మేం ఎందుకు పార్టీ మారాం అబ్బే అదేం లేదు.. కేవలం నియోజకవర్గం అభివృద్ధి కోసం సీఎం రేవంత్‌రెడ్డిని కలిశాం.

మేం ఎందుకు పార్టీ మారాం అబ్బే అదేం లేదు.. కేవలం నియోజకవర్గం అభివృద్ధి కోసం సీఎం రేవంత్‌రెడ్డిని కలిశాం. సీఎం రేవంత్‌ మాకు జాతీయజెండా కండువానే కప్పాడు.. అది కాంగ్రెస్‌ కండువా కాదు. బీఆర్‌ఎస్‌ నుంచి కాంగ్రెస్‌లో చేరిన 8 మంది తాము బీఆర్ఎస్‌లోనే ఉన్నామని స్పీకర్‌కు వివరణ ఇచ్చారు. అది కూడా లిఖితపూర్వకంగా వివరణ ఇచ్చారు. దీంతో స్పీకర్‌ వెంటనే ఇదిగోండి మీ ఎమ్మెల్యేలు మీ పార్టీలోనే ఉన్నారు అంటూ ఆ వివరణను ఫిరాయింపుదారులపై కేసు వేసిన ఎమ్మెల్యేలకు పంపించారు.

దానం నాగేందర్‌, కడియం శ్రీహరి మాత్రం వివరణ ఇవ్వడానికి ఇంకా సమయం కావాలన్నారు. బీఆర్ఎస్‌కు చెందిన 10 మంది ఎమ్మెల్యేలు కాంగ్రెస్‌లో చేరారని, ఫిరాయింపు నిరోధక చట్టం కింద వారిని అనర్హులుగా ప్రకటించాలని దాఖలైన కేసులో 3 నెలల్లోగా స్పీకర్‌ నిర్ణయం తీసుకోవాలని గత నెల 31న సుప్రీంకోర్టు తీర్పు ఇచ్చింది. ఇదే అంశంపై తెలంగాణ స్పీకర్‌కు నోటీసులు జారీ చేసింది. సుప్రీంకోర్టు ఆదేశాలతో తెలంగాణ స్పీకర్‌ ఫిరాయింపు ఎమ్మెల్యేలకు నోటీసులు పంపించారు. వారి వద్ద నుంచి వివరణ తీసుకున్నారు.

శేరిలింగంపల్లి ఎమ్మెల్యే అరికెపూడి గాంధీకి ఏకంగా పబ్లిక్ అకౌంట్స్ కమిటీ (పీఏసీ) చైర్మన్ పదవి ఇచ్చింది. దీనిపై అప్పట్లో బీఆర్ఎస్ పెద్ద గొడవ చేసింది. ప్రతిపక్షాలకు ఇవ్వాల్సిన పదవిని కాంగ్రెస్‌లో చేరిన ఎమ్మెల్యేకు ఎలా ఇచ్చారని ప్రశ్నించింది. ఇప్పుడు ఆయనేమో తాను బీఆర్ఎస్‌లోనే ఉన్నానని అంటున్నాడు. అప్పట్లో బీఆర్ఎస్ ఎమ్మెల్యే పాడి కౌశిక్‌ రెడ్డి ఫైర్ అయ్యాడు. కాంగ్రెస్ నేతలు చెబుతున్నట్లుగా అరికెపూడి గాంధీ మా పార్టీ సభ్యుడే అయితే తెలంగాణ భవన్‌కు రావాలి. ఆయన ఇంటికి వెళ్లి మా పార్టీ కండువా కప్పుతా అంటూ సవాల్‌ చేశాడు. దీనిపై ఇద్దరి మధ్య పెద్ద వివాదమే జరిగింది. అరికెపూడి తన అనుచరులను వెంట పెట్టుకొని కౌశిక్‌రెడ్డి ఇంటి వద్దకు వెళ్లి దాడికి పాల్పడ్డాడు.

ఇక మరో ఎమ్మెల్యే, వృద్ధనేత అయితే కాంగ్రెస్‌లో చేరలేదు.. నియోజకవర్గ అభివృద్ధి కోసమే సీఎం రేవంత్‌ను కలిశా అని పోచారం శ్రీనివాస్ రెడ్డి అన్నాడు. ఈయనకు ప్రభుత్వంలో వ్యవసాయ సలహాదారుగా పదవి ఇచ్చారు. అయినా తాను కాంగ్రెస్ పార్టీలో చేరలేదంటున్నాడు. తన ఫోటోలను మార్ఫింగ్ చేశారని, తాను ఇంకా బీఆర్ఎస్‌లోనే ఉన్నానని, తనది బీఆర్ఎస్ రక్తమేనని, బీఆర్ఎస్ ఐడియాలజీనే తనది అని బండ్ల కృష్ణమోహన్ రెడ్డి అన్నాడు. గతంలో కూడా రెండు మూడు సార్లు తాను పార్టీ మారలేదని దబాయించాడు. తన పర్మిషన్ లేకుండా కాంగ్రెస్ సభలో తన ఫోటో ఉన్న ఫ్లెక్సీ వాడారని కూడా పోలీసులకు ఫిర్యాదు చేశాడు.

తాను కాంగ్రెస్‌లో చేరానని ప్రచారం చేస్తున్నారని, అది ఎంతమాత్రం నిజం కాదని కాలే యాదయ్య అన్నాడు.నేను బీఆర్ఎస్‌లో కొనసాగుతున్నా. కాంగ్రెస్‌లో చేరలేదు. ఇక గూడెం మహిపాల్‌రెడ్డి విషయానొకొస్తే ఈయన గతంలో ఒకసారి ‘‘తన కార్యాలయంలో కేసీఆర్ ఫోటో పెట్టుకుంటే తప్పేంటి?’’ అని ప్రశ్నించాడు. తాను ఇప్పటికీ బీఆర్ఎస్‌లోనే ఉన్నానని, నియోజకవర్గ అభివృద్ధి పనుల కోసమే సీఎంను కలిశానని మహిపాల్‌రెడ్డి వివరణ ఇచ్చాడు. ఇలాగే రాజేంద్రనగర్‌ ఎమ్మెల్యే ప్రకాష్‌గౌడ్, భద్రాచలం ఎమ్మెల్యే తెల్లం వెంకట్రావు కూడా తాము బీఆర్‌ఎస్‌లోనే ఉన్నామని పార్టీ మారలేదని లిఖిత పూర్వక వివరణ ఇచ్చారు. స్వయంగా తాము పార్టీ మారినట్లు మీడియాలో వార్తలు స్పష్టంగా వచ్చినా కానీ వాళ్లు ఇలా వివరణ ఇవ్వడంపై రాజకీయ విశ్లేషకులు ముక్కున వేలేసుకుంటున్నారు. బీఆర్‌ఎస్‌ అయితే పార్టీ మారకపోతే, బీఆర్‌ఎస్‌ ఆఫీస్‌కు రావాలని సవాల్ విసురుతున్నారు.

ehatv

ehatv

Next Story