KCR-Lady Minsisters: రాజకీయ ప్రత్యర్థుల మధ్య సంప్రదాయ గౌరవం: కేసీఆర్ నివాసంలో మంత్రుల భేటీపై ప్రత్యేక విశ్లేషణ

రాజకీయాల్లో శాశ్వత శత్రువులు ఉండరనేది పాత సామెత. కానీ, నేటి రాజకీయాల్లో వ్యక్తిగత విమర్శలు, దూషణలు పెరిగిపోయిన నేపథ్యంలో, మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ నివాసంలో జరిగిన ఒక ఉదంతం రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది. సమ్మక్క-సారక్క జాతర ఆహ్వాన పత్రికను అందజేసేందుకు మంత్రులు సీతక్క, కొండా సురేఖలు ఎర్రవల్లిలోని కేసీఆర్ వ్యవసాయక్షేత్రానికి వెళ్లినప్పుడు చోటుచేసుకున్న పరిణామాలు తెలంగాణ సంస్కృతికి, రాజకీయ పరిపక్వతకు నిదర్శనంగా నిలిచాయి.
గత ఎన్నికల సమయంలోనూ, ఆ తర్వాత కూడా మంత్రులు సీతక్క, కొండా సురేఖ కేసీఆర్ పైన, ఆయన ఫామ్‌హౌస్‌పైన తీవ్రస్థాయిలో విమర్శలు గుప్పించిన సంగతి తెలిసిందే. ఫామ్ హౌస్‌ను ఒక రహస్య కేంద్రంగా, అక్రమాలకు నిలయంగా చిత్రించే ప్రయత్నం జరిగింది. అయితే, ముందస్తు అపాయింట్‌మెంట్ తీసుకుని వెళ్లిన మంత్రులకు అక్కడ లభించిన గౌరవం వారిని ఆశ్చర్యపరిచింది. ఎంపీ సంతోష్‌కుమార్ స్వయంగా ఎదురొచ్చి బొకేలతో స్వాగతం పలకడం, కేసీఆర్ వారిని సాదరంగా ఆహ్వానించడం ఒక హుందాతనాన్ని చాటిచెప్పింది.
రాజకీయంగా ఎన్ని విభేదాలు ఉన్నప్పటికీ, ఇంటికి వచ్చిన ఆడబిడ్డలను గౌరవించడం తెలంగాణ సంస్కృతి. కేసీఆర్ ఈ విషయాన్ని మరోసారి నిరూపించారు. కేవలం మొక్కుబడిగా ఆహ్వాన పత్రికను తీసుకోవడమే కాకుండా, మంత్రులకు పసుపు, కుంకుమ, వస్త్రాలు, తాంబూలాలతో 'సారె' పెట్టి సత్కరించడం విశేషం. కేసీఆర్ ఫామ్ హౌస్‌లో జరిగిన ఈ సంప్రదాయ సత్కారానికి చాలా వ్యత్యాసం కనిపిస్తుంది. ఇది ప్రత్యర్థుల పట్ల ఆయనకు ఉన్న గౌరవాన్ని, రాజకీయ నేర్పును తెలియజేస్తోంది.
సాధారణంగా అధికారం మారినప్పుడు పాత పాలకుల పట్ల కొత్త పాలకులు శత్రుత్వంతో వ్యవహరించడం చూస్తుంటాం. రేవంత్ రెడ్డి వంటి నేతలు తరచుగా కేసీఆర్ పట్ల వ్యక్తిగత విమర్శలు చేస్తూ, ఒకరి ముఖం ఒకరు చూసుకోకూడదనే ధోరణిలో మాట్లాడుతుంటారు. కానీ, కేసీఆర్ అసెంబ్లీలో రేవంత్ రెడ్డికి షేక్ హ్యాండ్ ఇవ్వడం లేదా ఇప్పుడు మంత్రులను గౌరవించడం వంటి చర్యలు గమనిస్తే.. రాజకీయం ప్రజా క్షేత్రంలోనే ఉండాలి తప్ప ఇంటి గడప దాటకూడదనే సంకేతాన్ని ఇస్తున్నాయి.
ఫామ్ హౌస్ అనేది ఏదో ఒక చీకటి సామ్రాజ్యం అన్నట్లుగా గతంలో ప్రచారం జరిగింది. కానీ, అది కేసీఆర్ వ్యవసాయం చేసుకునే వ్యక్తిగత నివాసమని, అక్కడి పచ్చదనం, క్రమశిక్షణ చూస్తే ఎవరికైనా అర్థమవుతుంది. మంత్రులు కూడా అక్కడకు వెళ్ళాక ఒక టవరింగ్ పర్సనాలిటీగా కేసీఆర్ విలువను, ఆయన ఇచ్చే మర్యాదను గుర్తించి ఉంటారు. "మేము చేయాల్సింది చేశాం, ఇప్పుడు మీకు అవకాశం వచ్చింది.. తెలంగాణ ప్రజలకు మంచి చేయండి" అనే పెద్దరికాన్ని కేసీఆర్ ప్రదర్శించినట్లు కనిపిస్తోంది.
రాజకీయాల్లో విమర్శలు ప్రతివిమర్శలు సహజం. తప్పును తప్పు అని ఎత్తిచూపడంలో అభ్యంతరం లేదు. కానీ, వ్యక్తిగత దూషణలు, చిల్లర కామెంట్లతో ఒకరిని తక్కువ చేసే ప్రయత్నం చేస్తే చివరకు దిగజారిపోయేది విమర్శలు చేసిన వారే. కేసీఆర్ ఫామ్ హౌస్ భేటీ ద్వారా మంత్రులకు ఒక గొప్ప పాఠం లభించింది. రాజకీయ ప్రత్యర్థులను శత్రువులుగా చూడకుండా, గౌరవప్రదమైన వాతావరణంలో ప్రజా సమస్యల గురించి చర్చించే సంస్కృతి తెలంగాణలో మరింత బలపడాలి.


