Ruthika commits suicide: పండగ రోజు ఆ ఇంట్లో విషాదం.. ఎంత పనిచేశావ్ రుతిక..! తల్లిదండ్రులకు కడుపుకోత..!

పండగ రోజు ఆ ఇంట్లో విషాదం నెలకొంది. ఒక్కగానొక్క కూతురు ఆత్మహత్య చేసుకోవడంతో తల్లిదండ్రులు విలవిలాడుతున్నారు. మంచిగా చదువుకో తల్లి, మొబైల్ ఎక్కువ సేపు వాడొద్దని తల్లి మందలించింది. దీంతో మనస్తాపానికి గురైన యువతి గదిలో ఫ్యాన్‌కు ఉరివేసుకొని ఆత్మహత్య చేసుకుంది. హైదరాబాద్‌లోని అల్వాల్ పోలీస్‌స్టేషన్ పరిధిలో ఈ ఘటన జరిగింది. అల్వాల్ ఎస్‌ఐ రాఘవేందర్‌రెడ్డి తెలిపిన వివరాల ప్రకారం.. మచ్చబొల్లారం, గోపాల్‌నగర్ ద్వారకనగర్ కాలనీకి చెందిన అర్చన, నాగార్జున దంపతులు, వీరికి రుతిక(19) అనే కూతురు ఉంది. అల్వాల్ లయోలా కాలేజీలో డిగ్రీ మొదటి సంవత్సరం చదువుతోంది. అయితే రుతిక చదువును నిర్లక్ష్యం చేయడం, తరుచుగా ఫోన్‌లో మాట్లాడటం, చాటింగ్‌కే సమయం ఎక్కువగా గడపడంతో తల్లి కోప్పడేది. ఈ క్రమంలో బుధవారం కూడా మందలించడంతో మనస్తానికి గురైన రుతిక ఇంట్లో ఎవరూ లేని సమయంలో ఆత్మహత్య చేసుకుంది. పోలీసులు సంఘటన స్థలానికి చేరుకొని మృతదేహాన్ని గాంధీ మార్చురికి తరలించారు. ఒక్కగానొక్క కూతురు తమ కళ్లెదుటే విగతజీవిగా పడి ఉండడాన్ని తల్లిదండ్రులు తట్టుకోలేక వారి రోదనలు మిన్నంటాయి.


