సర్వం సిద్ధం చేసుకున్న పురపాలక శాఖ

రాష్ట్రంలో 125 మున్సిపాలిటీలకు ఎన్నికలు
రాష్ట్రంలో అనుకున్నదాని కంటే ముందుగానే మున్సిపల్ ఎన్నికల నిర్వహణకు రంగం సిద్ధమవుతోంది. రాష్ట్ర వ్యాప్తంగా 125 పురపాలక సంఘాల ఎన్నికలకు ఈ నెల 11నే షెడ్యూల్ వెలువడే అవకాశం ఉందని ఆ శాఖ అధికార వర్గాలు చెబుతున్నాయి. ఓటర్ల జాబితాలు సహా ఎన్నికల ప్రక్రియకు సంబంధించి సర్వం సిద్ధం చేసుకున్నట్టు వెల్లడిస్తున్నాయి. సంక్రాంతి పండుగ తరువాత మున్సిపల్ ఎన్నికల ప్రకటన వెలువడే అవకాశం ఉందని, ఫిబ్రవరి రెండో వారంలోపు ఎన్నికలు పూర్తవుతాయని తొలుత ప్రచారం జరిగింది. కానీ జనవరి 11వ తేదీనే ఎన్నికల ప్రకటన వచ్చే అవకాశం ఉందని, తర్వాతి రెండు వారాల్లోనే ఎన్నికల ప్రక్రియ పూర్తవుతుందని సమాచారం. రిజర్వేషన్లపై డెడికేటెడ్ కమిషన్ ఇచ్చే నివేదిక ఆధారంగా నిర్ణయం తీసుకునే అవకాశం ఉందని తెలిసింది. 11న ఎన్నికల ప్రకటన విడుదలైతే జనవరి 25వ తేదీ నాటికే ఎన్నికలు పూర్తయ్యే అవకాశం ఉంటుందని అధికారులు చెబుతున్నారు.


