అయ్యో పాపం..! ఆరేళ్ల చిన్నారి ప్రాణాలు తీసుకున్న సాంబార్‌..!

ఖమ్మం జిల్లా వైరాలోని ఇందిరమ్మ కాలనీలో కన్నీటిని తెప్పించే విషాదకరమైన ఘటన చోటుచేసుకుంది. సింహాద్రి, సరోజినీ దంపతుల కూతురు చిన్నారి రమ్యశ్రీ (6) ఆడుకుంటూ ప్రమాదవశాత్తు వేడి సాంబార్‌లో పడి ప్రాణాలు పోగొట్టుకుంది. ఇంటి ఆవరణలో వంట పనులు జరుగుతున్న సమయంలో రమ్యశ్రీ పక్కనే ఆడుకుంటూ ఉంది. ప్రమాదవశాత్తు సాంబార్ పాత్రలో పడడంతో తీవ్రంగా గాయాలయ్యాయి. కాలిన గాయాలతో రోదిస్తున్న చిన్నారిని కుటుంబ సభ్యులు అత్యవసర చికిత్స నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. స్థానిక వైద్యులు పరిస్థితి విషమంగా ఉందని చెప్పడంతో చిన్నారిని హైదరాబాద్‌కు తరలిస్తుండగా మార్గ మద్యలో చిన్నారి కన్నుమూసింది. దీంతో తల్లిదండ్రులు కన్నీరుమున్నీరుగా విలపిస్తున్నారు. ఆరేళ్లకే నిండు జీవితం ముగిసిందని ఆ తల్లి ఏడుస్తుంటే స్థానికులకు కన్నీరుపెట్టించింది. తల్లిదండ్రుల ఆవేదన చూసి అందరూ కన్నీటి పర్యంతమయ్యారు. ఈ ఘటనతో ఇందిరమ్మ కాలనీ అంతటా విషాద ఛాయలు అలుముకున్నాయి. చిన్నారి మృతితో కుటుంబ సభ్యులు, బంధువులు, స్థానికులు తీవ్ర దిగ్భ్రాంతికి గురయ్యారు.

Updated On 16 Jan 2026 5:47 AM GMT
ehatv

ehatv

Next Story