జూబ్లీహిల్స్‌ ఉప ఎన్నికలో రాజకీయ పార్టీలు అనుసరించిన తీరు ఇప్పుడు కొత్త వివాదానికి దారితీసింది.

జూబ్లీహిల్స్‌ ఉప ఎన్నికలో రాజకీయ పార్టీలు అనుసరించిన తీరు ఇప్పుడు కొత్త వివాదానికి దారితీసింది. ఎన్నికల సమయంలో ఓటర్లకు విచ్చలవిడిగా డబ్బు పంచిపెట్టిన నాయకులు, ఇప్పుడు ఓటు వేయని వారి నుంచి ఆ డబ్బును తిరిగి రాబట్టేందుకు ప్రయత్నిస్తున్నారు. బస్తీలు, కాలనీలు, అపార్ట్‌మెంట్లలో స్థానిక నాయకులు రంగంలోకి దిగి, డబ్బులు తీసుకుని ఓటు వేయని వారిని నిలదీస్తున్నారు. దీంతో ఓటర్లు తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారు.

ఈ ఉప ఎన్నికను అధికార కాంగ్రెస్, సిట్టింగ్ స్థానాన్ని కాపాడుకోవాలని చూస్తున్న బీఆర్‌ఎస్‌ అత్యంత ప్రతిష్ఠాత్మకంగా తీసుకున్నాయి. గెలుపే లక్ష్యంగా ప్రధాన పార్టీలు భారీగా డబ్బు పంపిణీ చేశాయి. అయితే పోలింగ్ ముగిసిన తర్వాత కథ అడ్డం తిరిగింది. పోలింగ్ కేంద్రాల్లోని ఏజెంట్ల ద్వారా ఓటు వేసిన వారి జాబితాను, తాము డబ్బు పంపిణీ చేసిన జాబితాతో సరిపోల్చుకుంటున్నారు. డబ్బులు తీసుకుని చాలా మంది ఓటు వేయలేదని గుర్తించిన పార్టీల బూత్ కమిటీ సభ్యులు, ఇప్పుడు వారి నుంచి డబ్బులు వసూలు చేసే పనిలో పడ్డారు.

ఎస్పీఆర్‌ హిల్స్‌లో ఓ కుటుంబం 18 ఓట్లకు గాను సుమారు రూ.45 వేలు తీసుకోగా, వారిలో కేవలం నలుగురే ఓటు వేశారని స్థానిక నాయకులు గుర్తించారు. మిగిలిన 14 మందికి సంబంధించిన డబ్బును వెంటనే తిరిగి ఇవ్వాలని ఆ కుటుంబంపై ఒత్తిడి తెస్తున్నారు. ఎర్రగడ్డ, రహమత్‌నగర్‌, యూసుఫ్‌గూడ వంటి డివిజన్లలో ఈ పరిస్థితి ఎక్కువగా కనిపిస్తోంది. కొన్ని ప్రాంతాల్లోనైతే, బస్తీ ముఖ్యులే జోక్యం చేసుకుని, "ఆ డబ్బులు మీరైనా వసూలు చేసి బస్తీ అవసరాలకు వాడుకోండి" అని పార్టీ నేతలు సూచిస్తున్నట్లు సమాచారం.

ఈ వ్యవహారం అపార్ట్‌మెంట్లలో మరో మలుపు తీసుకుంది. మధురానగర్‌లోని ఓ అపార్ట్‌మెంట్‌లో ఓటు వేయని వారి జాబితాను పార్టీ నాయకులు అపార్ట్‌మెంట్‌ వాసులకు అందించారు. దీంతో వారు సమావేశమైన, డబ్బులు తీసుకుని ఓటు వేయని వారు ఆ మొత్తాన్ని తిరిగి ఇస్తే, దానిని అపార్ట్‌మెంట్‌ నిర్వహణ ఖర్చులకు వినియోగించుకోవాలని తీర్మానం చేశారు. ఈ విచిత్రమైన నిర్ణయానికి ఆ పార్టీ బూత్ కమిటీ సభ్యులు కూడా అంగీకరించడం గమనార్హం. మొత్తం మీద, ఓటుకు నోటు వ్యవహారం జూబ్లీహిల్స్‌ ఓటర్లకు కొత్త కష్టాలు తెచ్చిపెట్టింది.

Updated On
ehatv

ehatv

Next Story