్షల కోట్లలో పెట్టుబడులు: నీతి ఆయోగ్..!

TS-IPass దేశానికే ఆదర్శమన్న నీతి ఆయోగ్ (Niti Ayog) ప్రశంసించింది. 2014 కంటే ముందు పరిశ్రమల అనుమతి కోసం చాలా కష్టంగా ఉండేదని, పరిశ్రమలు పెట్టాలనుకున్నవారు చాలా కార్యాలయాలు తిరగాల్సి వచ్చేదని, అధికారులు అందుబాటులో లేక, సరైన సమయంలో అనుమతులు రాక చాలా పరిశ్రమలు ఆలస్యమయ్యేవని ''నీతి ఆయోగ్‌ '' వెల్లడించింది. దేశంలోని అన్నిరాష్ట్రాల్లో కొన్ని విధానాలను అధ్యయనం చేసిన నీతి ఆయోగ్‌ ఈ టీఎస్-ఐపాస్‌ విధానాన్ని కేసీఆర్ (KCR) తీసుకురావడం, అందుకు అనుగుణంగా పెట్టుబడులు రావడంపై రాష్ట్రాన్ని ప్రశసించింది. 2014-2023 వరకు టీఎస్-ఐపాస్‌ విధానం వల్ల పరిశ్రమలకు గ్రిల్స్‌ లేకుండా చేశారని, అందుకే పెట్టుబడులు వచ్చాయని తెలిపింది. దీనిపై మాజీ పరిశ్రమల శాఖ మంత్రి కేటీఆర్‌ (KTR) స్పందించారు. కేసీఆర్‌ దార్శనికత వల్లే ఇది సాధ్యమైందని ఆయన అన్నారు.

''రాష్ట్రాన్ని పారిశ్రామిక విప్లవానికి కేంద్రంగా మార్చాలన్న సమున్నత సంకల్పంతో కేసీఆర్ రూపకల్పన చేసిన TS IPASS విధానం దేశంలోనే అత్యుత్తమమైనదని సాక్షాత్తు నీతి ఆయోగ్ తాజా నివేదికలో ప్రశంసించడం యావత్ తెలంగాణకు గర్వకారణమని కేటీఆర్‌ అన్నారు. కొట్లాడి సాధించుకున్న తెలంగాణను పదేళ్ల కాలంలోనే దేశానికే పారిశ్రామిక దిక్సూచిగా మార్చడంలో TS IPASS పోషించిన పాత్ర అత్యంత కీలకమని, జాతీయ స్థాయిలో అందరికీ అనుసరణీయమని కేంద్ర సంస్థ పేర్కొనడం కేసీఆర్ దార్శనికతకు నిలువెత్తు నిదర్శనమన్నారు.

భారీ పరిశ్రమలకు తోడు, ఎంఎస్ఏంఈ విభాగంలో 2.6 లక్షల కోట్ల పెట్టుబడులను ఆకర్షించి, 25లక్షల మందికి పైగా యువతకు గౌరవప్రదమైన ఉద్యోగ, ఉపాధి అవకాశాలను కల్పించడం దేశ చరిత్రలోనే ఓ సువర్ణ అధ్యాయమని, పరిశ్రమల ఏర్పాటుకు ఉన్న సవాలక్ష ప్రతిబంధకాలను సమూలంగా, శాశ్వతంగా రూపుమాపి సింగిల్ విండో ద్వారా సకల అనుమతులు అందించిన ఘనత బీఆర్‌ఎస్ ప్రభుత్వానికే దక్కిందన్నారు కేటీఆర్.

కేవలం 15 నుండి 30 రోజుల్లోనే అన్ని పర్మిషన్స్ ఇవ్వడంతోపాటు అవినీతికి, ఏమాత్రం తావులేని - అత్యంత పారదర్శక పాలసీని రూపకల్పన చేయడమే కాదు.. అదే చిత్తశుద్ధితో దశాబ్దకాలంపాటు విజయవంతంగా అమలు అమలుచేయడం వల్లే ఈ ప్రతిష్టాత్మక ఫలితాలు, జాతీయస్థాయి గుర్తింపు సాధ్యమైందని.. ప్రపంచ దిగ్గజ సంస్థల నుండి సూక్ష్మ మధ్య తరహా పరిశ్రమల వరకూ అందరూ తెలంగాణకు క్యూకట్టేలా పెట్టుబడిదారుల్లో కొండంత విశ్వాసాన్ని కల్పించిన విప్లవాత్మక విధానం తీసుకొచ్చి పదేళ్లు దాటినా నేటికి TS IPASS ప్రతిష్ట నలుదిశలా మారుమోగుతూనే ఉందన్నారు. స్వతంత్ర భారత చరిత్రలోనే తొలిసారిగా కేసీఆర్‌ అమలుచేసిన రైతుబంధు, మిషన్ భగీరథ, మిషన్ కాకతీయ, టీ హబ్ వంటి వినూత్న కార్యక్రమాలకు తోడు తాజాగా పారిశ్రామిక ప్రగతికి కూడా తెలంగాణ మోడలే ఆచరణీయమని నీతి ఆయోగ్ ప్రకటించిన నేపథ్యంలో ఇకనైనా కేసీఆర్ ఆనవాళ్లు చెరిపేస్తామనే భ్రమల్లో బతికే అరాచక శక్తులు బుద్ధి తెచ్చుకుంటే మంచిదని కేటీఆర్‌ హితవు పలికారు.

Updated On
ehatv

ehatv

Next Story